ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ
ముంబై : ఐపీఎల్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంగ్లండ్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న లలిత్ మోదీ.. తెర వెనుక మాత్రం తన ప్రయత్నాలు ఆపడం లేదు. తనకు బద్ద శత్రువుగా భావించే ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ వ్యతిరేకులతో నిత్యం సంప్రదింపులు చేస్తున్నట్టు వెల్లడయ్యింది. శ్రీనికి ముందు బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న శశాంక్ మనోహర్‌తో ఈమెయిల్స్ ద్వారా మోదీ టచ్‌లో ఉన్నట్టు తేలింది. గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం బయటపడినప్పుడు ఆ జట్టును రద్దు చేయాల్సిందిగా ఒత్తిడి పెంచాలని మనోహర్‌కు సూచించారు. ‘జరుగుతున్న వ్యవహారం మీకు తెలిసిందే.
‘సాహిబ్’ (శరద్ పవార్)కు కూడా లండన్‌లో ఈ విషయాలను తెలిపాను. నా అభిప్రాయం ప్రకారం చెన్నై, రాజస్తాన్ జట్లను లీగ్ నుంచి తొల గించాలని అంతా ఒత్తిడి తేవాలి. తిరిగి కొత్త యజమానుల కోసం తాజాగా వేలం జరగాలి’ అని 2013లో పంపిన మెయిల్‌లో మోదీ పేర్కొన్నారు. మనోహర్ నుంచి కూడా మెయిల్స్ వెళ్లినట్టు సమాచారం. అలాగే శ్రీనిపై సుప్రీం కోర్టులో కేసు వేసిన బిహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మకు కూడా తాను ఆర్థిక సహాయం చేసినట్టు లలిత్ మోదీ గతంలోనే పేర్కొన్నారు. అయితే మనోహర్ మాత్రం తనకు మోదీ నుంచి ఎలాంటి మెయిల్స్ రాలేదని చెబుతున్నారు.