
బీసీసీఐకి శశాంక్ మనోహర్ గుడ్‌బై!
ఐసీసీ చైర్మన్‌గా వెళ్లే అవకాశం ఆరున్నర కోట్లు ఆడుగుతున్న సీఈఓ
న్యూఢిల్లీ: మరో రెండు వారాల్లో బీసీసీఐలో విప్లవాత్మకమైన భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఎన్నికైన ప్రతినిధులతో పాటు జీతభత్యాలు తీసుకుంటున్న చాలా మంది బోర్డుకు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ముందుగా బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తన పదవి నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారు. ఐసీసీ చైర్మన్‌గా పోటీ చేసేందుకు వీలుగా ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నారు. మే నెలలో జరగనున్న ఐసీసీ ఎన్నికలకు ముందే బోర్డు పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే రాజీనామా విషయంపై మనోహర్‌గానీ, ఆయన అనుచరులుగానీ ఏమాత్రం నోరు విప్పడం లేదు. ఒకవేళ మనోహర్ ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకుంటే ఐదేళ్ల పాటు (2021) ఆ పదవిలో కొనసాగొచ్చు. ‘
బోర్డుకు సంబంధించిన ప్రతి అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. ఐసీసీలో పదవి ఐదేళ్లు ఉంటుంది. కాబట్టి పరిపాలనలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి ఇది మంచి అవకాశం’ అని మనోహర్ అనుచరుడు ఒకరు వ్యాఖ్యానించారు. మరోవైపు మనోహర్ తర్వాత శాశ్వత, ఒప్పంద ఉద్యోగుల్లో చాలా మంది రాజీనామా చేస్తారని బోర్డు భావిస్తోంది. అలాగే ఈ ఏడాది నుంచి సొంత వ్యాఖ్యాతల బృందాన్ని కూడా కొనసాగించకపోవచ్చు.
జోహ్రికి రూ. 6.5 కోట్లు: కొత్తగా నియమించుకున్న బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి... తనకు ఏడాదికి ఆరున్నర కోట్ల జీతం ఇవ్వాలని బోర్డును కోరుతున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఓవైపు నిరసన వ్యక్తం చేస్తూనే నిషేధిత రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తన వార్షిక ఫీజును బోర్డుకు చెల్లించింది.