
డిసెంబర్ 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న జై షా రెండు విడతల్లో (చెరి మూడేళ్లు) ఆరేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నాడని తెలుస్తుంది. దుబాయ్ వేదికగా ఇటీవల జరిగిన ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ పదవి మూడు విడతల్లో ఆరేళ్ల పాటు ఉంది. ఈ మోడల్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు తెలుస్తుంది.
కాగా, జై షా ఇటీవలే ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. గ్రెగ్ బార్‌క్లే స్థానంలో జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. బార్‌క్లే 2020 నుంచి రెండు విడతల్లో ఐసీసీ చైర్మన్‌గా పని చేశాడు. వాస్తవానికి బార్‌క్లే పదవీకాలం మరో రెండేళ్ల పాటు ఉండింది. అయితే బార్‌క్లే వ్యక్తిగత కారణాల చేత చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నూతన చైర్మన్‌గా షా ఎంపికయ్యాడు.
మరోవైపు ఐసీసీ ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి కూడా ప్రస్తుతం ఖాళీగా ఉంది. ఈ పదవిలో పెప్సీకో చైర్ పర్సన్ ఇంద్రా నూయి మూడు విడతల్లో కొనసాగింది. ఇంద్ర నూయి ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగినప్పటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.
జై షా తర్వాత ఎవరు..?
ఐసీసీ చైర్మన్‌గా జై షా నియామకం ఖరారైపోయిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఎవరు చేపడతారని సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త కార్యదర్శి రేసులో ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ముందున్నట్లు తెలుస్తుంది. రోహన్‌తో పాటు బీసీసీఐ ట్రెజరర్ ఆశిష్ షెలార్, జాయింట్ సెక్రెటరీ దేవజిత్ సైకియా, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ అనిల్ పటేల్ కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment