Jagmohan Dalmiya
-
ఐసీసీ చైర్మన్ పదవి.. బరిలో గంగూలీ, జై షాతో పాటు కేంద్ర మంత్రి..!
Anurag Thakur In ICC Chairman Race: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా గ్రెగ్ బార్ల్కే (న్యూజిలాండ్) పదవీకాలం ఈ ఏడాది నవంబర్‌తో ముగియనుండడంతో ఆ పదవి కోసం ఇప్పటి నుంచి పోటీ మొదలైంది. క్రికెట్‌కు సంబంధించి అత్యున్నతమైన ఈ పదవిని దక్కించుకునేందుకు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా సహా ఓ కేంద్ర మంత్రి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఐసీసీ చైర్మన్ గిరికి అర్హత సాధించగా.. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ, ఐసీసీ ఆఫీస్ బేరర్‌గా జై షా సైతం ఈ పదవికి అర్హత కలిగి ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పదవిని దక్కించుకునేందుకు గంగూలీ ముందు నుంచే పావులు కదపగా.. తాజాగా జై షా, అనురాగ్ ఠాకూర్ సైతం ఐసీసీ పీఠాన్ని అధిరోహించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కాగా, ఐసీసీ చైర్మన్లుగా గతంలో నలుగురు భారతీయులు పని చేసిన సంగతి తెలిసిందే. తొలుత బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, పారిశ్రామికవేత్త జగ్మోహన్ దాల్మియా, ఆతరువాత మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్, చెన్నై సూపర్ కింగ్స్ అధినేత శ్రీనివాసన్, సీనియర్ న్యాయవాది శశాంక్ మనోహర్ ఐసీసీ చైర్మన్ హోదాలో పని చేశారు. చదవండి: రెచ్చిపోయిన హనుమ విహారీ.. సెంచరీ, హాఫ్ సెంచరీ సహా 216 పరుగులు..! -
అక్తర్ కెరీర్ దాల్మియా చలవే!
కరాచీ: భారత దివంగత క్రికెట్ పాలకుడు జగ్మోహన్ దాల్మియా ఇచ్చిన సహకారంతోనే పాకిస్తాన్ మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ కెరీర్ కొనసాగిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ అధ్యక్షుడు తౌకీర్ జియా వ్యాఖ్యానించారు. దాల్మియా 1997 నుంచి 2000 వరకు ఐసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1999లో అక్తర్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని విమర్శలు రావడంతో ఐసీసీ కన్నేసింది. ‘ఐసీసీ సభ్యులంతా అక్తర్ బౌలింగ్ యాక్షన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసినా... దాల్మియా మాకు మద్దతుగా నిలిచారు. ఐసీసీలో అయనకున్న పలుకుబడి దృష్ట్యా మిగతా సభ్యుల అభ్యంతరాలన్నీ వీగిపోయాయి. జన్మతః వచ్చిన సమస్య వల్లే అలాంటి యాక్షన్‌తో అక్తర్ బౌలింగ్ చేస్తున్నట్లు నమ్మబలకడంతో ఆ వివాదం అంతటితో ముగిసింది’ అని జియా తెలిపారు. రూ. 690 కోట్ల నష్టం... గత ఐదేళ్ల కాలంలో భారత్‌తో సిరీస్ ఆడకపోవ డంతో పీసీబీ కు వచ్చిన అక్షరాలా రూ.690 కోట్ల నష్టం వచ్చింది. భారత్‌తో ఆడితేనే పూర్తి మొత్తం ఇస్తామని లేదంటే కోత తప్పదని ప్రసారకర్తలతో జరిగిన ఒప్పందంలో స్పష్టంగా వుంది. -
శశాంక్ గుడ్‌బై
► బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా ► ఐసీసీ చైర్మన్ ఎన్నికలకు సిద్ధం ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్ష పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. గత అక్టోబరులో జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మరణం తర్వాత ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎంపికైన మనోహర్... లోధా కమిటీ సిఫారసుల అమలుకు సంబంధించి బోర్డులో చర్చ సాగుతున్న కీలక సమయంలో తప్పుకోవడం ఆసక్తికరం. ‘బీసీసీఐ అధ్యక్ష పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది. ఐసీసీ, ఏసీసీలలో కూడా బోర్డు ప్రతినిధిగా ఉన్న నేను ఆ పదవులనుంచి కూడా తప్పుకుంటున్నాను. ఇంతకాలం సహకరించిన అందరికీ కృతజ్ఞతలు’ అని కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. బోర్డు నిబంధనల ప్రకారం 15 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి చైర్మన్‌గా... ప్రస్తుతం కూడా ఐసీసీ చైర్మన్‌గా ఉన్న 58 ఏళ్ల శశాంక్ పదవీకాలం జూన్‌లో పూర్తవుతుంది. భవిష్యత్తులో పూర్తి స్థాయిలో ఐదేళ్ల కాలం పాటు ఆ హోదాలో పని చేయాలని ఆయన భావిస్తున్నారు. