
నేడే ప్రకటన
అధ్యక్ష పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్
బీసీసీఐ ఎస్‌జీఎంకి శ్రీనివాసన్ దూరం
ముంబై: భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడెవరో నేడు (ఆదివారం) అధికారికంగా ఖరారు కానుంది. జగ్మోహన్ దాల్మియా ఆకస్మిక మృతితో ఖాళీ అయిన బోర్డు అత్యున్నత పదవి ఎంపిక కోసం ఆదివారం ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం) జరుగనుంది. అధ్యక్షుడిగా అనేకమంది పేర్లతో ఊహాగానాలు వినిపించినా ఆఖరికి శశాంక్ మనోహర్ ఒక్కరే బరిలో నిలిచారు. ఈ పదవికి నామినేషన్ దాఖలైంది కూడా ఆయనొక్కరి నుంచే. కాబట్టి మనోహర్ ఎంపికకు సభ్యుల నుంచి ఏకగ్రీవ ఆమోదం లభించనుంది. ఈస్ట్ జోన్ నుంచి కూడా ఆయనకు మద్దతు లభించింది. అయితే శ్రీనివాసన్ ఎస్‌జీఎంకు హాజరుకావడం లేదు. తన వర్గానికి చెందిన వ్యక్తికి ఈ పదవిని కట్టబెట్టేందుకు ఆయన చివరిదాకా ప్రయత్నించినా.. ప్రస్తుత కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, పవార్ గ్రూపు ఒక్కటి కావడంతో శ్రీనికి నిరాశే ఎదురైంది. దీంతో ఈ కీలక సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన స్థానంలో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) ఉపాధ్యక్షుడు పీఎస్ రామన్ హాజరుకానున్నారు.
ఈస్ట్ జోన్‌లోని ఆరు సంఘాలు వేర్వేరుగా మనోహర్‌కు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. బెంగాల్ నుంచి గంగూలీ, జాతీయ క్రికెట్ క్లబ్ (ఎన్‌సీసీ) నుంచి దాల్మియా కుమారుడు అవిషేక్, త్రిపుర నుంచి సౌరవ్ దాస్ గుప్తా, అస్సాం నుంచి గౌతమ్ రాయ్, ఒడిషా నుంచి ఆశీర్వాద్ బెహరా, జార్ఖండ్ క్రికెట్ సంఘం నుంచి సంజయ్ సింగ్ ప్రతి పాదించిన వారిలో ఉన్నారు. మనోహర్ గతంలో 2008-09, 2010-11లో బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు.