
దాల్మియా కన్నుమూత
♦ గుండెపోటుతో మృతి చెందిన బీసీసీఐ అధ్యక్షుడు
♦ విజయవంతమైన పరిపాలకుడిగా పేరు
కోల్‌కతా : కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా (75) ఆదివారం గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం రాత్రి తీవ్ర ఛాతీ నొప్పితో ఆయన స్థానిక బీఎం బిర్లా ఆస్పత్రిలో చేరారు. వెంటనే ఆయనకు కారొనరీ ఏంజియోగ్రఫీ చికిత్సను చేశారు. శనివారం ఆయన చికిత్సకు సహకరిస్తున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు డాక్టర్లు ప్రకటించారు. అయితే ఆదివారం సాయంత్రం మరోసారి తీవ్రంగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న దాల్మియా... పదేళ్ల అనంతరం గత మార్చిలో బీసీసీఐకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
అయితే అప్పటి నుంచే అనారోగ్య కారణాలరీత్యా క్రికెట్ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. బీసీసీఐని ఆర్థికంగా తిరుగులేని స్థాయిలో నిలిపిన పరిపాలకుడిగా ప్రసిద్ధికెక్కారు. అలాగే దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగానూ గుర్తింపు పొం దారు. 1990వ దశకంలో బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న ఆయన తన వ్యాపార తెలివితేటలతో భారత క్రికెట్ బోర్డును ఆర్థికంగా తిరుగులేని స్థాయికి చేర్చారు.
బీసీసీఐ నివాళి: తమ అధ్యక్షుడు దాల్మియా మృతిపై బీసీసీఐ సభ్యులు నివాళి అర్పించారు. భారత క్రికెట్ ఓ గొప్ప పరిపాలకుడిని కోల్పోయిందని వ్యాఖ్యానించారు. ‘బోర్డు తరఫున దాల్మియా కుటుంబానికి నేను సానుభూతిని తెలుపుతున్నాను. దూరదృష్టి కలిగిన వ్యక్తిగానే కాకుండా భారత క్రికెట్ పితగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారు’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దాల్మియా మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.
‘క్రీడా పరిపాలకుల్లో ఆయన శిఖరంలాంటివారు. బెంగాల్‌ను అమితంగా ప్రేమించిన వ్యక్తి’ అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దాల్మియా అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తామని ఆమె తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తోపాటు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్, బిషన్‌సింగ్ బేడీ, ప్రస్తుత జట్టు సభ్యులు రోహిత్ శర్మ, రైనాలు దాల్మియా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
కాసులు కురిపించిన మార్వాడీ!
జగ్మోహన్ దాల్మియాకు క్రికెట్, వ్యాపారం రెండూ చాలా ఇష్టమైనవి. ఆ రెండింటినీ కలిపితే ఎలా ఉంటుందనే వచ్చిన ఆలోచనే ‘జెంటిల్మన్ గేమ్’ను పరుగులు పెట్టించింది. ఆటకు తన మార్వాడీ వ్యాపార తెలివితేటలు జోడించి భారత క్రికెట్ స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చిన దాల్మియా బీసీసీఐకి పెరట్లో కాసులు పండించారు. శ్రీనివాసన్‌లు, లలిత్ మోదిలు పరిపాలనలో ఓనమాలు నేర్చుకోక ముందే క్రికెట్‌కు వాణిజ్య హంగులు తెచ్చిన ఘనత ఆయనదే. ఇప్పుడు క్రికెటర్లు శ్రీమంతులవుతున్నా... హక్కుల రూపంలో బోర్డులు కోట్లు కొల్లగొడుతున్నా అదంతా ఆయన వ్యూహ చాతుర్యమే. క్లబ్ స్థాయి క్రికెటర్ అయిన ఈ ‘దాదా’ బోర్డుకు డబ్బు తెచ్చి పెట్టడమే ఏకైక లక్ష్యంగా తన శక్తియుక్తులు ప్రదర్శించారు.
దేశంలోని ప్రముఖ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ బాధ్యతలు 19 ఏళ్లకే తలకెత్తుకున్న వ్యక్తి తన సమర్థతను జోడించి బీసీసీఐ సౌధాన్ని నిలబెట్టారు. 1979లో బోర్డులోకి అడుగు పెట్టిన దాల్మియా 1983లో కోశాధికారి అయ్యారు. అప్పటి‘యంగ్‌టర్క్’లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ప్రపంచకప్‌ను తొలిసారి ఇంగ్లండ్ నుంచి బయటికి తీసుకురావడంలో (1987) సఫలమయ్యారు. 90వ దశకంలో అయితే ఉపఖండంలో క్రికెట్ క్రేజ్ ఆకాశాన్నంటింది. టీవీల్లో పెద్ద ఎత్తున ప్రత్యక్ష ప్రసారాలు, వాటి హక్కుల కోసం పోటీ, స్పాన్సర్‌షిప్‌లు... ఇలా ప్రతీ చోట డబ్బు వచ్చి చేరడంలో దాల్మియాదే కీలక పాత్ర. ముఖ్యంగా భారత్‌లో జరిగిన 1996 వరల్డ్ కప్ ఆట దశ, దిశను మార్చింది.
బీసీసీఐలో ఒక్కసారిగా డబ్బు వచ్చి చేరడమే కాదు, ఈ వ్యూహాలు ఇతర బోర్డులకు ‘అర్థశాస్త్రం’ నేర్పించాయి. 1997 నుంచి మూడేళ్ల పాటు ఐసీసీ అధ్యక్షుడిగా, 2001 నుంచి 2004 వరకు బోర్డు అధ్యక్షుడిగా దాల్మియా పని చేశారు. అయితే నీవు నేర్పిన విద్యయే... అన్నట్లు బోర్డు రాజకీయాల కారణంగా 2005లో కీలక పదవులకు దూరమైన ఆయన పదేళ్ల పాటు ఒక రకమైన అజ్ఞాతవాసంలో గడిపారు.
అవినీతి ఆరోపణలు, బోర్డు సమావేశాల్లో పాల్గొనకుండా నిషేధం, కేసులు... ఇలా ఎన్నో చుట్టుముట్టాయి. కానీ జీవితంలో ఒక్క ఎన్నికల్లోనూ ఓటమి చవిచూడని ఈ బెంగాలీ పోరాటయోధుడు మరోసారి ఈ సమస్యలన్నీ ఛేదించుకొని బయటికి వచ్చారు. ఏడాదిన్నర క్రితం తాత్కాలికంగా, ఇటీవలి ఎన్నికల ద్వారా మళ్లీ తాను తీర్చిదిద్దిన పీఠం ఎక్కి చివరకు అధ్యక్ష హోదాలోనే క్రికెట్‌తో పాటు జీవితం నుంచి కూడా సెలవు తీసుకున్నారు.
-సాక్షి క్రీడావిభాగం