Asia Cup 2023 Team India Squad: KL Rahul And Shreyas Iyer Make Comebacks To The Team After Long Break - Sakshi
Sakshi News home page

Asia Cup 2023 Team India Squad: రాహుల్, శ్రేయస్‌ పునరాగమనం

Published Tue, Aug 22 2023 5:38 AM | Last Updated on Tue, Aug 22 2023 12:45 PM

Asia Cup 2023: KL Rahul, Shreyas Iyer Make Comebacks as India - Sakshi

సొంతగడ్డపై జరిగే వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు రిహార్సల్‌లాంటి ఆసియా కప్‌ టోర్నీ కోసం భారత బృందం సిద్ధమైంది. సుదీర్ఘ కాలంగా గాయాలతో సహవాసం చేసిన ఆటగాళ్లంతా కోలుకొని జట్టులోకి రాగా... ఇంకా వన్డేలే ఆడని కొత్త ప్లేయర్‌కు కూడా తొలిసారి చోటు లభించింది. అజిత్‌ అగార్కర్‌ నాయకత్వంలోని సెలక్షన్‌ కమిటీ 17 మందితో ఈ టీమ్‌ను ప్రకటించింది. ఇందులో నుంచి ఇద్దరిని తప్పించి 15 మందితో సెపె్టంబర్‌ 5లోగా వరల్డ్‌ కప్‌ టీమ్‌ను ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో అసలు సమరానికి సిద్ధం కావడానికి ఆసియా కప్‌ కీలకం కానుంది.

న్యూఢిల్లీ: ఆసియా కప్‌లో పాల్గొనే భారత క్రికెట్‌ జట్టును బీసీసీఐ సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్‌ 17 వరకు పాకిస్తాన్, శ్రీలంకలో ఈ టోర్నీ జరుగుతుంది. గాయాల నుంచి కోలుకొని సుదీర్ఘ విరామం తర్వాత కేఎల్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇప్పటికే ఐర్లాండ్‌తో టి20లు ఆడుతున్న బుమ్రా, ప్రసిధ్‌ కృష్ణలు కూడా వన్డేల్లో పునరాగమనం చేశారు. హైదరాబాదీ బ్యాటర్‌ తిలక్‌ వర్మ అరుదైన అవకాశాన్ని దక్కించుకోవడం ఈ సెలక్షన్స్‌లో కీలక పరిణామం.

ఇప్పటి వరకు ఇంకా వన్డేల్లో అరంగేట్రం చేయని తిలక్‌కు కీలకమైన ఆసియా కప్‌ జట్టులో చోటు దక్కింది. మరోవైపు లెగ్‌ స్పిన్నర్‌ యుజువేంద్ర చహల్‌ను టీమ్‌లోకి ఎంపిక చేయలేదు. రెగ్యులర్‌ పేసర్లు షమీ, సిరాజ్, బుమ్రా, ప్రసిధ్‌ ఉండగా... ఆల్‌రౌండర్లుగా  జడేజా, అక్షర్‌ పటేల్, పాండ్యా, శార్దుల్‌ కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. బ్యాటింగ్‌    బృందం విషయంలో ఎలాంటి అనూహ్య ఎంపికలు లేవు. జట్టులో ఒక్క ఆఫ్‌స్పిన్నర్‌ కూడా లేడు.  

వారిద్దరూ సిద్ధం...
రాహుల్‌ చివరిసారిగా మే 1న ఐపీఎల్‌ మ్యాచ్‌ బరిలోకి దిగి తొడ కండరాల గాయంతో ఆటకు దూరం కాగా, మార్చిలో ఆ్రస్టేలియాతో మూడో టెస్టు ఆడుతూ వెన్ను గాయంతో శ్రేయస్‌ మ్యాచ్‌ మధ్యలో నుంచి తప్పుకున్నాడు. వీరిద్దరు శస్త్రచికిత్సల అనంతరం ఇప్పటి వరకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో రీహాబిలిటేషన్‌లో ఉన్నారు. మిడిలార్డర్‌లో కీలకం కానున్న వీరిద్దరు కోలుకొని మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను సాధించడంతో మళ్లీ జట్టులోకి ఎంపిక చేశారు.

శ్రేయస్‌ పూర్తి ఫిట్‌ కాగా, రాహుల్‌ పాత గాయం నుంచి కోలుకున్నా... స్వల్ప అసౌకర్యంతో ఉన్నాడు. దాంతో ఆసియా కప్‌ కోసం ముందు జాగ్రత్తగా రిజర్వ్‌ ఆటగాడిగా సంజు సామ్సన్‌ను కూడా ఎంపిక చేశారు. వన్డేల్లో వరుసగా విఫలమైన పేలవ రికార్డు ఉన్నా... సూర్యకుమార్‌ యాదవ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచారు. రాహుల్‌ తర్వాత రెండో వికెట్‌ కీపర్‌గా సామ్సన్‌ కంటే ఇషాన్‌ కిషన్‌కు ప్రాధాన్యత దక్కింది.   

జట్టు వివరాలు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా (వైస్‌ కెపె్టన్‌), గిల్, కోహ్లి, శ్రేయస్, రాహుల్, జడేజా, బుమ్రా, కుల్దీప్, సిరాజ్, షమీ, ఇషాన్‌ కిషన్, శార్దుల్, అక్షర్, సూర్యకుమార్, తిలక్‌ వర్మ, ప్రసిధ్‌ కృష్ణ, సంజు సామ్సన్‌ (రిజర్వ్‌ ఆటగాడు).   

ఆఫ్‌స్పిన్నర్‌గా అశ్విన్, సుందర్‌లపై కూడా చర్చ జరిగింది. ఒక పేసర్‌ను తగ్గిస్తేనే చహల్‌ను తీసుకోగలిగేవాళ్లం. కానీ జట్టులో మన పేసర్ల పాత్ర కీలకం కానుంది. అయితే ఎవరికీ దారులు మూసుకుపోలేదు. మున్ముందు ఏదైనా జరగొచ్చు. ఒక ఆటగాడికి ప్రత్యేకంగా ఒకే స్థానం అంటూ ఏమీ ఉండదు. పరిస్థితిని బట్టి ఆర్డర్‌ మారుతుంది. అందరూ దీనికి సిద్ధంగా ఉండాలని చెప్పాం. అయితే దీనర్థం ఏడో నంబర్‌ ఆటగాడు ఓపెనర్‌గా, ఓపెనర్‌ వెళ్లి ఎనిమిదో స్థానంలో ఆడటం కాదు. అలాంటి పిచ్చి పనులు మేం చేయం. టాప్‌–3 చాలా కాలంగా మారలేదు కాబట్టి మిడిలార్డర్‌లో స్వల్పంగా మార్పులు ఉంటాయని నా ఉద్దేశం.
–రోహిత్‌ శర్మ, భారత కెప్టెన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement