
శశాంక్ గుడ్‌బై
► బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా
► ఐసీసీ చైర్మన్ ఎన్నికలకు సిద్ధం
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. గత అక్టోబరులో జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపికైన మనోహర్... లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బోర్డులో చర్చ సాగుతున్న కీలక సమయంలో తప్పుకోవడం ఆసక్తికరం. ‘బీసీసీఐ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఐసీసీ, ఏసీసీలలో కూడా బోర్డు ప్రతినిధిగా ఉన్న నేను ఆ పదవులనుంచి కూడా తప్పుకుంటున్నాను. ఇంతకాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బోర్డు నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.
పూర్తి స్థాయి చైర్మన్‌గా...
ప్రస్తుతం కూడా ఐసీసీ చైర్మన్‌గా ఉన్న 58 ఏళ్ల శశాంక్ పదవీకాలం జూన్‌లో పూర్తవుతుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఐదేళ్ల కాలం పాటు ఆ హోదాలో పని చేయాలని ఆయన భావిస్తున్నారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం చైర్మన్ ఏ బోర్డులోనూ పదవిలో లేకుం డా స్వతంత్రంగా ఉంటూ పోటీ చేయాలి. దీని కోసం ఆయన సిద్ధమయ్యారు. అందుకే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పుటికే పలు దేశాల బోర్డులు మనోహర్ అభ్యర్థిత్వానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. జూన్‌లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే శశాంక్ 2021 వరకు కొనసాగుతారు.
వారసుడెవరు..?
మనోహర్ తప్పుకుంటారని తెలిసిన నాటినుంచి అధ్యక్ష పదవి కోసం మళ్లీ రేసు మొదలైంది. అందరికంటే ముందుగా శరద్ పవార్ పేరే వినిపిస్తోంది. ఆయనకు కూడా ఈ కోరిక ఉంది. అయితే 75 ఏళ్ల వయసులో పవార్ మళ్లీ పదవిలోకి రావడం కొత్తగా కోర్టు సమస్యలు తెచ్చి పెడుతుందని బోర్డులో చాలా మంది భావిస్తున్నారు. ఇక బోర్డులో అడుగుపెట్టిననాటినుంచి వేగంగా ఎదిగిపోయిన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ శుక్లా కూడా దీనిపై మనసు పడ్డారు. బోర్డులో ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహించిన శుక్లా ‘తదుపరి లక్ష్యం అధ్యక్ష పదవే’ అని తన సన్నిహితుల సమక్షంలో చెప్పుకున్నారు. ఇక అజయ్ షిర్కేలాంటి మరికొందరు ఆశిస్తున్నా... వారికి అంత సులువు కాదు.