
నా స్నేహితుడ్ని కోల్పోయా!
న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మృతి పట్ల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. క్రికెట్ కు ఎనలేని సేవలందించిన తన వ్యక్తిగత స్నేహితుడ్ని కోల్పోయానంటూ హాంకాంగ్ పర్యటనలో ఉన్న జైట్లీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే బీసీసీఐను అత్యున్నత స్థితికి చేర్చిన దాల్మియా లేకపోవడం నిజంగా బాధకరమన్నారు. ఢిల్లీ, జిల్లాల క్రికెట్ అసోసియేన్ కు (డీడీసీఏ) తాను సేవలందించిన సమయంలో దాల్మియాతో పరిచయాన్ని జైట్లీ గుర్తు చేసుకున్నారు. భారత క్రికెట్ కు సంబంధించిన అనేక అంశాలను దాల్మియాతో తాను చర్చించినట్లు పేర్కొన్నారు.
'హాంకాంగ్ లో ఈరోజు ఉదయం లేచిన వెంటనే దాల్మియా మృతిచెందారనే విషాదకర వార్త తెలిసింది. ఆ వార్తతో షాక్ కు గురయ్యా. క్రికెట్ ప్రపంచం ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయింది. 'దాల్మియా ఆకస్మిక మృతి బీసీసీఐతో పాటు, సీఏబీ (బెంగాల్ క్రికెట్ అసోసియేషన్)కి, ఆయన కుటుంబ సభ్యులకు తీరనిలోటు. గత నెలలో చివరిసారిగా దాల్మియాను కోల్ కతా నగరంలో కలిశా. ఆయన అనారోగ్యం నుంచి కోలుకుంటారని అనుకున్నా. కానీ ఆయన మనల్ని విడిచి వెళ్లిపోవడం నిజంగా బాధాకరం' అని జైట్లీ తెలిపారు. తాను తొలిసారి 1990 వ ప్రాంతంలో దాల్మియాను కలిశానని జైట్లీ పేర్కొన్నారు. క్రికెట్ మ్యాచ్ లను బీసీసీఐ సొంతంగా ప్రసారం చేసుకునే హక్కులను సాధించడం వెనుక దాల్మియా కీలక పాత్ర పోషించారని కొనియాడారు.