
దాల్మియా అధ్యక్షుడిగా ఎలా పని చేస్తున్నారు!
‘సుప్రీం’ కమిటీ అసంతృప్తి
న్యూఢిల్లీ: ‘ప్రపంచంలోని ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐని అసలు ఎవరు నడిపిస్తున్నారు. బోర్డు అధ్యక్షుడు ఇంత అనారోగ్యంగా ఉన్న విషయం ఆయన సహచరులకు తెలియదా. మూడు నెలల క్రితం ఎన్నుకున్న ఆయన ఇలా ఉంటే పరిస్థితి ఏమిటి’... బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియాను కలిసిన అనంతరం సుప్రీం కోర్టు కమిటీ ప్రశ్న ఇది. జస్టిస్ లోధా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ పలు అంశాల్లో విచారణ నిమిత్తం మంగళవారం దాల్మియాను కలిసింది.
ఈ విచారణ సందర్భంగా దాల్మియా వెంట ఉండేందుకు మానవతా దృక్పథంతో ఆయన కుమారుడు అభిషేక్‌కు కమిటీ అనుమతి ఇచ్చింది. ‘మా ప్రశ్నలను అర్థం చేసుకోవడంలోనే బోర్డు అధ్యక్షుడు ఇబ్బంది పడుతున్నారు. మేం అభిషేక్‌కు ప్రశ్న చెబితే ఆయన తండ్రికి వివరించారు. ఆయన మాటలు అర్థరహితంగా, సంబంధం లేకుండా ఉన్నాయి. దానిని మాకు ఆయన అబ్బాయి చెప్పే క్రమంలో అది మరింత గందరగోళంగా తయారైంది’ అని కమిటీ సభ్యుడొకరు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఈ కథనాన్ని బీసీసీఐ ఖండించింది.