
నిలకడగా దాల్మియా ఆరోగ్య పరిస్థితి
కోల్ కతా: గుండెపోటుతో నగరంలోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గురువారం రాత్రి ఆకస్మికంగా దాల్మియా ఛాతీ నొప్పికి గురికావడంతో ఆయన్ను బీఎమ్ బిర్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న దాల్మియా ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఓ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
మరో 72 గంటలపాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారు గత రాత్రి ఛాతీ నొప్పికి గురైన దాల్మియాను తొమ్మిది గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం దాల్మియాకు కరొనరీ యాంజియోగ్రఫీ నిర్వహించిన వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాల్మియా గుండె నొప్పికి గురైన సమాచారాన్ని అందుకున్న బెంగాల్ క్రికెట్ అసోసియన్ అధికారులు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత మార్చినెలలో ఆయన రెండో సారి బీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టారు. అంతకుముందు బీసీసీఐ అధ్యక్షునిగా పని చేసిన దాల్మియా.. పది సంవత్సరాల విరామం తరువాత మరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.