దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌ను ఎంపిక చేసే విషయంపై సోమవారం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. దీనికి ప్రధాన కారణం భారత్, పాకిస్తాన్ బోర్డుల మధ్య సయోధ్య లేకపోవడమేనని తెలిసింది. ఓటు హక్కు ఉన్న సభ్య దేశాల్లో మూడింట రెండొంతల మెజార్టీ ప్రకారం చైర్మన్‌ను ఎన్నుకోవాలని పాకిస్తాన్, దానికి మద్దతిస్తున్న దేశాలు చెబుతుండగా... ఎన్నికలు నిర్వహించాలని, సాధారణ మెజార్టీ ప్రకారమే ఎంపిక జరగాలని భారత్ వాదిస్తోంది. ఈ విషయంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్‌కు మద్దతునిస్తున్నాయి.
ప్రస్తుతం ఐసీసీలో 17 సభ్య దేశాలకు ఓట్లు ఉన్నాయి. పాక్ చెబుతున్నదాని ప్రకారం కనీసం 12 దేశాలు కొత్త చైర్మన్ కోసం మద్దతివ్వాల్సి ఉంటుంది. అదే ఎన్నిక జరిగితే గెలుపు కోసం 9 ఓట్లు చాలు. దురదృష్టవశాత్తూ ఏ పద్ధతి అనుసరించాలనేదానిపై ఐసీసీలోనే స్పష్టత లేకపోవడమే సమస్యగా మారింది. ‘ప్రస్తుతం ఇది భారత్, పాక్ మధ్య పోరుగా మారింది. దీనిపై ఏదో ఒక తీర్మానం చేసి త్వరలోనే పరిష్కారం కనుగొనాల్సి ఉంది’ అని ఐసీసీ ప్రతినిధి ఒకరు అభిప్రాయ పడ్డారు. ఈ అంశంపై మున్ముందు ఐసీసీ ఎలా వ్యవహరిస్తుందనేది ఆసక్తికరం.
Comments
Please login to add a commentAdd a comment