భారీ విజయం... భావి ప్రయాణం... | Sakshi Editorial On T20 World Cup 2024 Victory | Sakshi
Sakshi News home page

భారీ విజయం... భావి ప్రయాణం...

Published Tue, Jul 2 2024 4:43 AM | Last Updated on Tue, Jul 2 2024 4:43 AM

Sakshi Editorial On T20 World Cup 2024 Victory

శనివారం రాత్రి పొద్దుపోయాక... అద్భుతమే జరిగింది. గతంలో అనేకసార్లు ఊరించి ఉసూరుమనిపించినట్టే ఈసారీ ఫలితం అటూ ఇటూగా ఉంటుందేమోనని భయపడుతున్న క్రీడాభిమానుల సందేహాలు తుదిఘట్టంలో పటాపంచలయ్యాయి. పదిహేడేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. భారత క్రికెట్‌ జట్టు విజయపతాకం ఎగరేసింది. పొట్టి క్రికెట్‌ విధానంలో తొలి ప్రపంచ కప్‌ను 2007లో గెలిచిన భారత జట్టు... మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత తొమ్మిదో ప్రపంచ కప్‌ను అందుకుంది. 

మరెక్కడా లేనంత భారీగా, హంగులూ ఆర్భాటాలతో ఆకర్షణీయంగా, అత్యంత సంపన్నంగా టీ20 లీగ్‌ను జరిపే భారత్‌ మరోసారి ఆ ఫార్మట్‌లో జగజ్జేతగా నిలిచింది. జూన్‌ 29న వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో ఆఖరు దాకా ఉత్కంఠగా సాగిన ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌– 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత జట్టు సాధించిన విజయం చిరకాలం గుర్తుండిపోతుంది. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వగా, న్యూయార్క్‌లో కొత్తగా వెలసిన స్టేడియమ్‌ మొదలు వివిధ కరేబియన్‌ దీవుల్లో సాగిన ఈ వరల్డ్‌ కప్‌ కొత్త ఉత్తేజం తెచ్చింది. చివరకు కప్‌ గెలుపుతో కోచ్‌గా ద్రావిడ్‌కూ, టీ20ల నుంచి రోహిత్‌ శర్మ, కోహ్లీ, రవీంద్ర జడేజాలకూ తీయటి వీడ్కోలు దక్కింది.

గతంలో ఎన్నో విజయాలు సాధించినా... ఫార్మట్‌ ఏదైనప్పటికీ ప్రపంచ కప్‌ విజేతగా నిలవడమనేది ఎప్పుడూ ప్రత్యేకమే. 1983లో తొలిసారిగా కపిల్‌దేవ్‌ సారథ్యంలోని భారత జట్టు వన్డేలలో వరల్డ్‌ కప్‌ సాధించినప్పటి నుంచి సామాన్య ప్రజానీకంలో సైతం క్రికెట్‌ పట్ల, ప్రపంచ కప్‌ పట్ల పెరిగిన ఆకర్షణ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత 20 ఓవర్ల పొట్టి క్రికెట్‌ వచ్చాక, 2007లో మహేంద్ర సింగ్‌ ధోనీ సేన తొలి టీ20 వరల్డ్‌ కప్‌ మనం దక్కించుకోవడంతో ఇక ఆకాశమే హద్దయింది. 

2011లో మరోసారి వన్డేల్లో వరల్డ్‌ కప్‌ కైవసం చేసుకున్నాం. లెక్కలు తీస్తే... మనం టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి 17 ఏళ్ళయితే, అసలు ఏదో ఒక ఫార్మట్‌లో ప్రపంచ కప్‌ గెలిచి 13 ఏళ్ళవుతోంది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నిర్వహించే ఏదో ఒక టోర్నీలో విజేతగా నిలిచి, స్వదేశానికి ట్రోఫీ పట్టుకొచ్చి కూడా కనీసం 11 ఏళ్ళవుతోంది. 2013లో ఇంగ్లండ్‌లో ‘ఛాంపియన్స్‌ ట్రోఫీ’ తర్వాత ఐసీసీ పోటీల్లో మనకు మళ్ళీ ట్రోఫీలు దక్కలేదు. ఇన్నాళ్ళకు ఆ కొరత తీరింది. 

కొన్నేళ్ళుగా విజయావకాశాలు పుష్కలంగా ఉన్న ఫేవరెట్‌గా భారత క్రికెట్‌ జట్టు రకరకాల టోర్నీలలో బరిలోకి  దిగుతోంది. కానీ, ప్రతిసారీ ఏదో ఒక దశలో విఫలమవుతోంది. కోచ్‌ ద్రావిడ్, కెప్టెన్‌ రోహిత్‌ల జోడీ సంగతికే వస్తే, ‘వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్స్‌’లో జట్టును ఫైనల్‌ దాకా తీసుకెళ్ళినా ఫలితం దక్కలేదు. చివరకు ఏడు నెలల క్రితం గత నవంబర్‌లో జరిగిన 2023 వన్డే వరల్డ్‌ కప్‌ లోనూ మంచి ఫామ్‌లో ఉన్న భారత జట్టు ఆఖరి ఘట్టంలో అహ్మదాబాద్‌లో తడబడింది. ఆ రెండుసార్లూ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. 

ఈ తాజా టీ20 వరల్డ్‌ కప్‌లో సైతం మొదటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకువచ్చిన మన జట్టు శనివారం నాటి ఫైనల్‌లో ఒక దశలో ఓటమి అంచుల దాకా వెళ్ళిపోయింది. ప్రత్యర్థి సౌతాఫ్రికా జట్టు 30 బంతుల్లో 30 పరుగులే చేయాలి. పైగా 6 వికెట్లున్నాయి. ఆ పరిస్థితుల్లో బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్, ఆల్‌రౌండర్‌ హార్దిక్‌పాండ్యా తెలివైన ఆట తీరు, బౌండరీ దాటుతున్న బంతిని అద్భుతంగా ఒడిసి పట్టుకొని ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను అవుట్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఫీల్డింగ్‌ మ్యాచ్‌ దిశను మార్చేశాయి. 

ఎట్టకేలకు సమష్టి స్ఫూర్తితో ఓటమి కోరల నుంచి కూడా విజయాన్ని అందుకొనే కళలో భారత్‌ ఆరితేరింది. జట్టు అవసరాలకు తగ్గట్టు భిన్నమైన ఆట శైలిని ఆటగాళ్ళు అవలంబించడం నేర్చుకున్నారు. పోయిన పాత ఫామ్‌ను మళ్ళీ అత్యవసరమైన ఫైనల్‌లో అందుకొని, అవతల వికెట్లు పడిపోతున్నా తడబడకుండా పిచ్‌ వద్ద పాతుకుపోయి, కోహ్లీ 76 పరుగులు చేసిన తీరు అందుకు మచ్చుతునక. 

రోహిత్‌ శర్మ సారథ్యం, అక్సర్‌ పటేల్‌ లాంటి ఆల్‌రౌండర్ల ప్రదర్శన, కీలకమైన ఫైనల్‌లో ప్రమాదకరంగా మారిన క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్‌ లాంటి బ్యాట్స్‌మన్లను ఔట్‌ చేసిన యువ సీమర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ పరిణతి... ఇలా అన్నీ కలిస్తేనే ఈ ప్రపంచ విజేత పట్టం. దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన ఆట... అందులోనూ వరల్డ్‌కప్‌ విజయం... అర్ధరాత్రి దాటినా సరే దేశమంతటా జనం వీధుల్లోకి వచ్చి మరీ ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకొన్నది అందుకే! మన దేశంలోనే కాదు... దేశదేశాల్లో పెరుగుతున్న భారత క్రికెట్‌ క్రీడాభిమానులకూ ఇది పండుగ వాతావరణం తెచ్చింది. 

ఒక్కమాటలో, మన దేశం ఇప్పుడు క్రికెట్‌ సూపర్‌పవర్‌. ఒకప్పుడు 1970లు – 80లలో బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌ సేనతో వీరవిహారం చేసిన వెస్టిండీస్‌ జట్టుతో ఇప్పుడు భారత్‌ ఆటగాళ్ళను విశ్లేషకులు పోలుస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. మరి ఇక్కడ నుంచి మన క్రికెట్‌ ప్రయాణం ఎలా ముందుకు సాగనుందన్నది ఇక కీలకం. కోచ్‌ ద్రావిడ్‌ మొదలు కీలక ఆటగాళ్ళ దాకా పలువురి రిటైర్మెంట్‌తో ఒక శకం ముగిసింది. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్ళపై గతంలో పెట్టుబడి పెడితేనే ఇప్పుడీ ఫలితాలు వచ్చాయని మర్చిపోరాదు. 

భవిష్యత్తే లక్ష్యంగా జట్టుకు కొత్త రక్తాన్ని ఎక్కించాలి. కొత్తగా కోచ్‌ బాధ్యతలు చేపట్టనున్న గౌతమ్‌ గంభీర్‌ ఖాళీ అవుతున్న కీలక స్థానాల భర్తీపై దృష్టి పెట్టాలి. మ్యాచ్‌లు ఆడకున్నా ఈ వరల్డ్‌కప్‌ జట్టులో భాగమైన యశస్వీ జైస్వాల్‌ సహా పలువురు ప్రతిభావంతుల్ని ఏరి, ఇకపై మరింత సానబెట్టాలి. కొద్ది నెలల్లోనే 2025లో పాకిస్తాన్‌లో జరిగే ఛాంపియన్స్‌ట్రోఫీ నాటికి సర్వసన్నద్ధం కావాలి. ఆ పునర్నిర్మాణానికి తాజా విజయం ఓ బలమైన పునాది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement