గ్యాస్ బండకు నిప్పంటించుకుని ఇద్దరు బిడ్డలతో సహా తల్లి సజీవదహనం
రాయచోటి: భర్త అనుమానానికి తోడు.. వేధింపుల ధాటికి తట్టుకోలేక ఇద్దరు బిడ్డలతో సహా ఓ తల్లి సజీవదహనమైన హృదయవిదారక ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పలువురిని కంటతడి పెట్టించిన ఈ దారుణ ఘటన వివరాలను బంధువులు వెల్లడించారు. జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం బి.ఎర్రగుడి హరిజనవాడకు చెందిన ఎర్రగుడి రాజా పది సంవత్సరాల కిందట గాలివీడుకు చెందిన గాలివీటి రమాదేవిని వివాహం చేసుకున్నారు.
వీరికి మనోహర్ (8), మన్విత (5) సంతానం. జీవనోపాధి నిమిత్తం రాజా గల్ఫ్ దేశంలో ఉంటూ భార్య, పిల్లలను రాయచోటి పట్టణం బోస్‌నగర్ తొగటవీధిలో ఉంచాడు. భార్య రమాదేవి టైలరింగ్ చేసుకుంటూ ఇద్దరు పిల్లలను స్కూలుకు పంపుతూ జీవనం సాగించేది. రెండు సంవత్సరాలుగా భార్యపై అనుమానాన్ని పెంచుకున్న రాజా తను నివాసం ఉంటున్న ఇంటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో అనుమానం పెనుభూతమై వీడియో ఫోన్ ద్వారా వేధించేవాడు.
వాటిని తట్టుకోలేక శనివారం ఉదయం ఆరుగంటలకు వంటగదిలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్లి కన్నబిడ్డలు ఇద్దరినీ పట్టుకుని రమాదేవి (34) గ్యాస్‌బండకు నిప్పు అంటించి ఆ మంటల్లో ఆహుతి అయింది. ఇంటిలో నుంచి పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆరి్పవేశారు. అప్పటికే మంటల్లో తల్లీ, ఇద్దరు పిల్లలు కాలిపోయారు.
రమాదేవి సోదరుడు గాలివీటి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రాయచోటి అర్బన్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి మృతదేహాల వద్ద నివాళులు అర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment