
అధికార లాంఛనాలతో దాల్మియా అంత్యక్రియలు
కోల్ కతా: గుండె పోటుతో మృతిచెందిన బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా(75) అంత్యక్రియలను సోమవారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. కోల్ కతా నగరంలోని కియోర్తలా శ్మశానవాటికలో దాల్మియా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసు బలగాలు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పుల జరిపిన అనంతరం దాల్మియా చితికి కుమారుడు అభిషేక్ దాల్మియా నిప్పంటించారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పాటు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీలు సౌరభ్ గంగూలీ, సుభీర్ గంగూలీలు దాల్మియా అంత్యక్రియలకు హాజరై ఘనంగా నివాళులు అర్పించారు.
కోల్ కతా మేయర్ సోవన్ ఛటర్జీ, మంత్రి ఫిరాద్ హకిమ్.. దాల్మియా అంతిమయాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. టీమిండియా డైరెక్టర్ రవిశాస్తి, బీసీసీఐ సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ లు దాల్మియా అంత్యక్రియలకు హాజరై హాజరై నివాళులు అర్పించారు. దాల్మియా భౌతికకాయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.