
‘ఆట’ మొదలైంది..!
♦ బీసీసీఐ అధ్యక్ష పదవికి గట్టి పోటీ
♦ కన్నేసిన పవార్, శుక్లా
♦ ఏజీఎం నిర్వహించడమే సమస్య
జగ్మోహన్ దాల్మియా మృతితో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఒక శకం ముగిసింది. మూడు దశాబ్దాలకు పైగా బోర్డులో భాగంగా ఉన్న ఈ దిగ్గజ పరిపాలకుడు చివరకు అత్యున్నత పీఠంనుంచే జీవితానికి వీడ్కోలు పలికారు. ఇప్పుడు ఆయన వారసుడి కోసం వేట మొదలైంది. గతంలోనూ క్రికెట్‌ను శాసించిన కొందరితో పాటు ఇతరులూ ఇప్పుడు ఈ ‘పెద్ద’ పదవిపై కన్నేశారు. అధ్యక్షుడి ఎంపిక సజావుగా సాగుతుందా లేక ఇటీవలి బోర్డు పరిణామాల నేపథ్యంలో మళ్లీ కొత్త సమస్య వచ్చి పడుతుందా అనేది ఆసక్తికరం.
సాక్షి క్రీడా విభాగం : మార్చిలో బీసీసీఐ ఎన్నికలు జరిగే సమయానికే జగ్మోహన్ దాల్మియా కాస్త అనారోగ్యంగా ఉన్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన ప్రత్యర్థులు కొందరు పరోక్షంగా దీని గురించి మాట్లాడుకున్నా... నేరుగా ఎవరూ దానిపై చర్చించలేకపోయారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కూడా దాల్మియా చురుగ్గా లేరు. చాలా వరకు కార్యకలాపాలు కార్యదర్శి అనురాగ్ ఠాకూరే నిర్వహిస్తూ వచ్చారు. చివరకు ఫిక్సింగ్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సైతం బీసీసీఐని ఎవరు నడిపిస్తున్నారంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. దీని తర్వాత కూడా బోర్డుసభ్యులు దాల్మియాను తొలగించమని కోరే ధైర్యం చేయలేదు. ‘నాడు దాల్మియా ఆరోగ్యం క్షీణిస్తుండటం చూస్తూ కూడా ఆయనను అధ్యక్ష పదవి కోసం నిలబెట్టడం మూర్ఖత్వం. ఇలాంటి స్థితి వస్తుందని వారికీ తెలుసు’ అని ఒక సీనియర్ సభ్యుడు దాల్మియా మృతి అనంతరం వ్యాఖ్యానించారు. అయితే అప్పుడు తగిన వ్యక్తి లేక రెండు వర్గాలూ ఏకగ్రీవంగా దాల్మియాకు ఓటేశాయి.
నిబంధనలు ఏమిటి?
బీసీసీఐ నియమావళి ప్రకారం చనిపోవడం లేదా మరే కారణంతో బీసీసీఐ అధ్యక్ష పదవి అర్ధాంతరంగా ఖాళీ అయితే కార్యదర్శి 21 రోజుల్లోగా ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌ఏజీఎం) నిర్వహించి అధ్యక్షుడిని ఎన్నుకోవచ్చు. గత రెండు ఏజీఎంలకు హాజరై బోర్డు ఆఫీస్ బేరర్‌గా పని చేసి ఉండటం అనేది ప్రధాన అర్హత. గత అధ్యక్షుడిని ప్రతిపాదించిన జోన్‌నుంచే ఒక రాష్ట్ర సంఘం కొత్త అధ్యక్షుడి పేరును ప్రతిపాదించాలి. నాడు ఈస్ట్‌జోన్‌లోని ఆరు సంఘాలు దాల్మియా పేరును ప్రతిపాదించాయి. ఆ రకంగా 2017 వరకు కూడా ఈస్ట్‌జోన్‌కే ఆ అధికారం ఉంది.
అవకాశం ఉందా!
ఇప్పుడు సమస్య అంతా ఏజీఎం నిర్వహణ గురించే. కేవలం శ్రీనివాసన్ హాజరయ్యారనే కారణంతోనే వర్కింగ్ కమిటీ సమావేశాన్ని బోర్డు వాయిదా వేసింది. ఆయనను అనుమతించే విషయంలో స్పష్టత ఇవ్వాలని నేరుగా సుప్రీంకోర్టునే కోరింది. అది తెలిస్తే గానీ వార్షిక ఏజీఎం జరిగే అవకాశం లేదు. అలాంటప్పుడు ప్రత్యేక ఏజీఎం అనేది మరో పెద్ద సమస్య. ఇక్కడకు కూడా శ్రీనివాసన్ వస్తే బోర్డులోని కొందరికి రుచించకపోవచ్చు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక వరకు కార్యదర్శి ఠాకూర్ అన్ని వ్యవహారాలు పర్యవేక్షిస్తారు.
పోటీలో ఎవరున్నారు?
బీసీసీఐ రాజకీయాల్లోకి మళ్లీ రావాలనుకుంటున్నట్లు మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇటీవలే చూచాయగా చెప్పారు. ఈ పదవిపై ఇంకా బయటపడని ఆయన తన ప్రయత్నాల్లో మాత్రం ఉన్నట్లు సమాచారం. మాజీ ఉపాధ్యక్షుడు, ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా అధ్యక్ష పదవిపై ఆసక్తిగా ఉన్నారు. ఈస్ట్‌జోన్ మద్దతు కూడగట్టేందుకు గట్టిగా శ్రమిస్తున్నారు. మార్చిలో కోశాధికారి పదవికి పోటీ చేసి ఓడిన శుక్లాకు శ్రీనివాసన్ వర్గం నుంచి మద్దతు లభించకపోవచ్చు.
శ్రీనివాసన్ ఏం చేయబోతున్నారు...
తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ కూడా పావులు కదుపుతారు. అందరివాడు కాబట్టి దాల్మియాకు ఆరు ఈస్ట్‌జోన్ సంఘాలనుంచి ఏకపక్ష మద్దతు లభించింది. కానీ వారందరూ ఒకటి కాదు. అందులో ముగ్గురిని తమ వైపు తిప్పుకున్నా ఎన్నికల్లో రాజకీయం చేయవచ్చు. కార్యదర్శిగా అన్నీ తానై దాదాపు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ఠాకూర్‌పై కొందరు సభ్యులకు ఆగ్రహం ఉంది. దీనిని వాడుకొని అధ్యక్షుడిగా తమవాడిని గెలిపించుకోవాలని ప్రత్యర్థి వర్గం భావిస్తోంది. శ్రీని నేరుగా రంగంలోకి దిగకపోయినా తన సన్నిహితులైన ప్రస్తుత కోశాధికారి అనిరుధ్ చౌదరి, సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరిలలో ఒకరిని పోటీకి నిలబెట్టి గెలిపించాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నింటికి మించి బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మద్దతు శ్రీనివాసన్‌కు ఉన్నట్లు సమాచారం. అదే నిజమైతే బీజేపీ ఎంపీ అయిన ఠాకూర్ తమ అధినాయకత్వానికి ఎదురు చెప్పి శ్రీనివాసన్‌ను అడ్డుకునే అవకాశం లేదు! పవార్ లేదా శుక్లాలలో ఎవరు అధ్యక్షుడయినా శ్రీనివాసన్‌కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ వర్గం తమ మనిషి కోసం బలంగా ప్రయత్నం చేసే అవకాశం ఉంది.