ఇస్లామాబాద్: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మరణం భారత- పాకిస్థాన్ క్రికెట్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పాకిస్థాన్ డైలీ పేర్కొంది. గత రెండు రోజుల క్రితం గుండె పోటుతో జగ్మోహన్ దాల్మియా దూరం కావడం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలకు తీవ్ర విఘాతంగా అభిప్రాయపడింది. ఈ రోజు తన సంపాదకీయంలో దాల్మియా మృతి- ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై పాకిస్థాన్ డైలీ విశ్లేషించింది.
1987 తరువాత వరల్డ్ కప్ ఇంగ్లండ్ నుంచి బయటకు తీసుకురావడంలో దాల్మియా కృషిని కొనియాడింది. కాగా, భారత్-పాకిస్థాన్ ల క్రికెట్ సిరీస్ లు జరగడానికి పరిస్థితులు మెరుగవుతున్న తరుణంలో దాల్మియా మృతి నిజంగా తీరని లోటుగానే మిగిలిపోతుందని తెలిపింది. అంతకుముందు ఎన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరు దేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరగడానికి కొంత బీజం పడిందని.. ఈ క్రమంలోనే డిసెంబర్ లో యూఏఈలో సిరీస్ కూడా క్రికెట్ బోర్డు ఒప్పందాలు చేసుకున్నట్లు డైలీ పేర్కొంది. కాగా, శాంతి చర్చల్లో భాగంగా ప్రస్తుత భారత సర్కారు-పాకిస్థాన్ మధ్య సయోధ్య కుదరకపోవడం కూడా యూఏఈ సిరీస్ పై నీలి నీడలు అలుముకున్నాయని స్పష్టం చేసింది. భారత్ తో క్రికెట్ ను తాము కోరుకోవడం లేదంటూ పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్ యార్ ఖాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు.. దాల్మియా ఆకస్మిక మృతి ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై మరింత దూరాన్ని పెంచుతుందని డైలీ తెలిపింది.