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం చైర్మన్ ఏ బోర్డులోనూ పదవిలో లేకుం డా స్వతంత్రంగా ఉంటూ పోటీ చేయాలి. దీని కోసం ఆయన సిద్ధమయ్యారు. అందుకే బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇప్పుటికే పలు దేశాల బోర్డులు మనోహర్ అభ్యర్థిత్వానికి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. జూన్‌లో జరిగే ఎన్నికల్లో గెలిస్తే శశాంక్ 2021 వరకు కొనసాగుతారు. వారసుడెవరు..? మనోహర్ తప్పుకుంటారని తెలిసిన నాటినుంచి అధ్యక్ష పదవి కోసం మళ్లీ రేసు మొదలైంది. అందరికంటే ముందుగా శరద్ పవార్ పేరే వినిపిస్తోంది. ఆయనకు కూడా ఈ కోరిక ఉంది. అయితే 75 ఏళ్ల వయసులో పవార్ మళ్లీ పదవిలోకి రావడం కొత్తగా కోర్టు సమస్యలు తెచ్చి పెడుతుందని బోర్డులో చాలా మంది భావిస్తున్నారు. ఇక బోర్డులో అడుగుపెట్టిననాటినుంచి వేగంగా ఎదిగిపోయిన కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా అధ్యక్ష పీఠంపై కన్నేశారు. ఐపీఎల్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ శుక్లా కూడా దీనిపై మనసు పడ్డారు. బోర్డులో ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వహించిన శుక్లా ‘తదుపరి లక్ష్యం అధ్యక్ష పదవే’ అని తన సన్నిహితుల సమక్షంలో చెప్పుకున్నారు. ఇక అజయ్ షిర్కేలాంటి మరికొందరు ఆశిస్తున్నా... వారికి అంత సులువు కాదు. -
అరెరె.. కేంద్ర మంత్రి కాన్వాయ్ ఎక్కడ?
కోల్‌కతా : కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ కాన్వాయ్ కొద్దిసేపు కనిపించకపోవటంతో అధికారులకు కొద్దిసేపు ముచ్చెమటలు పట్టాయి. వివరాల్లోకి వెళితే... బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా నివాసానికి శనివారం అరుణ్ జైట్లీ బయలుదేరారు. అయితే మార్గమధ్యలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ మిగతా వాహనాల నుంచి వేరయింది. కేంద్రమంత్రి సెక్యూరిటీ అధికారులు, కోల్ కతా పోలీసుల మధ్య సమాచారలోపం తలెత్తడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అయితే జైట్లీ కారు రాజ్ భవన్‌కు చేరుకుందని సమాచారం అందుకున్న అధికారులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవలే మరణించిన క్రికెట్ దార్శనికుడు జగ్మోహన్ దాల్మియా కుటుంబసభ్యులను పరామర్శించడానికి కోల్ కతాలోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జైట్లీ కాన్వాయ్ వాహనాలతో బయలుదేరారు. అయితే మార్గమధ్యలో కాన్వాయ్ అన్ని వాహనాలు ముందుగా సూచించిన దారిలో వెళ్తుండగా, మంత్రి ప్రయాణిస్తున్న వాహనం ఏజేసీ రోడ్ ఫ్లైఓవర్ దగ్గర దారి మళ్లింది. అక్కడి నుంచి ఆ కాన్వాయ్ నేరుగా రాజ్ భవన్ చేరుకుంది. అనంతరం దాల్మియా నివాసానికి షెడ్యూల్ కంటే అరగంట ఆలస్యంగా జైట్లీ ఉన్న కారు చేరుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. మంత్రి కాన్వాయ్ కి ఉన్న జామర్ కారణంగా కొన్నిసార్లు సమాచారలోపం తలెత్తి ఇలాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందన్నారు. -
ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై ప్రభావం!
ఇస్లామాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణం భారత- పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పాకిస్థాన్ డైలీ పేర్కొంది. గత రెండు రోజుల క్రితం గుండె పోటుతో జగ్మోహన్ దాల్మియా దూరం కావడం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలకు తీవ్ర విఘాతంగా అభిప్రాయపడింది. ఈ రోజు తన సంపాదకీయంలో దాల్మియా మృతి- ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై పాకిస్థాన్ డైలీ విశ్లేషించింది. 1987 తరువాత వరల్డ్ కప్ ఇంగ్లండ్ నుంచి బయటకు తీసుకురావడంలో దాల్మియా కృషిని కొనియాడింది. కాగా, భారత్-పాకిస్థాన్ ల క్రికెట్ సిరీస్ లు జరగడానికి పరిస్థితులు మెరుగవుతున్న తరుణంలో దాల్మియా మృతి నిజంగా తీరని లోటుగానే మిగిలిపోతుందని తెలిపింది. అంతకుముందు ఎన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగడానికి కొంత బీజం పడిందని.. ఈ క్రమంలోనే డిసెంబర్ లో యూఏఈలో సిరీస్ కూడా క్రికెట్ బోర్డు ఒప్పందాలు చేసుకున్నట్లు డైలీ పేర్కొంది. కాగా, శాంతి చర్చల్లో భాగంగా ప్రస్తుత భారత సర్కారు-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదరకపోవడం కూడా యూఏఈ సిరీస్ పై నీలి నీడలు అలుముకున్నాయని స్పష్టం చేసింది. భారత్ తో క్రికెట్ ను తాము కోరుకోవడం లేదంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్ యార్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. దాల్మియా ఆకస్మిక మృతి ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై మరింత దూరాన్ని పెంచుతుందని డైలీ తెలిపింది. -
అధికార లాంఛనాలతో దాల్మియా అంత్యక్రియలు
కోల్ కతా: గుండె పోటుతో మృతిచెందిన బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) అంత్యక్రియలను సోమవారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. కోల్ కతా నగరంలోని కియోర్తలా శ్మశానవాటికలో దాల్మియా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు బలగాలు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పుల జరిపిన అనంతరం దాల్మియా చితికి కుమారుడు అభిషేక్ దాల్మియా నిప్పంటించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీలు సౌరభ్ గంగూలీ, సుభీర్ గంగూలీలు దాల్మియా అంత్యక్రియలకు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు. కోల్ కతా మేయర్ సోవన్ ఛటర్జీ, మంత్రి ఫిరాద్ హకిమ్.. దాల్మియా అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్తి, బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ లు దాల్మియా అంత్యక్రియలకు హాజరై హాజరై నివాళులు అర్పించారు. దాల్మియా భౌతికకాయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. -
బీసీసీఐ కొత్త బాస్ ఎవరు?
