'అవును..అనురాగ్ లేఖ రాయమన్నాడు'
న్యూఢిల్లీ:ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సతమవుతున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మరింత ఇబ్బందుల్లో పడ్డాడు. లోధా కమిటీ ప్రతిపాదనలను అడ్డుకునేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నుంచి లేఖ రాయమని కోరలేదని గతంలో స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్కు ఇప్పుడు శశాంక్ మనోహర్ వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.
లోధా కమిటీ ప్రతిపాదనల అమలును అడ్డుకునే క్రమంలో తమను లేఖ రాయమని అనురాగ్ కోరినట్లు ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహార్ తాజాగా లోథా కమిటీకి లేఖ ద్వారా తెలియజేశారు.'అవును. లోథా ప్రతిపాదనలను అడ్డుకోవడంలో భాగంగా అనురాగ్ మమ్మల్ని సంప్రదించాడు. ఈ మేరకు ఆగస్టు 7వ తేదీన లేఖ రాయమని అనురాగ్ అడిగాడు. లోధా ప్రతిపాదనల్ని అమలు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత అనురాగ్ లేఖ రాయమన్నాడు' అని శశాంక మనోహర్ పేర్కొన్న విషయాన్ని జాతీయ దినపత్రిక ఇండియా టు డే వెల్లడించింది.
లోధా ప్యానెల్ సూచనలను బీసీసీఐ బేఖాతరు చేస్తూ అన్ని కమిటీల నియామకం చేపట్టడంతో పాటు కార్యదర్శి ఎన్నిక కూడా చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిన విషయం తెలిసిందే. దాంతో లోధా కమిటీ సిఫారుసులు అమలు చేసే వరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు నిధులు మంజూరు చేయకూడదని సుప్రీం కోర్టు గత తీర్పులో ఆదేశించింది.