
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా శశాంక్ మనోహర్ అదనంగా మరో రెండు నెలల పాటు పదవిలో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఐసీసీ బోర్డు సమావేశం కరోనా కారణంగా వాయిదా పడటమే అందుకు కారణం. మనోహర్ పదవీ కాలం వాస్తవానికి జూన్‌లో ముగియాల్సి ఉంది. ఆయన తప్పుకుంటే చైర్మన్‌గా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) చైర్మన్ కొలిన్ గ్రేవ్స్ ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. హాంకాంగ్‌కు చెందిన ఇమ్రాన్ ఖాజా ఈ పదవి కోసం తహతహలాడినా... శాశ్వత సభ్య దేశాల మద్దతు ఆయనకు దక్కలేదు. మరో వైపు మనోహర్ తప్పుకోవడంపై చివరి నిమిషం వరకు ఏమీ చెప్పలేమని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. శశాంక్ అనుకుంటే మరోసారి కూడా ఎంపిక కాగలరని ఆయన అన్నారు. చైర్మన్‌గా శశాంక్ వచ్చినప్పటినుంచి ఐసీసీతో భారత బోర్డుకు సత్సంబంధాలు లేవు.