
మనోహర్‌కు గంగూలీ మద్దతు!
బోర్డు అధ్యక్ష పదవికి పేరు ప్రతిపాదించే అవకాశం
కోల్‌కతా: బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ పేరు దాదాపు ఖాయమైంది. ఈమేరకు ఈస్ట్‌జోన్ నుంచి తమ అభ్యర్థిగా మనోహర్ పేరును బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సౌరవ్ గంగూలీ ప్రతిపాదించనున్నారు. క్యాబ్‌తో పాటు ఎన్‌సీసీ, త్రిపుర, జార్ఖండ్ క్రికెట్ సంఘాలు మనోహర్‌కు పూర్తి మద్దతునిస్తున్నాయి. ముందుగా సౌరవ్ తమ క్రికెట్ సంఘం ఎస్‌జీఎంను ఏర్పాటు చేసి... ఇప్పటిదాకా ఉన్న సంయుక్త కార్యదర్శి పదవికి రాజీనామా చేయనున్నారు.
బీసీసీఐ ఏజీఎంలో పాల్గొనడానికి ముందే క్యాబ్ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేస్తారు. క్యాబ్ ఏజీఎం ఎప్పుడనేది అక్టోబర్ 1న ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు బీసీసీఐ కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం బోర్డు ఎస్‌జీఎం ఎప్పుడనేది రాష్ట్ర యూనిట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోర్డు నిబంధనల ప్రకారం ఖాళీ అయిన అధ్యక్ష స్థానానికి ఎన్నిక కోసం 15 రోజుల్లోగా ఎస్‌జీఎం ఏర్పాటును వెల్లడించాలి. ఈనెల 20న దాల్మియా మరణించాడు కాబట్టి వచ్చేనెల 5 వరకు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు సమయం ఉంది.