ముంబై: జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో బీసీసీఐ పీఠం ఖాళీ అయ్యింది. ఈ పదవిని ఎవరు అధిరోహిస్తారనే అంశం క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ చాలా శక్తిమంతమైన బోర్డు కాగా భారత క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించి బీసీసీఐ అధ్యక్ష పదవి చాలా కీలకం. ఐసీసీ సంబంధాలతో సహా ఐపీఎల్ నిర్వహణ, జాతీయ సెలెక్షన్ కమిటీ, జట్టు ఎంపిక తదితర వ్యవహారాల్లో బీసీసీఐ చీఫ్ పాత్ర కీలకం. జగ్మోహన్ దాల్మియా మృతితో ఆ పదవిని భర్తీ చేసేందుకు బీసీసీఐ పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. ఈ అంశంపై తాము త్వరలో సమావేశం కానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుణ్ని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. భారత క్రికెట్లో ఐదు జోన్లు ఉన్నాయి. రొటేషన్ పద్దతి ప్రకారం మూడేళ్లకోసారి ఒక్కో జోన్ నుంచి బీసీసీఐ చీఫ్‌ను ఎన్నుకుంటారు. జగ్మోహన్ దాల్మియా ఈస్ట్ జోన్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన బతికుంటే ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు పదవిలో కొనసాగేవారు. ఆయన ఆకస్మిక మరణం వల్ల కొత్త చీఫ్‌ను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్డు నిబంధనల ప్రకారం దాల్మియా స్థానంలో ఈస్ట్ జోన్ నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. లేదా ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల మద్దతు (తప్పనిసరి)తో వేరే వ్యక్తికి పదవి అప్పగించవచ్చు. బీసీసీఐ చీఫ్ పదవికి ప్రధానంగా ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేరు వినిపిస్తోంది. యూపీసీఏ (ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం) అధ్యక్షునిగా శుక్లా ఉన్నారు. ఆయనతో పాటు గౌతమ్ రాయ్ పేరు కూడా బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉంది. అయితే ప్రస్తుతానికి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడ్ని మాత్రమే నియమిస్తామని శుక్లా పేర్కొనడంతో.. పూర్తిస్థాయి అధ్యక్షుడి నియమకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. -
నా స్నేహితుడ్ని కోల్పోయా!
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మృతి పట్ల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ కు ఎనలేని సేవలందించిన తన వ్యక్తిగత స్నేహితుడ్ని కోల్పోయానంటూ హాంకాంగ్ పర్యటనలో ఉన్న జైట్లీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే బీసీసీఐను అత్యున్నత స్థితికి చేర్చిన దాల్మియా లేకపోవడం నిజంగా బాధకరమన్నారు. ఢిల్లీ, జిల్లాల క్రికెట్ అసోసియేన్ కు (డీడీసీఏ) తాను సేవలందించిన సమయంలో దాల్మియాతో పరిచయాన్ని జైట్లీ గుర్తు చేసుకున్నారు. భారత క్రికెట్ కు సంబంధించిన అనేక అంశాలను దాల్మియాతో తాను చర్చించినట్లు పేర్కొన్నారు. 'హాంకాంగ్ లో ఈరోజు ఉదయం లేచిన వెంటనే దాల్మియా మృతిచెందారనే విషాదకర వార్త తెలిసింది. ఆ వార్తతో షాక్ కు గురయ్యా. క్రికెట్ ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. 'దాల్మియా ఆకస్మిక మృతి బీసీసీఐతో పాటు, సీఏబీ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్)కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరనిలోటు. గత నెలలో చివరిసారిగా దాల్మియాను కోల్ కతా నగరంలో కలిశా. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటారని అనుకున్నా. కానీ ఆయన మనల్ని విడిచి వెళ్లిపోవడం నిజంగా బాధాకరం' అని జైట్లీ తెలిపారు. తాను తొలిసారి 1990 వ ప్రాంతంలో దాల్మియాను కలిశానని జైట్లీ పేర్కొన్నారు. క్రికెట్ మ్యాచ్ లను బీసీసీఐ సొంతంగా ప్రసారం చేసుకునే హక్కులను సాధించడం వెనుక దాల్మియా కీలక పాత్ర పోషించారని కొనియాడారు. -
దాల్మియా మృతికి ఐసీసీ సంతాపం
దుబాయ్: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతిపట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. క్రికెట్ కు ఎన్నో సేవలు చేసిన దాల్మియా మృతి ఎప్పటికీ తీరని లోటుగానే మిగిలిపోతుందని ఐసీసీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. క్రికెట్ కు ఆయన చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు. దాల్మియా తన జీవితాన్ని క్రికెట్ కోసమే అంకితం చేశారని.. అటువంటి వ్యక్తి ఇక మన మధ్య లేకపోడం నిజంగా దురదృష్టకరమన్నారు. దాల్మియా ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్రికెట్ ను పటిష్టస్థితికి చేర్చారని.. ఆయన దూరదృష్టి చలవ వల్లే క్రికెట్ ఈరోజు ఇంతటి ఉన్నతస్థాయికి చేరిందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. కాగా, దాల్మియా భౌతికకాయాన్నిచివరిసారి అభిమానులు సందర్శించేందుకు వీలుగా ఈడెన్ గార్డెన్స్ లోని క్రికెట్ అసోసియేషన్ బెంగాల్(సీఏబీ) కార్యాలయానికి తరలించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జగ్మోహన్ దాల్మియా ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. -
దాల్మియా నేత్రాలు దానం
కోల్‌కతా: గుండెపోటుతో మరణించిన బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియా నేత్రాలను దానం చేశారు. దాల్మియా చివరి కోరిక మేరకు ఆయన నేత్రాలను కోల్‌కతాలోని వన్ముక్త ఐ బ్యాంక్‌కు దానం చేశారు. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ సూపర్ పవర్‌గా ఎదగడంలో కీలక పాత్ర పోషించిన దాల్మియ ఆదివారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి ఐసీసీ, బీసీసీఐ అధికారులు, క్రికెటర్లు, మాజీ క్రికెటర్లు, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. -
నిలకడగా దాల్మియా ఆరోగ్య పరిస్థితి
కోల్ కతా: గుండెపోటుతో నగరంలోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గురువారం రాత్రి ఆకస్మికంగా దాల్మియా ఛాతీ నొప్పికి గురికావడంతో ఆయన్ను బీఎమ్ బిర్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న దాల్మియా ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఓ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 72 గంటలపాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారు గత రాత్రి ఛాతీ నొప్పికి గురైన దాల్మియాను తొమ్మిది గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం దాల్మియాకు కరొనరీ యాంజియోగ్రఫీ నిర్వహించిన వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాల్మియా గుండె నొప్పికి గురైన సమాచారాన్ని అందుకున్న బెంగాల్ క్రికెట్ అసోసియన్ అధికారులు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత మార్చినెలలో ఆయన రెండో సారి బీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టారు. అంతకుముందు బీసీసీఐ అధ్యక్షునిగా పని చేసిన దాల్మియా.. పది సంవత్సరాల విరామం తరువాత మరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. -
గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ చీఫ్
-
దాల్మియా అధ్యక్షుడిగా ఎలా పని చేస్తున్నారు!
‘సుప్రీం’ కమిటీ అసంతృప్తి న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోని ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐని అసలు ఎవరు నడిపిస్తున్నారు. బోర్డు అధ్యక్షుడు ఇంత అనారోగ్యంగా ఉన్న విషయం ఆయన సహచరులకు తెలియదా. మూడు నెలల క్రితం ఎన్నుకున్న ఆయన ఇలా ఉంటే పరిస్థితి ఏమిటి’... బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను కలిసిన అనంతరం సుప్రీం కోర్టు కమిటీ ప్రశ్న ఇది. జస్టిస్ లోధా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ పలు అంశాల్లో విచారణ నిమిత్తం మంగళవారం దాల్మియాను కలిసింది. ఈ విచారణ సందర్భంగా దాల్మియా వెంట ఉండేందుకు మానవతా దృక్పథంతో ఆయన కుమారుడు అభిషేక్‌కు కమిటీ అనుమతి ఇచ్చింది. ‘మా ప్రశ్నలను అర్థం చేసుకోవడంలోనే బోర్డు అధ్యక్షుడు ఇబ్బంది పడుతున్నారు. మేం అభిషేక్‌కు ప్రశ్న చెబితే ఆయన తండ్రికి వివరించారు. ఆయన మాటలు అర్థరహితంగా, సంబంధం లేకుండా ఉన్నాయి. దానిని మాకు ఆయన అబ్బాయి చెప్పే క్రమంలో అది మరింత గందరగోళంగా తయారైంది’ అని కమిటీ సభ్యుడొకరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ కథనాన్ని బీసీసీఐ ఖండించింది. -
డీఆర్ఎస్పై చర్చకు సిద్ధం
జగ్మోహన్ దాల్మియా కోల్‌కతా: అంపైర్ నిర్ణయ పునస్సమీక్ష పద్ధతి (డీఆర్ఎస్)పై తమ పాత అభిప్రాయానికే బీసీసీఐ కట్టుబడి ఉందని, అయితే దీనిపై చర్చకు అవకాశం ఉందని బోర్డు అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా వెల్లడించారు. ‘డీఆర్ఎస్పై బోర్డు గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు. అయితే దీనర్థం ఇకపై చర్చించమని కాదు. ప్రస్తుత పద్ధతిలో లోపాలు ఉన్నాయనేది అందరికీ తెలుసు. ఇందులో సాంకేతికాంశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఏర్పడిన బోర్డు సలహా సంఘం అభిప్రాయం కూడా తీసుకుంటాం’ అని దాల్మియా స్పష్టం చేశారు. -
ఆయన నాయకత్వంలో టీమిండియా చాలా సేఫ్...
కోల్‌కతా : భారత క్రికెట్ బోర్డులోకి జగ్ మోహన్ దాల్మియా తిరిగి రావడంతో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు బీసీసీఐ సురక్షితులైన వ్యక్తి చేతుల్లో ఉందంటూ శుక్రవారం గంగూలీ వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఫిక్సింగ్ కుంభకోణాలు, భారత ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమాన్యాలు ఇందులో భాగస్వాములవ్వడం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ని వివాదాల్లోకి నెట్టిన విషయం తెలిసిందే. తొమ్మిదేళ్ల విరామం తర్వాత దాల్మియా చాలా నాటకీయ పరిణామాల మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా తిరిగి ఎంపికయ్యారు. 'మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. బీసీసీఐ అధ్యక్షుడిగా లేకపోయినా మీరంటే మాకు గౌరవం, ప్రేమ ఉన్నాయి. భారత క్రికెట్ ను ఆయన మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. మీ రాకతో టీమిండియా చాలా సేఫ్ గా ఉంటుంది' అని లెఫ్ట్ హ్యాండర్, మాజీ కెప్టెన్ గంగూలీ వ్యాఖ్యానించాడు. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగిన దాల్మియా క్రికెట్ బోర్డును లభాల బాటలో నడిపించిన విషయం అందరికి తెలిసందే. -
బీసీసీఐ అధ్యక్ష పీఠంపై దాల్మియా
చెన్నె: పవర్ గేమ్ లో జగ్మోహన్ దాల్మియా పైచేయి సాధించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో తన పునరాగమనాన్ని ఘనంగా చాటారు. మరో 3 నెలల్లో 75వ ఏట అడుగుపెడుతున్న ఆయన బీసీసీఐ అధ్యక్ష పీఠాన్ని మరోమారు కైవశం చేసుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయి బీసీసీఐలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నారు. దాల్మియా ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. సోమవారం చెన్నైలో జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు ప్రకటించారు. -
బీసీసీఐ అధ్యక్షుడిగా దాల్మియా!
ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధం ఉపాధ్యక్షుడిగా గంగరాజు చెన్నైలో నేడు ఏజీఎం చెన్నై: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరోసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. వాయిదా పడుతూ వస్తోన్న బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) చెన్నైలో నేడు (సోమవారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో జరిగే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ పడేందుకు దాల్మియా ఒక్కరే నామినేషన్ వేశారు. ఈ పదవికి గట్టి పోటీదారుడిగా నిలిచిన మాజీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు ఈస్ట్ జోన్ నుంచి ఎవరూ మద్దతుగా నిలువలేదు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. గతంలో 2001 నుంచి 2004 వరకు దాల్మియా బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు దశాబ్దకాలం అనంతరం ఆయన మరోసారి ఈ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. అటు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ బోర్డు అధ్యక్ష పదవికి పోటీ చేయడం లేదు. దీంతో ఆయన తనకు అనుకూలమైన వ్యక్తిని ఈ పదవిలో కూర్చోబెట్టేందుకు వేగంగా పావులు కదిపారు. ఈ క్రమంలో ‘క్యాబ్’ అధ్యక్షుడు దాల్మియాను నిలబెట్టేందుకు తన మద్దతుదారుల్లో ఏకాభిప్రాయం సాధించారు. పోటీపడే అవకాశం లేకపోయినా ఈ ఎన్నికల్లో శ్రీనివాసన్ ఓటు వేస్తారు. 70 ఏళ్ల దాల్మియా ఈస్ట్ జోన్ నుంచి రెండు ఓట్లను ప్రభావితం చేయనున్నారు. ఈస్ట్ జోన్లో ఉన్న ఆరు యూనిట్లు శ్రీనికి అనుకూలంగా నిలిచాయి. ఆదివారం ఈ విషయంలో వారు సమావేశం కూడా జరిపారు. ప్రస్తుత కార్యదర్శి సంజయ్ పటేల్‌పై ఇదే పదవి కోసం పవార్ శిబిరం నుంచి హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పోటీ పడనున్నారు. సంయుక్త కార్యదర్శిగా అమితాబ్ చౌదరి (జార్ఖండ్), చేతన్ దేశాయ్ (గోవా) పోటీ పడుతున్నారు. కోశాధికారిగా అనిరుధ్ చౌదరి (హర్యానా), రాజీవ్ శుక్లా (యూపీ) పోటీలో ఉన్నారు. శ్రీనివాసన్ గ్రూపు నుంచి ఐదు ఉపాధ్యక్ష పదవుల కోసం ఎంఎల్ నెహ్రూ (నార్త్‌జోన్), ఆంధ్ర క్రికెట్ సంఘం కార్యదర్శి గోకరాజు గంగరాజు (సౌత్‌జోన్), గౌతమ్ రాయ్ (ఈస్ట్‌జోన్), సమర్జిత్ సింగ్ గైక్వాడ్ (వెస్ట్‌జోన్), సీకే ఖన్నా (సెంట్రల్) పోటీపడుతుండగా... ఇందులో తొలి ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. పవార్ గ్రూపు నుంచి ఇవే పదవులకు జ్యోతిరాదిత్య సింధియా (సెంట్రల్), రవి సావంత్ (వెస్ట్) బరిలోకి దిగుతున్నారు. నార్త్ జోన్ నుంచి ఎంపీ పాండవ్ పోటీ చేసే ఆలోచన చేసినా నెహ్రూ కోసం తప్పుకున్నారు. -
దాల్మియాకు లైన్ క్లియర్
చెన్నై: బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు చేపట్టేందుకు జగ్మోహన్ దాల్మియాకు మార్గం సుగమైంది. దశాబ్ద కాలం తర్వాత బీసీసీఐ అధ్యక్ష పదవిని సొంతం చేసుకునేందుకు ఆయన రంగంలోకి దిగారు. ఎన్.శ్రీనివాసన్ వర్గం ఆయనకు మద్దతు తెలపడంతో ఆయన పోటీలో నిలిచారు. ఈనెల 2న జరిగే ఈ ఎన్నికల్లో ఆయన ఎన్నిక లాంఛనం కానుంది. మరాఠా యోధుడు శరద్ పవార్ రేసు నుంచి తప్పుకోవడంతో దాల్మియాకు లైన్ క్లియరయింది. తూర్పు జోన్ నుంచి ప్రవార్ ను ఎవరూ ప్రతిపాదించకపోవడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సివచ్చింది. ప్రస్తుత బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పాటిల్ తన పదవిని నిలుపుకోనున్నారు. -
భారత జట్టును అభినందించిన దాల్మియా!
జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ లో ఘన విజయాన్ని దక్కించుకున్న భారత క్రికెట్ జట్టును బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా ప్రశంసలతో ముంచెత్తారు. జింబాబ్వేతో జరిగిన వన్డే సిరిస్ ను 5-0 తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. 'విదేశీ గడ్డపై క్లీన్ స్పీప్ చేసిన భారత జట్టుకు నా శుభాకాంక్షలు. యువకులతో కూడిన భారత జట్టు విశ్వాసాన్ని నింపింది. పట్టుదలతో ఆడింది' అని దాల్మియా ఓ ప్రకటనలో తెలిపారు. బులవాయోలో జరిగిన ఐదవ వన్డేలో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడంతో 5-0 తేడాతో భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. జింబాబ్వే జట్టుపై విజయంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో భారత జట్టు నంబర్ వన్ స్థానాన్ని పదిలపరుచుకుంది.