కొంచెం ఇష్టం... కొంచెం కష్టం... | Sakshi Editorial On T20 World Cup Indian Cricket Team | Sakshi
Sakshi News home page

కొంచెం ఇష్టం... కొంచెం కష్టం...

Published Fri, May 3 2024 12:08 AM | Last Updated on Fri, May 3 2024 12:09 AM

Sakshi Editorial On T20 World Cup Indian Cricket Team

రానున్న టీ20 వరల్డ్‌ కప్‌కు రంగం సిద్ధమైంది. భారత క్రికెట్‌ జట్టు ఎంపిక జరిగింది. అమెరికా, వెస్టిండీస్‌లు వేదికగా జూన్‌ 2 నుంచి జరిగే పోటీలకు రోహిత్‌ శర్మ సారథిగా 15 మంది సభ్యులతో కూడిన ప్రాథమిక జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. మరో నలుగురు ఆటగాళ్ళను రిజర్వ్‌లుగా ఎంపిక చేసింది. భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ అజిత్‌ అగర్కర్‌ నేతృత్వంలోని సీనియర్‌ సెలక్షన్‌ ప్యానెల్‌ చేసిన ఎంపికలో కొందరు స్టార్‌ ఆటగాళ్ళకు చోటు దక్కలేదు. 

అలాగని, ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన ఎంపికలూ లేవు. విధ్వంసకర బ్యాట్స్‌ మన్‌ రింకూ సింగ్‌కు చోటివ్వకపోవడం, ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబయ్‌ ఇండియన్స్‌ (ఎంఐ) జట్టు సారథిగా విఫలమైనా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను వైస్‌ కెప్టెన్‌ను చేయడం విమర్శలకు తావిచ్చాయి. అలాగే, స్పిన్నర్లనేమో నలుగురిని తీసుకొని, జస్ప్రీత్‌ బుమ్రా నేతృత్వంలో ముగ్గురు పేసర్ల బృందానికే పరిమితం కావడమూ ప్రశ్నార్హమైంది. కొంత ఇష్టం, కొంత కష్టం, మరికొంత నష్టాల మేళవింపుగా సాగిన ఈ ఎంపికపై సహజంగానే చర్చ జరుగుతోంది.

గత ఏడాదంతా టీ20లలో పాల్గొనకపోయినా సీనియర్లు రోహిత్‌ శర్మ, కోహ్లీలకు సెలక్షన్‌ ప్యానెల్‌ పెద్దపీట వేసింది. నాలుగు గ్రూపుల్లో 20 జట్లతో, మొత్తం 55 మ్యాచ్‌లు సాగే ఈ స్థాయి భారీ పోటీలో, అమెరికాలోని అలవాటు లేని పిచ్‌లలో సీనియర్ల అనుభవం అక్కరకొస్తుందని భావన. ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అబ్బురపరిచేలా ఆడుతున్న వికెట్‌కీపర్‌ – బ్యాట్స్‌ మన్‌ రిషభ్‌ పంత్‌ ఎంపికతో గత రెండు వరల్డ్‌కప్‌లలో లేని విధంగా మిడిల్‌ ఆర్డర్‌లో లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌ ఆప్షన్‌ జట్టుకు దక్కింది. 

ఈసారి ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తూ, రాజస్థాన్‌ రాయల్స్‌ను అగ్రపీఠంలో నిలిపిన సంజూ శామ్సన్‌కు జట్టులో స్థానం దక్కింది. వెరపెరుగని బ్యాటింగ్‌తో, అలవోకగా సిక్స్‌లు కొట్టే అతడి సత్తాకు వరల్డ్‌ కప్‌ పిలుపొచ్చింది. మిడిల్‌ ఆర్డర్‌లో అతడు జట్టుకు పెట్టని కోట. స్పెషలిస్ట్‌ వికెట్‌ కీపర్లుగా శామ్సన్, పంత్‌లను తీసుకోవడంతో కె.ఎల్‌. రాహుల్‌కు మొండి చేయి చూపక తప్పలేదు. ఒకప్పుడు ఎగతాళికి గురైన ముంబయ్‌ కుర్రాడు శివమ్‌ దూబే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) జట్టులో మిడిల్‌ ఆర్డర్‌లో సిక్సర్ల వీరుడిగా, ప్రస్తుతం భారత వరల్డ్‌ కప్‌ టీమ్‌లో కీలక భాగస్వామిగా ఎదగడం గమనార్హం.

క్లిష్టమైన వేళల్లో సైతం బ్యాటింగ్‌ సత్తాతో జట్టును విజయతీరాలకు చేర్చే సత్తా, స్వభావం ఉన్న ఆటగాడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన పాతికేళ్ళ రింకూ సింగ్‌కు పేరు. అయితే, ఏ స్థానంలో ఆడించా లని మల్లగుల్లాలు పడి, చివరకు ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్‌కు జట్టులో చోటే ఇవ్వలేదు. రిజర్వ్‌ ఆట గాడిగా మాత్రం జట్టు వెంట అమెరికా, వెస్టిండీస్‌లకు వెళతాడు. పరుగుల సగటు 89, స్ట్రయిక్‌రేట్‌ 176 ఉన్న రింకూ లాంటి వారికి తుది జట్టులో స్థానం లేకపోవడం తప్పే. 

ఈ ఏడాది ఐపీఎల్‌లో బాగా ఆడుతున్న స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌కు జట్టులోకి మళ్ళీ పిలుపు వచ్చింది. అయితే, నలు గురు స్పిన్నర్లతోటి, అందులోనూ ఇద్దరు ముంజేతితో బంతిని తిప్పే రిస్ట్‌ స్పిన్నర్లతోటి బరిలోకి దిగడంతో మన బౌలింగ్‌ దాడిలో సమతూకం తప్పినట్టుంది. ప్రధాన పేసర్లు ముగ్గురే కావడం, బౌలింగ్‌లో హార్దిక్‌ ఫామ్‌లో లేకపోవడం, సీఎస్‌కేలో శివమ్‌కు గతంలో బౌలింగ్‌ ఛాన్స్‌ ఆట్టే రాకపోవడంతో టీ20 వరల్డ్‌ కప్‌లో మన పేసర్ల విభాగం బలహీనంగా కనిపిస్తోంది. 

వివరణలేమీ ఇవ్వకుండానే మే 23 వరకు ఈ ప్రాథమిక జట్టులో మార్పులు చేసుకొనే అవకాశం సెలక్టర్లకుంది. కానీ, ఫైనల్‌ 15 మందిని మార్చడానికి అగర్కర్‌ బృందం ఇష్టపడుతుందా అన్నది అనుమానమే. అది అటుంచితే, 2007 తర్వాత భారత్‌ టీ20 టైటిల్స్‌ ఏవీ గెలవలేదు. నిజానికి, ధోనీ సారథ్యంలోని యువకుల జట్టు 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్‌లో గెలిచిన తీరు మన క్రికెట్‌లో కొత్త మలుపు. టీ20లకు భారత్‌ అడ్డాగా మారిందంటే దాని చలవే. ఆ వెంటనే 2008లో ఐపీఎల్‌ ఆరంభంతో కథే మారిపోయింది. 

ఇవాళ ప్రతి వేసవిలో పేరున్న అంతర్జాతీయ ఆటగాళ్ళు భారత్‌కు క్యూ కడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక లీగ్స్‌ వచ్చినా, ఐపీఎల్‌దే హవా. ఇంతవున్నా 2014లో ఒక్కసారి శ్రీలంకతో ఫైనల్స్‌లో ఓడినప్పుడు మినహా ఎన్నడూ విజయం అంచుల దాకా మనం చేరింది లేదని గమనించాలి. ఇది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అంశం. యువ ప్రతిభను ప్రోత్సహించడం, ఆటకు తగ్గ ఆటగాళ్ళను ఎంచుకోవడమనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోతే కష్టం. ఆ సూత్రాన్ని పాటించడం వల్లే 2007లో మనకు కప్పు దక్కిందని గుర్తుంచుకోవాలి.

గమనిస్తే, దశాబ్దిన్నర పైగా క్రికెట్‌ స్వరూప స్వభావాలే మారిపోయాయి. మిగతావాటి కన్నా టీ20లు పాపులరయ్యాయి. బంతిని మైదానం దాటించే బ్యాటింగ్‌ విధ్వంసాలు, స్కోర్‌ బోర్డ్‌ను పరి గెత్తించే పరుగుల వరదలు, మైదానంలో మెరుపు లాంటి ఫీల్డింగ్‌ ప్రతిభలు సాధారణమై పోయాయి. టెస్ట్, వన్డే క్రికెట్‌లు సైతం తమ పూర్వశైలిని మార్చుకోవాల్సి వచ్చింది. ఆర్థికంగానే కాక అనేక విధా లుగా వాటిని టీ20 మింగేసే పరిస్థితీ వచ్చింది. బ్యాట్స్‌మన్ల వైపు మొగ్గుతో ఈ పొట్టి క్రికెట్‌ పోటీలు బౌలర్లకు నరకంగా మారి, ఆటకు ప్రాణమైన పోటీతత్వాన్ని హరిస్తున్నాయి. 

అందుకే, 2008లో ఆరంభమైన ఐపీఎల్‌ ఏటికేడు క్రమంగా మునుపటి ఆసక్తినీ, ఆదరణనూ కోల్పోతోంది. దీనిపై దృష్టి పెట్టాల్సి ఉంది. బౌలర్లకు అనుకూలించే పిచ్‌ల తయారీ మొదలు టీ20 ఫార్మట్‌లో, ఐపీఎల్‌లో కొన్ని నియమ నిబంధనల సవరణ దాకా అవసరమైన చర్యలు చేపట్టాలి. తద్వారా పొట్టి క్రికెట్‌కు కొత్త ఊపిరులూదాలి. టీ20 వరల్డ్‌ కప్‌లో విజయం సాధించాలంటే ఆటలోనే కాదు... ఎంపికలోనూ దూకుడు అవసరం. రిస్క్‌ లేని సేఫ్‌ గేమ్‌తోనే పొట్టి క్రికెట్‌లో కప్పు కొట్టగలిగితే అది ఓ కొత్త చరిత్ర! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement