ముంబై: జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో బీసీసీఐ పీఠం ఖాళీ అయ్యింది. ఈ పదవిని ఎవరు అధిరోహిస్తారనే అంశం క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రపంచ క్రికెట్లో బీసీసీఐ చాలా శక్తిమంతమైన బోర్డు కాగా భారత క్రికెట్ కార్యకలాపాలకు సంబంధించి బీసీసీఐ అధ్యక్ష పదవి చాలా కీలకం. ఐసీసీ సంబంధాలతో సహా ఐపీఎల్ నిర్వహణ, జాతీయ సెలెక్షన్ కమిటీ, జట్టు ఎంపిక తదితర వ్యవహారాల్లో బీసీసీఐ చీఫ్ పాత్ర కీలకం. జగ్మోహన్ దాల్మియా మృతితో ఆ పదవిని భర్తీ చేసేందుకు బీసీసీఐ పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. ఈ అంశంపై తాము త్వరలో సమావేశం కానున్నట్లు ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుణ్ని నియమించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
భారత క్రికెట్లో ఐదు జోన్లు ఉన్నాయి. రొటేషన్ పద్దతి ప్రకారం మూడేళ్లకోసారి ఒక్కో జోన్ నుంచి బీసీసీఐ చీఫ్ను ఎన్నుకుంటారు. జగ్మోహన్ దాల్మియా ఈస్ట్ జోన్ నుంచి ఎన్నికయ్యారు. ఆయన బతికుంటే ఇంకా రెండున్నర సంవత్సరాల పాటు పదవిలో కొనసాగేవారు. ఆయన ఆకస్మిక మరణం వల్ల కొత్త చీఫ్ను ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బోర్డు నిబంధనల ప్రకారం దాల్మియా స్థానంలో ఈస్ట్ జోన్ నుంచే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. లేదా ఈస్ట్ జోన్ క్రికెట్ సంఘాల మద్దతు (తప్పనిసరి)తో వేరే వ్యక్తికి పదవి అప్పగించవచ్చు.
బీసీసీఐ చీఫ్ పదవికి ప్రధానంగా ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా పేరు వినిపిస్తోంది. యూపీసీఏ (ఉత్తరప్రదేశ్ క్రికెట్ సంఘం) అధ్యక్షునిగా శుక్లా ఉన్నారు. ఆయనతో పాటు గౌతమ్ రాయ్ పేరు కూడా బీసీసీఐ అధ్యక్ష రేసులో ఉంది. అయితే ప్రస్తుతానికి బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడ్ని మాత్రమే నియమిస్తామని శుక్లా పేర్కొనడంతో.. పూర్తిస్థాయి అధ్యక్షుడి నియమకానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.
బీసీసీఐ కొత్త బాస్ ఎవరు?
Published Mon, Sep 21 2015 4:54 PM | Last Updated on Sun, Sep 3 2017 9:44 AM
Advertisement
Advertisement