
శశాంక్ మనోహర్
ముంబై: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఉన్న శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి చాలా కాలంగా ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టి20 ప్రపంచకప్‌ను ఈ ఏడాది నిర్వహించే అవకాశం లేదని ఐసీసీ ఇప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడానికి ఆయనే కారణమని బీసీసీఐ భావిస్తోంది. భారత బోర్డు ఐపీఎల్ నిర్వహించుకోవడం లేదా ఇతర ద్వైపాక్షిక సిరీస్‌ల ప్రణాళికలు రూపొందించుకునే అవకాశం లేకుండా కావాలనే మనోహర్ ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ అధికారి ఒకరు ఆరోపించారు.
భారతీయుడై ఉండి ఇప్పటికీ భారత్‌కు వ్యతిరేకంగానే ఆయన పని చేస్తున్నారని విమర్శించారు. ‘త్వరలో పదవీకాలం ముగిసిపోయే శశాంక్ మనోహర్ లేని గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు. టి20 ప్రపంచ కప్ నిర్వహించడం తమ వల్ల కాదని ఆస్ట్రేలియా చేతులెత్తేసిన తర్వాత దానిని ప్రకటించేందుకు నెల రోజులు కావాలా. ఏదో ఒకటి తేల్చేయవచ్చు కదా. ఇది ఒక్క ఐపీఎల్ గురించే కాదు. ఈ ఆలస్యం అన్ని దేశాలకు సమస్యగా మారింది. బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా పని చేసిన మనోహర్ ఐసీసీలో మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బ తినేలా పని చేశారు. అయినా ఐసీసీ సమావేశాల్లో చైర్మన్ ఎన్నిక గురించి ఇంకా ఎందుకు ప్రకటించడం లేదు’ అని సదరు అధికారి అన్నారు.