Jagmohan Dalmia
-
నేడే ప్రకటన
అధ్యక్ష పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ బీసీసీఐ ఎస్జీఎంకి శ్రీనివాసన్ దూరం ముంబై: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడెవరో నేడు (ఆదివారం) అధికారికంగా ఖరారు కానుంది. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఖాళీ అయిన బోర్డు అత్యున్నత పదవి ఎంపిక కోసం ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) జరుగనుంది. అధ్యక్షుడిగా అనేకమంది పేర్లతో ఊహాగానాలు వినిపించినా ఆఖరికి శశాంక్ మనోహర్ ఒక్కరే బరిలో నిలిచారు. ఈ పదవికి నామినేషన్ దాఖలైంది కూడా ఆయనొక్కరి నుంచే. కాబట్టి మనోహర్ ఎంపికకు సభ్యుల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించనుంది. ఈస్ట్ జోన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. అయితే శ్రీనివాసన్ ఎస్‌జీఎంకు హాజరుకావడం లేదు. తన వర్గానికి చెందిన వ్యక్తికి ఈ పదవిని కట్టబెట్టేందుకు ఆయన చివరిదాకా ప్రయత్నించినా.. ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, పవార్ గ్రూపు ఒక్కటి కావడంతో శ్రీనికి నిరాశే ఎదురైంది. దీంతో ఈ కీలక సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన స్థానంలో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ఉపాధ్యక్షుడు పీఎస్ రామన్ హాజరుకానున్నారు. ఈస్ట్ జోన్‌లోని ఆరు సంఘాలు వేర్వేరుగా మనోహర్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. బెంగాల్ నుంచి గంగూలీ, జాతీయ క్రికెట్ క్లబ్ (ఎన్సీసీ) నుంచి దాల్మియా కుమారుడు అవిషేక్, త్రిపుర నుంచి సౌరవ్ దాస్ గుప్తా, అస్సాం నుంచి గౌతమ్ రాయ్, ఒడిషా నుంచి ఆశీర్వాద్ బెహరా, జార్ఖండ్ క్రికెట్ సంఘం నుంచి సంజయ్ సింగ్ ప్రతి పాదించిన వారిలో ఉన్నారు. మనోహర్ గతంలో 2008-09, 2010-11లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు. -
‘ఆట’ మొదలైంది..!
♦ బీసీసీఐ అధ్యక్ష పదవికి గట్టి పోటీ ♦ కన్నేసిన పవార్, శుక్లా ♦ ఏజీఎం నిర్వహించడమే సమస్య జగ్మోహన్ దాల్మియా మృతితో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఒక శకం ముగిసింది. మూడు దశాబ్దాలకు పైగా బోర్డులో భాగంగా ఉన్న ఈ దిగ్గజ పరిపాలకుడు చివరకు అత్యున్నత పీఠంనుంచే జీవితానికి వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఆయన వారసుడి కోసం వేట మొదలైంది. గతంలోనూ క్రికెట్‌ను శాసించిన కొందరితో పాటు ఇతరులూ ఇప్పుడు ఈ ‘పెద్ద’ పదవిపై కన్నేశారు. అధ్యక్షుడి ఎంపిక సజావుగా సాగుతుందా లేక ఇటీవలి బోర్డు పరిణామాల నేపథ్యంలో మళ్లీ కొత్త సమస్య వచ్చి పడుతుందా అనేది ఆసక్తికరం. సాక్షి క్రీడా విభాగం : మార్చిలో బీసీసీఐ ఎన్నికలు జరిగే సమయానికే జగ్మోహన్ దాల్మియా కాస్త అనారోగ్యంగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన ప్రత్యర్థులు కొందరు పరోక్షంగా దీని గురించి మాట్లాడుకున్నా... నేరుగా ఎవరూ దానిపై చర్చించలేకపోయారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా దాల్మియా చురుగ్గా లేరు. చాలా వరకు కార్యకలాపాలు కార్యదర్శి అనురాగ్ ఠాకూరే నిర్వహిస్తూ వచ్చారు. చివరకు ఫిక్సింగ్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం బీసీసీఐని ఎవరు నడిపిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీని తర్వాత కూడా బోర్డుసభ్యులు దాల్మియాను తొలగించమని కోరే ధైర్యం చేయలేదు. ‘నాడు దాల్మియా ఆరోగ్యం క్షీణిస్తుండటం చూస్తూ కూడా ఆయనను అధ్యక్ష పదవి కోసం నిలబెట్టడం మూర్ఖత్వం. ఇలాంటి స్థితి వస్తుందని వారికీ తెలుసు’ అని ఒక సీనియర్ సభ్యుడు దాల్మియా మృతి అనంతరం వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు తగిన వ్యక్తి లేక రెండు వర్గాలూ ఏకగ్రీవంగా దాల్మియాకు ఓటేశాయి. నిబంధనలు ఏమిటి? బీసీసీఐ నియమావళి ప్రకారం చనిపోవడం లేదా మరే కారణంతో బీసీసీఐ అధ్యక్ష పదవి అర్ధాంతరంగా ఖాళీ అయితే కార్యదర్శి 21 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్ఏజీఎం) నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. గత రెండు ఏజీఎంలకు హాజరై బోర్డు ఆఫీస్ బేరర్‌గా పని చేసి ఉండటం అనేది ప్రధాన అర్హత. గత అధ్యక్షుడిని ప్రతిపాదించిన జోన్నుంచే ఒక రాష్ట్ర సంఘం కొత్త అధ్యక్షుడి పేరును ప్రతిపాదించాలి. నాడు ఈస్ట్‌జోన్‌లోని ఆరు సంఘాలు దాల్మియా పేరును ప్రతిపాదించాయి. ఆ రకంగా 2017 వరకు కూడా ఈస్ట్జోన్కే ఆ అధికారం ఉంది. అవకాశం ఉందా! ఇప్పుడు సమస్య అంతా ఏజీఎం నిర్వహణ గురించే. కేవలం శ్రీనివాసన్ హాజరయ్యారనే కారణంతోనే వర్కింగ్ కమిటీ సమావేశాన్ని బోర్డు వాయిదా వేసింది. ఆయనను అనుమతించే విషయంలో స్పష్టత ఇవ్వాలని నేరుగా సుప్రీంకోర్టునే కోరింది. అది తెలిస్తే గానీ వార్షిక ఏజీఎం జరిగే అవకాశం లేదు. అలాంటప్పుడు ప్రత్యేక ఏజీఎం అనేది మరో పెద్ద సమస్య. ఇక్కడకు కూడా శ్రీనివాసన్ వస్తే బోర్డులోని కొందరికి రుచించకపోవచ్చు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక వరకు కార్యదర్శి ఠాకూర్ అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తారు. పోటీలో ఎవరున్నారు? బీసీసీఐ రాజకీయాల్లోకి మళ్లీ రావాలనుకుంటున్నట్లు మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇటీవలే చూచాయగా చెప్పారు. ఈ పదవిపై ఇంకా బయటపడని ఆయన తన ప్రయత్నాల్లో మాత్రం ఉన్నట్లు సమాచారం. మాజీ ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా అధ్యక్ష పదవిపై ఆసక్తిగా ఉన్నారు. ఈస్ట్‌జోన్ మద్దతు కూడగట్టేందుకు గట్టిగా శ్రమిస్తున్నారు. మార్చిలో కోశాధికారి పదవికి పోటీ చేసి ఓడిన శుక్లాకు శ్రీనివాసన్ వర్గం నుంచి మద్దతు లభించకపోవచ్చు. శ్రీనివాసన్ ఏం చేయబోతున్నారు... తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కూడా పావులు కదుపుతారు. అందరివాడు కాబట్టి దాల్మియాకు ఆరు ఈస్ట్‌జోన్ సంఘాలనుంచి ఏకపక్ష మద్దతు లభించింది. కానీ వారందరూ ఒకటి కాదు. అందులో ముగ్గురిని తమ వైపు తిప్పుకున్నా ఎన్నికల్లో రాజకీయం చేయవచ్చు. కార్యదర్శిగా అన్నీ తానై దాదాపు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఠాకూర్‌పై కొందరు సభ్యులకు ఆగ్రహం ఉంది. దీనిని వాడుకొని అధ్యక్షుడిగా తమవాడిని గెలిపించుకోవాలని ప్రత్యర్థి వర్గం భావిస్తోంది. శ్రీని నేరుగా రంగంలోకి దిగకపోయినా తన సన్నిహితులైన ప్రస్తుత కోశాధికారి అనిరుధ్ చౌదరి, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరిలలో ఒకరిని పోటీకి నిలబెట్టి గెలిపించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్నింటికి మించి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మద్దతు శ్రీనివాసన్‌కు ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే బీజేపీ ఎంపీ అయిన ఠాకూర్ తమ అధినాయకత్వానికి ఎదురు చెప్పి శ్రీనివాసన్‌ను అడ్డుకునే అవకాశం లేదు! పవార్ లేదా శుక్లాలలో ఎవరు అధ్యక్షుడయినా శ్రీనివాసన్‌కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్గం తమ మనిషి కోసం బలంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. -
గుండెపోటుతో దాల్మియా మృతి
-
దాల్మియా కన్నుమూత
♦ గుండెపోటుతో మృతి చెందిన బీసీసీఐ అధ్యక్షుడు ♦ విజయవంతమైన పరిపాలకుడిగా పేరు కోల్‌కతా : కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా (75) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర ఛాతీ నొప్పితో ఆయన స్థానిక బీఎం బిర్లా ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆయనకు కారొనరీ ఏంజియోగ్రఫీ చికిత్సను చేశారు. శనివారం ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు ప్రకటించారు. అయితే ఆదివారం సాయంత్రం మరోసారి తీవ్రంగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న దాల్మియా... పదేళ్ల అనంతరం గత మార్చిలో బీసీసీఐకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే అప్పటి నుంచే అనారోగ్య కారణాలరీత్యా క్రికెట్ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. బీసీసీఐని ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో నిలిపిన పరిపాలకుడిగా ప్రసిద్ధికెక్కారు. అలాగే దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగానూ గుర్తింపు పొం దారు. 1990వ దశకంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న ఆయన తన వ్యాపార తెలివితేటలతో భారత క్రికెట్ బోర్డును ఆర్థికంగా తిరుగులేని స్థాయికి చేర్చారు. బీసీసీఐ నివాళి: తమ అధ్యక్షుడు దాల్మియా మృతిపై బీసీసీఐ సభ్యులు నివాళి అర్పించారు. భారత క్రికెట్ ఓ గొప్ప పరిపాలకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ‘బోర్డు తరఫున దాల్మియా కుటుంబానికి నేను సానుభూతిని తెలుపుతున్నాను. దూరదృష్టి కలిగిన వ్యక్తిగానే కాకుండా భారత క్రికెట్ పితగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దాల్మియా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ‘క్రీడా పరిపాలకుల్లో ఆయన శిఖరంలాంటివారు. బెంగాల్‌ను అమితంగా ప్రేమించిన వ్యక్తి’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దాల్మియా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తోపాటు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, బిషన్‌సింగ్ బేడీ, ప్రస్తుత జట్టు సభ్యులు రోహిత్ శర్మ, రైనాలు దాల్మియా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కాసులు కురిపించిన మార్వాడీ! జగ్మోహన్ దాల్మియాకు క్రికెట్, వ్యాపారం రెండూ చాలా ఇష్టమైనవి. ఆ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుందనే వచ్చిన ఆలోచనే ‘జెంటిల్మన్ గేమ్’ను పరుగులు పెట్టించింది. ఆటకు తన మార్వాడీ వ్యాపార తెలివితేటలు జోడించి భారత క్రికెట్ స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చిన దాల్మియా బీసీసీఐకి పెరట్లో కాసులు పండించారు. శ్రీనివాసన్‌లు, లలిత్ మోదిలు పరిపాలనలో ఓనమాలు నేర్చుకోక ముందే క్రికెట్‌కు వాణిజ్య హంగులు తెచ్చిన ఘనత ఆయనదే. ఇప్పుడు క్రికెటర్లు శ్రీమంతులవుతున్నా... హక్కుల రూపంలో బోర్డులు కోట్లు కొల్లగొడుతున్నా అదంతా ఆయన వ్యూహ చాతుర్యమే. క్లబ్ స్థాయి క్రికెటర్ అయిన ఈ ‘దాదా’ బోర్డుకు డబ్బు తెచ్చి పెట్టడమే ఏకైక లక్ష్యంగా తన శక్తియుక్తులు ప్రదర్శించారు. దేశంలోని ప్రముఖ కన్స్ట్రక్షన్స్ కంపెనీ బాధ్యతలు 19 ఏళ్లకే తలకెత్తుకున్న వ్యక్తి తన సమర్థతను జోడించి బీసీసీఐ సౌధాన్ని నిలబెట్టారు. 1979లో బోర్డులోకి అడుగు పెట్టిన దాల్మియా 1983లో కోశాధికారి అయ్యారు. అప్పటి‘యంగ్‌టర్క్’లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రపంచకప్‌ను తొలిసారి ఇంగ్లండ్ నుంచి బయటికి తీసుకురావడంలో (1987) సఫలమయ్యారు. 90వ దశకంలో అయితే ఉపఖండంలో క్రికెట్ క్రేజ్ ఆకాశాన్నంటింది. టీవీల్లో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ప్రసారాలు, వాటి హక్కుల కోసం పోటీ, స్పాన్సర్‌షిప్‌లు... ఇలా ప్రతీ చోట డబ్బు వచ్చి చేరడంలో దాల్మియాదే కీలక పాత్ర. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 1996 వరల్డ్ కప్ ఆట దశ, దిశను మార్చింది. బీసీసీఐలో ఒక్కసారిగా డబ్బు వచ్చి చేరడమే కాదు, ఈ వ్యూహాలు ఇతర బోర్డులకు ‘అర్థశాస్త్రం’ నేర్పించాయి. 1997 నుంచి మూడేళ్ల పాటు ఐసీసీ అధ్యక్షుడిగా, 2001 నుంచి 2004 వరకు బోర్డు అధ్యక్షుడిగా దాల్మియా పని చేశారు. అయితే నీవు నేర్పిన విద్యయే... అన్నట్లు బోర్డు రాజకీయాల కారణంగా 2005లో కీలక పదవులకు దూరమైన ఆయన పదేళ్ల పాటు ఒక రకమైన అజ్ఞాతవాసంలో గడిపారు. అవినీతి ఆరోపణలు, బోర్డు సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం, కేసులు... ఇలా ఎన్నో చుట్టుముట్టాయి. కానీ జీవితంలో ఒక్క ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడని ఈ బెంగాలీ పోరాటయోధుడు మరోసారి ఈ సమస్యలన్నీ ఛేదించుకొని బయటికి వచ్చారు. ఏడాదిన్నర క్రితం తాత్కాలికంగా, ఇటీవలి ఎన్నికల ద్వారా మళ్లీ తాను తీర్చిదిద్దిన పీఠం ఎక్కి చివరకు అధ్యక్ష హోదాలోనే క్రికెట్‌తో పాటు జీవితం నుంచి కూడా సెలవు తీసుకున్నారు. -సాక్షి క్రీడావిభాగం -
నిలకడగా దాల్మియా ఆరోగ్య పరిస్థితి
కోల్ కతా: గుండెపోటుతో నగరంలోని బీఎమ్ బిర్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నబీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. గురువారం రాత్రి ఆకస్మికంగా దాల్మియా ఛాతీ నొప్పికి గురికావడంతో ఆయన్ను బీఎమ్ బిర్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న దాల్మియా ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఓ బులిటెన్ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరో 72 గంటలపాటు ఆయన్ను అబ్జర్వేషన్ లో ఉంచాలని వైద్యులు తెలిపారు గత రాత్రి ఛాతీ నొప్పికి గురైన దాల్మియాను తొమ్మిది గంటల సమయంలో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం దాల్మియాకు కరొనరీ యాంజియోగ్రఫీ నిర్వహించిన వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాల్మియా గుండె నొప్పికి గురైన సమాచారాన్ని అందుకున్న బెంగాల్ క్రికెట్ అసోసియన్ అధికారులు ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గత మార్చినెలలో ఆయన రెండో సారి బీసీసీ అధ్యక్ష పదవి పగ్గాలు చేపట్టారు. అంతకుముందు బీసీసీఐ అధ్యక్షునిగా పని చేసిన దాల్మియా.. పది సంవత్సరాల విరామం తరువాత మరోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. -
భారత్ ప్రదర్శన అద్భుతం: దాల్మియా
న్యూఢిల్లీ: సెమీస్‌లో ఓటమిని పక్కనబెడితే... ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రదర్శన అత్యద్భుతంగా ఉందని బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా ప్రశంసించారు. ఏడు మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో ఊహించని స్థాయిలో రాణించిందన్నారు. ‘వరల్డ్‌కప్‌లో మన జట్టు ప్రదర్శన చాలా బాగుంది. జట్టు మొత్తానికి నా అభినందనలు. మ్యాచ్‌ల సందర్భంగా ఆటగాళ్లందరూ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు నిజమైన స్ఫూర్తితో ఆట ఆడారు. రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. భారత క్రికెట్‌ను ఉన్నత స్థానాలకు తీసుకెళ్లారు’ అని దాల్మియా పేర్కొన్నారు. మరోవైపు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశారు.