బీసీసీఐపై పిడుగుపాటు!
⇒భారీగా ఆదాయం కోల్పోనున్న భారత బోర్డు
⇒కొత్త తరహా ఆదాయ పంపిణీకి ఐసీసీ ఆమోదం
⇒ఓటింగ్‌లో చిత్తుగా ఓడిన బీసీసీఐ
దుబాయ్: ప్రపంచ క్రికెట్‌కి పెద్దన్నలా వ్యవహరిస్తూ అన్నీ తానై నడిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత బోర్డుకు వచ్చే ఆదాయాన్ని భారీగా తగ్గించే అవకాశం ఉన్న కొత్త తరహా పంపిణీ విధానానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) బుధవారం ఆమోద ముద్ర వేసింది. దీని కోసం జరిగిన ఓటింగ్‌లో భారత్ 1–9తో ఓడింది. భారత్ తరఫున ఈ సమావేశంలో పాల్గొన్న అమితాబ్ చౌదరి మినహా మరే దేశం కూడా మనకు అనుకూలంగా వ్యవహరించకపోవడం గమనార్హం. తమకు అనుకూలమైన ‘బిగ్ త్రీ’ విధానాన్నే కొనసాగింపజేసేందుకు భారత్ గట్టిగా ప్రయత్నించింది. ఈ సమావేశానికి ముందు వరకు కూడా చివరి క్షణంలో అయినా నయానో, భయానో ఇతర దేశాల మద్దతు కూడగట్టగలమని భావిస్తూ వచ్చిన బీసీసీఐని తాజా ఫలితం నిర్ఘాంతపోయేలా చేసింది. ఇదే సమావేశంలో భవిష్యత్తులో ఐసీసీ పరిపాలనలో తీసుకురాబోతున్న మార్పులపై కూడా ఓటింగ్ నిర్వహించగా ఫలితం భారత్‌కు ప్రతికూలంగానే వచ్చింది.
ఇందులో బీసీసీఐ 2–8 తేడాతో ఓడింది. ఇక్కడ మనకు శ్రీలంక బోర్డు మాత్రమే అండగా నిలిచింది. రెండు సందర్భాల్లోనూ మనకు అనుకూలంగా వ్యవహరిస్తాయని భావించిన జింబాబ్వే, బంగ్లాదేశ్ కూడా పట్టించుకోకపోవడం ఆశ్చర్యకర పరిణామం. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ‘బిగ్ త్రీ’ విధానం ప్రకారం భారత్‌కు 570 మిలియన్ డాలర్ల ఆదాయం చేకూరేది. దానినే కొనసాగించాలని బీసీసీఐ పట్టుబట్టింది. అయితే ఇప్పుడు కొత్త ప్రతిపాదనల అమలుతో భారత్‌కు కేవలం 290 మిలియన్ డాలర్లు మాత్రమే దక్కనున్నాయి. అంటే 280 మిలియన్ డాలర్ల వరకు బీసీసీఐ నష్టపోనుంది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు సమావేశానికి ముందు రోజు భారత్‌కు మరో 100 మిలియన్ డాలర్లు (మొత్తం 390 మిలియన్ డాలర్లు) అదనంగా ఇస్తామని ఐసీసీ ప్రతిపాదిస్తే... బీసీసీఐ ఏకపక్షంగా తిరస్కరించింది.
అంతా ఆయన వల్లే: భారత్‌కు తీవ్ర నష్టం కలిగించనున్న కొత్త విధానాన్ని రూపొందించడం మొదలు ఆమోదించుకోవడం వరకు ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్ కీలక పాత్ర పోషించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అయిన మనోహర్ ఐసీసీ పదవిలోకి వచ్చిన దగ్గరి నుంచి మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని మన బోర్డు మొదటి నుంచీ ఆరోపిస్తోంది. ‘భారత్ ప్రయోజనాలు కాపాడటమే మా లక్ష్యం. సమావేశంలో కూడా మేం దాని గురించే మాట్లాడాం. అయితే మనోహర్ వ్యవహారశైలి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టింది. ఇది మా పరాజయం కాదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రతీకార చర్యలా ఉంది. జింబాబ్వేకు కూడా 19 మిలియన్ డాలర్లు ఇస్తామని ఆయన ఎలా హామీ ఇస్తారు’ అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. వాస్తవానికి చాలా రోజుల క్రితమే మనోహర్, బోర్డు పరిపాలకుల కమిటీ (సీఓఏ)తో సుదీర్ఘ చర్చలు జరిపారు.
ఆ తర్వాతే మరో 100 మిలియన్ డాలర్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మొత్తంగా 390 మిలియన్ డాలర్లు అంటే తక్కువేమీ కాదన్నట్లుగా ఐసీసీ ఆఫర్ ఇచ్చింది. ఈ మొత్తం అందించి పరిపాలనలో మార్పుల విషయంలో బీసీసీఐతో కలిసి పని చేయాలని ఐసీసీ భావించింది. ఈ నేపథ్యంలో వివాదానికి తావు లేకుండా సీఓఏ కూడా మధ్యే మార్గాన్ని అనుసరించేందుకు ప్రయత్నించింది. అయితే సీఓఏ సభ్యులతో పెద్దగా సంబంధాలు లేని అమితాబ్ చౌదరి, అనిరుధ్ చౌదరి సమావేశానికి హాజరై తమ వాటా కోసం గట్టిగా పట్టుబట్టడంతో మొదటికే మోసం వచ్చింది.
బీసీసీఐ అత్యవసర సమావేశం!
చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించకుండా ఇప్పటికే తన అసంతృప్తిని ప్రదర్శించిన బీసీసీఐ ఈ విషయంలో ఇప్పుడు ఏం చేస్తుందనేది కీలకంగా మారింది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకునే అవకాశాలు కూడా బోర్డు కొట్టి పారేయలేదు. ‘మా స్పందన తెలియజేసేందుకు మాకు అనేక దారులు ఉన్నాయి. వివిధ టోర్నీలలో జట్లు పాల్గొనడానికి సంబంధించి ఉన్న ఒప్పందాన్ని కూడా ఐసీసీ ఉల్లంఘించింది. సమావేశం నుంచి తిరిగి రాగానే బీసీసీఐ అత్యవసర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తాం. అందులో అందరితో చర్చించిన తర్వాత ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.