దుబాయ్: బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతిపట్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. క్రికెట్ కు ఎన్నో సేవలు చేసిన దాల్మియా మృతి ఎప్పటికీ తీరని లోటుగానే మిగిలిపోతుందని ఐసీసీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ తెలిపారు. క్రికెట్ కు ఆయన చేసిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
దాల్మియా తన జీవితాన్ని క్రికెట్ కోసమే అంకితం చేశారని.. అటువంటి వ్యక్తి ఇక మన మధ్య లేకపోడం నిజంగా దురదృష్టకరమన్నారు. దాల్మియా ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్రికెట్ ను పటిష్టస్థితికి చేర్చారని.. ఆయన దూరదృష్టి చలవ వల్లే క్రికెట్ ఈరోజు ఇంతటి ఉన్నతస్థాయికి చేరిందని శ్రీనివాసన్ పేర్కొన్నారు. కాగా, దాల్మియా భౌతికకాయాన్నిచివరిసారి అభిమానులు సందర్శించేందుకు వీలుగా ఈడెన్ గార్డెన్స్ లోని క్రికెట్ అసోసియేషన్ బెంగాల్(సీఏబీ) కార్యాలయానికి తరలించారు. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జగ్మోహన్ దాల్మియా ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు.