ఆత్మపరిశీలన అవసరం! | Sakshi Editorial On Indian Cricket Team | Sakshi
Sakshi News home page

ఆత్మపరిశీలన అవసరం!

Published Tue, Nov 5 2024 4:44 AM | Last Updated on Tue, Nov 5 2024 5:32 AM

Sakshi Editorial On Indian Cricket Team

సొంతగడ్డపై చిరకాలంగా భారత క్రికెట్‌ జట్టు అజేయమైనదనే రికార్డు కుప్పకూలింది. భారత పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ చేతిలో మనవాళ్ళు మొత్తం 3 టెస్టుల్లోనూ ఓటమి పాలయ్యారు. స్వదేశంలో టెస్ట్‌సిరీస్‌ను ఇలా 0–3 తేడాతో చేజార్చుకోవడం భారత క్రికెట్‌చరిత్రలో ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్‌ పరాభవంతో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ర్యాంకింగుల్లో భారత్‌ అగ్రస్థానం ఆస్ట్రేలియాకు కోల్పోయి, ద్వితీయ స్థానానికి పడిపోయింది. ఆటలో గెలుపోటములు సహజమైనా, ఈ స్థాయి పరాజయం భారత జట్టు అత్యవసరంగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది. టీ20ల మోజులో పడి టెస్ట్‌ క్రికెట్‌కు అవసరమైన కనీసపాటి సన్నద్ధత అయినా లేకుండానే బరిలోకి దిగిన మన ఆటగాళ్ళ నిర్లక్ష్యాన్ని నిలదీస్తోంది. 

ఆఖరుసారిగా 2012లో ఇంగ్లండ్‌కు చెందిన అలస్టయిర్‌ కుక్‌ చేతిలో ధోనీ సేన 2–1 తేడాతో టెస్ట్‌ సిరీస్‌లో ఓటమి పాలైన తర్వాత గత పుష్కరకాలంగా భారత క్రికెట్‌ జట్టు స్వదేశంలో ఎన్నడూ మళ్ళీ సిరీస్‌ను కోల్పోలేదు. భారత జట్టు సారథులు మారుతూ వచ్చినా, 18 టెస్ట్‌ సిరీస్‌లలో విజయం మనదే. కివీస్‌పైనా ఆ ట్రాక్‌ రికార్డ్‌ కొనసాగుతుందని అందరూ భావించిన నేపథ్యంలో ఇది ఊహించని ఎదురుదెబ్బ. గత నెలలో బెంగుళూరులో 8 వికెట్ల తేడాతో తొలి టెస్ట్, ఆ వెంటనే పుణేలో 113 పరుగుల తేడాతో మలి టెస్ట్‌  ఓడిపోయినప్పుడే సిరీస్‌ చేజారింది. 

అయితే, ముంబయ్‌లో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లోనైనా గెలిచి, భారత జట్టు పరువు నిలుపుకొంటుందని ఆశించారు. చివరకు ఆ ఆశను కూడా వమ్ము చేసి, కివీస్‌ ముందు మన ఆటగాళ్ళు చేతులెత్తేయడం ఇప్పుడిప్పుడే మర్చిపోలేని ఘోర పరాభవం. ముంబయ్‌లో 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక ఆదివారం భారత జట్టు 121 పరుగులకే ఆలౌట్‌ అవడంతో, అవమానకరమైన రీతిలో 0–3 తేడాతో సిరీస్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చింది. కచ్చితంగా ఇది భారత జట్టుకు మేలుకొలుపు. 

భారత జట్టు వ్యూహరచన లోపాలు కొల్లలు. కివీస్‌తో బెంగుళూరు టెస్ట్‌లో టాస్‌ గెలిచాక మన వాళ్ళు మొదట బ్యాటింగ్‌ ఎంచుకోవడం అలాంటిదే. బ్యాట్స్‌మన్ల ఆర్డర్‌లో అనూహ్య ప్రయోగాల సంగతీ అంతే. ఇక, అవసరం లేకున్నా పుణేలో బంతి సుడులు తిరిగేలా పిచ్‌ రూపొందించారు. అదీ ప్రత్యర్థి జట్టుకే లాభించింది. కాబట్టి, భారత జట్టులోని మేధాబృందం ఆగి, ఆలోచించాలి. 

సిరీస్‌కు ముందు దులీప్‌ ట్రోఫీలో ఆడాలని చెప్పినా, మరిన్ని వసతుల కోసం అనంతపురం నుంచి బెంగు ళూరుకు వేదిక మార్చినా అగ్రశ్రేణి ఆటగాళ్ళు ముందుకు రాకపోవడం ఘోరం. వారిని అందుకు అనుమతించడం ఒక రకంగా క్రికెట్‌ బోర్డ్‌ స్వయంకృతాపరాధమే. దాని పర్యవసానం, సిరీస్‌ భవిత తొలి టెస్ట్, తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల అత్యల్పస్కోర్‌కి భారత్‌ అవుటైనప్పుడే అర్థమైపోయింది. 

