నేడు స్వదేశానికి చేరుకోనున్న టి20 వరల్డ్ చాంపియన్ భారత్
తొలుత ఢిల్లీలో ప్రధానితో రోహిత్ బృందం భేటీ
సాయంత్రం ముంబైలో బీసీసీఐ ఆధ్వర్యంలో రోడ్ షో, సన్మానం
ఇక్కడేమో అభిమానులు... అక్కడేమో ప్రపంచకప్ గెలిచిన క్రికెటర్లు... ఎన్నాళ్లీ నిరీక్షణ, ఎందుకీ పరీక్ష అని చూసే ఎదురుచూపులకు నేడు తెర పడనుంది. ప్రతికూల వాతావరణంతో బార్బడోస్‌లోనే ఇరుక్కుపోయిన టి20 వరల్డ్ చాంపియన్ భారత జట్టు గురువారం తెల్లవారగానే న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వీరికి ఘనస్వాగతం పలికేందుకు బోర్డుతో పాటు వీరాభిమానులు తెగ ఆరాటం కనబరుస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబై సంబరాల్లో మునిగితేలనున్నాయి.
ముంబై: టి20 ప్రపంచకప్‌ను జయించిన భారత క్రికెట్ జట్టు సభ్యులు కాస్త ఆలస్యంగా నేడు స్వదేశానికి చేరుకుంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఎయిరిండియా సమన్వయంతో చార్టెర్డ్ ఫ్లయిట్‌లో చాంపియన్లు, జట్టు సహాయక సిబ్బంది, బోర్డు అధ్యక్ష కార్యదర్శులు రోజర్ బిన్నీ, జై షాలతో పాటు భారత్‌కు చెందిన మీడియా ప్రతినిధులు బార్బడోస్‌లోని గ్రాంట్లీ ఆడమ్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బుధవారం బయలుదేరారు.
ఫ్లయిట్ షెడ్యూల్ టైమ్ ప్రకారం గురువారం ఉదయం గం. 6:20 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది. కాసేపు ఆటగాళ్లు ప్రయాణ బడలిక నుంచి సేదతీరాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ‘ఢిల్లీ విమానాశ్రయంలో 6 గంటలకు ఫ్లయిట్ ల్యాండ్ అవుతుంది. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం ఆటగాళ్లు ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో భేటీ అవుతారు. ఇదివరకే విజేత సభ్యులను సోషల్ మీడియా ద్వారా, ఫోన్‌లో అభినందించిన ప్రధాని కాసేపు క్రికెటర్లతో గడుపుతారు’ అని బోర్డు సీనియర్ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు.
ఈ భేటీ ముగిసిన వెంటనే మరో ప్రత్యేక విమానంలో టీమిండియా ముంబైకి పయనమవుతుంది. ముంబైలోనే బోర్డు అంబరాన్నంటే సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేసింది. అక్కడికి చేరుకోగానే ముంబై, మహారాష్ట్ర క్రికెట్ సంఘాలు ఘనస్వాగతం పలుకుతాయి. ‘సాయంత్రం 5 గంటలకు నారీమన్ పాయింట్ వద్ద ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఓపెన్ టాప్ బస్‌లో క్రికెటర్ల రోడ్‌షో మొదలవుతుంది. అక్కడి నుంచి విఖ్యాత వాంఖెడే స్టేడియం వరకు సుమారు రెండు గంటలపాటు సాగే ఈ షోలో అభిమానులు అడుగడుగునా నీరాజనాలు పలుకుతారు.
రాత్రి 7 గంటల సమయంలో స్టేడియంలో ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఒక్కోక్కరిగా ఘనంగా సన్మానిస్తారు. బోర్డు ప్రకటించిన రూ. 125 కోట్ల ప్రైజ్‌మనీని కూడా అందజేస్తారు’ అని శుక్లా పూర్తి బిజీ షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఈ విక్టరీ పరేడ్‌లో అభిమానులంతా పాల్గొనాల్సిందిగా బోర్డు కార్యదర్శి జై షా ‘ఎక్స్’ (ట్విట్టర్)లో విజ్ఞప్తి చేశారు. ఇలాంటి రోడ్ షో 17 ఏళ్ల క్రితం తొలి టి20 ప్రపంచకప్ గెలిచిన ధోని బృందానికి నిర్వహించారు. కానీ 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన అదే ధోని సేనకు ఐపీఎల్ త్వరలోనే ప్రారంభం కావాల్సి ఉండటంతో రోడ్ షోను నిర్వహించలేదు.
న్యూయార్క్ టు న్యూఢిల్లీ.. వయా బార్బడోస్
గత నెల 29న రోహిత్ శర్మ బృందం టి20 వరల్డ్‌కప్ గెలిచింది. ఆదివారం అర్ధరాత్రి లేదంటే సోమవారం ఉదయానికల్లా జగజ్జేతలు భారత్‌కు రావాలి. కానీ కరీబియన్‌లో భీకరమైన హరికేన్ తుఫాన్ వల్ల బార్బడోస్ ఎయిర్‌పోర్ట్‌ను మూసివేశారు. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా అక్కడే ఇరుక్కుపోయారు. ఎట్టకేలకు కరీబియన్‌లో టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు సభ్యులు కప్‌తో వచ్చేస్తున్నారు.
ఎయిరిండియా చొరవ, న్యూయార్క్‌లోని ప్రయాణీకుల సహకారంతో దారి మళ్లించిన విమానంలో టీమిండియా క్రికెటర్లు, మీడియా సంస్థల ప్రతినిధులు గురువారం ఉదయం న్యూఢిల్లీకి చేరుకుంటారు. అయితే వాతావరణ పరిస్థితిలో మార్పురావడంతో న్యూయార్క్ (అమెరికా) నుంచి న్యూఢిల్లీకి ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానాన్ని వయా బార్బడోస్ మీదుగా దారి మళ్లించారు.
ఈ విమానం కోసం టికెట్లు బుక్ చేసుకున్న సాధారణ ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇచ్చి అసౌకర్యం కలుగకుండా చూశారు. ఇంకొందరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఇక విజేతల కోసం ‘ఏఐసీ24డబ్ల్యూసీ’ (ఎయిరిండియా చాంపియన్స్ 24 ప్రపంచకప్) పేరిట ఈ విమానాన్ని ముస్తాబుచేసి బార్బడోస్‌లో క్రికెటర్లను ఎక్కించుకొని బుధవారం బయలుదేరింది. అయితే నిర్ణీత రూట్ కాకుండా మరో రూట్ మారడంపై డీజీసీఏ (విమానయాన నియంత్రణ సంస్థ) ఎయిరిండియాను నివేదిక కోరింది.
Comments
Please login to add a commentAdd a comment