
తప్పుకోనున్న శశాంక్ మనోహర్!
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకోనున్నట్లు సమాచారం. ఇకపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఆయన పూర్తిస్తాయిలో కొనసాగే అవకాశం ఉండటంతో ఈ పదవికి రాజీనామా చేయాలని మనోహర్ భావిస్తున్నారు. ఐసీసీలోని 13 మంది సభ్య బోర్డులు ఏకగ్రీవంగా మనోహర్‌ను చైర్మన్‌ను చేసేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నిక కోసం శశాంక్ పేరును క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ డేవిడ్ పీవర్ ప్రతిపాదిస్తుండగా, ఈసీబీ చీఫ్ గైల్స్ క్లార్క్ మద్దతు పలుకుతున్నారు.
ఈ ప్రక్రియ మొత్తం మే 23లోగా పూర్తి కావాల్సి ఉంది. దాల్మియా ఆకస్మిక మృతితో ఏడాది క్రితం బోర్డు అధ్యక్షుడిగా ఎంపికైన శశాంక్ మనోహర్, తక్కువ వ్యవధిలోనే బీసీసీఐలో ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు. మనోహర్ దిగిపోతే ఆయన స్థానంలో ఈ పదవి కోసం శరద్ పవార్ ముందు వరుసలో ఉన్నట్లు వినిపిస్తోంది.