స్పిన్‌ ఆడడంలో భారత ఆటగాళ్ళు దిట్టలని ప్రతీతి. కానీ, అదంతా గతం. ఇప్పుడు పరిస్థితి మారింది. జట్టులో బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అయిన విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలు ఇద్దరూ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్‌లో తరచూ ఔటవుతున్నారనీ, 2021 – 2024 మధ్య సొంత గడ్డపైన స్పిన్‌ బౌలింగ్‌లో సాధించిన సగటు పరుగులు 30 మాత్రమేననీ విశ్లేషకులు లెక్కలు తీశారు. అసాధారణ స్పిన్నర్లు కాకున్నా, కివీస్‌ బౌలర్ల చేతుల్లో భారత ఆటగాళ్ళు టకటకా ఔటవడం చూస్తే, స్పిన్‌లో మనం మాస్టర్లం కాదని తాజా సిరీస్‌ ఎత్తిచూపినట్టయింది. 

అలాగే, ఎర్ర బంతితో ఆడే టెస్ట్‌లకూ, తెల్ల బంతితో నడిచే టీ20 లకూ మధ్య చాలా తేడా ఉందని ఆటగాళ్ళు గ్రహించాలి. అన్ని బంతులూ ఆడి తీరాలి, పరుగులు చేయాలనే టీ20ల ధోరణితోనే టెస్ట్‌లు ఆడితే చిక్కులు తప్పవు. 2021లో టెస్ట్‌ ఓపెనర్‌గా ఇంగ్లండ్‌లో సక్సెస్‌ సాధించిన రోహిత్‌ మార్చుకున్న టీ20 ధోరణితోనే కివీస్‌పై ఆడడం వల్ల ఇబ్బంది పడ్డారు. కెప్టెన్‌గా ఆయనే పరుగులు చేయకపోతే, జట్టు పైన, ఆయన సారథ్యంపైన ఒత్తిడి తప్పదు. 

గతంలో 2011–12 ఆస్ట్రేలియా పర్యటన భారత జట్టు నుంచి ద్రావిడ్, లక్ష్మణ్‌ల రిటైర్మెంట్‌కు దారి తీసింది. చరిత్ర పునరావృతమై, ఇప్పుడు రానున్న టూర్‌ కోహ్లీ, రోహిత్‌లకు చివరిది అవుతుందా? చెప్పలేం. అనూహ్యంగా వారిద్దరూ విఫలమైన కివీస్‌ సిరీస్‌ పరిస్థితే ఆస్ట్రేలియా టూర్‌ లోనూ ఎదురైతే, సీనియర్లు రిటైర్‌ కావాలంటూ ఒత్తిడి పెరుగుతుంది. ఇక, వచ్చే వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపి యన్‌ షిప్‌ విషయానికొస్తే, కివీస్‌ సిరీస్‌ దెబ్బతో వరల్డ్‌ టెస్ట్‌ ర్యాకింగుల్లో మన స్థానం పడిపోయినందున భారత్‌ ఫైనల్‌కు చేరడం కష్టమే. 

ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియాను దాని సొంత గడ్డపై 4–0 తేడాతో ఓడిస్తే కానీ, మన ఫైనల్‌ ఆశ పండదు. ఏ రకంగా చూసినా అసాధ్యమే. ఈ పరిస్థితుల్లో ఆస్ట్రేలియా టూర్‌లోనైనా మన జట్టు మితిమీరిన ఆలోచనలు, అంచనాలు పక్కనబెట్టి కేవలం ఆడు తున్న టెస్టులపై ఒకదాని వెంట మరొకటిగా దృష్టి పెడితే మేలు. పరిస్థితులు, పిచ్‌ స్వభావాన్ని బట్టి అప్పటికప్పుడు ఆట తీరును మలుచుకోవాలే తప్ప, ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి దూకుడు చూపుదామనుకుంటే చిక్కే. మారకపోతే మళ్ళీ కివీస్‌తో సిరీస్‌లో లాగా బోర్లా పడక తప్పదు. 

నిజానికి, భారత్‌ ఇప్పటికీ మంచి జట్టే. ఆటగాళ్ళలో ప్రతిభకు కొదవ లేదు. అయితే, టాలెంట్‌ ఎంత ఉన్నా ఆటలో టెంపర్‌మెంట్‌ ముఖ్యం. వాటికి తోడు కింద పడినా మళ్ళీ పైకి లేచి సత్తా చాటే చేవ కీలకం. మన జట్టు ఇప్పుడు వీటిని ప్రదర్శించాలి. అందుకోసం తాజా సిరీస్‌ ఓటమికి కారణాలను ఆత్మపరిశీలన చేసుకోవాలి. భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 3–0 తేడాతో సిరీస్‌ను కోల్పోయి, ఈ అధఃపాతాళానికి ఎలా పడిపోయామో స్వీయ విశ్లేషణ జరుపుకోవాలి. టీ20 వరల్డ్‌ కప్‌లో విజేతగా నిలిచిన ఆనందాన్ని మర్చిపోక ముందే ఈ పరాజయాన్ని ఎలా కోరి కొని తెచ్చుకున్నామో విశ్లేషించుకోవాలి. ఎంతైనా, పరాజయాలే విజయాలకు మొదటి మెట్టు కదా! 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement