పరమపద సోపానపటంలో చివరి దాకా వెళ్ళి, మరొక్క గడిలో లక్ష్యాన్ని అందుకుంటామనగా పెద్ద పాము నోటిలో పడితే ఎలా ఉంటుంది? విజయం అంచుల దాకా వెళ్ళి, ఓటమి కోరల పాలబడితే ఎవరి మానసిక పరిస్థితి అయినా ఏమవుతుంది? వరల్డ్ కప్‌లో అప్రతిహతంగా దూసుకెళ్ళి, తీరా ఆదివారం ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తయిన భారత క్రికెట్ జట్టు పరిస్థితీ, 140 కోట్ల మంది భారతీయుల మనఃస్థితీ అంతే.
లక్షా 32 వేల మంది జనంతో క్రిక్కిరిసిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియమ్‌లో నిశ్శబ్దం తాండవించగా, ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి, ఆరో ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. శత కోటి భారతీయుల స్వప్నం భంగమైంది.
ఆసీస్‌కు ఇది ఆరో వరల్డ్ కప్ టైటిలైతే, ఆ దేశంతో ఇరవై ఏళ్ళ క్రితం దక్షిణాఫ్రికాలో ప్రపంచ కప్ ఫైనల్స్‌లో తలపడినప్పటి లానే భారత్‌కు మళ్ళీ చేదు అనుభవమే ఎదురైంది. నిజానికి, ఈసారి భారత జట్టు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగకపోయినా, టోర్నీ ఆరంభం నుంచి ఆటలో ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. పది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో గ్రూప్ దశ నుంచి ఎదురన్నది లేకుండా సాగింది.
2019 సెమీస్‌లో తమను ఓడించిన న్యూజిలాండ్‌ను ఈసారి సెమీస్‌లో తాను మట్టికరిపించి, ఫైనల్‌కు చేరింది. వరుస విజయాలతో కప్పు భారత్‌దే అన్న నమ్మకం కలిగించింది. తీరా ఆఖరి మహా సంగ్రామంలో తడబడింది. ఇక, తడబడుతూ ఈ టోర్నీని మొదలుపెట్టి, ఆఖరికి అఫ్గానిస్తాన్ చేతిలో సైతం ఓటమి కోరల నుంచి మ్యాక్స్‌వెల్ అసాధారణ డబుల్ సెంచరీతో బయటపడ్డ ఆసీస్ ఆఖరికి విజేత అయింది. తనదైన రోజున మన జట్టు మెడలు వంచి, టైటిల్‌ను సొంతం చేసుకుంది.
టోర్నీలో అత్యధిక పరుగులు (కోహ్లీ – 765 రన్స్), అత్యధిక వికెట్లు (షమీ– 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు), అత్యుత్తమ విజయ శాతం (90.9) లాంటి ఘనతలు సాధించిన భారత జట్టు ఆఖరి మెట్టుపైకి చేరకుండానే ఆగిపోయింది. అలాగని మునుపెన్నడూ లేనంత బలంగా కనిపిస్తున్న ఈ జట్టును తప్పుబట్టాల్సిన పని లేదు. అప్రతిహత విజయాలతో, అసాధారణ ప్రతిభా ప్రదర్శనతో, గత నెలన్నర పైగా కోట్లాది అభిమానులకు ఆనందోద్వేగాల్ని పంచిన భారత జట్టును తక్కువ చేయలేం.
అసలు ప్రపంచ కప్‌లో ఫైనల్స్ దాకా చేరడమే గొప్ప.అలాగే, ఆటలో గెలుపోటములు సహజమనీ, విజేత ఒకరే ఉంటారనీ గుర్తెరగాలి. కాకపోతే, లోటుపాట్లేమిటన్నది కూడా సమీక్షించుకోవాలి. పేరున్న వేదికల్ని సైతం పక్కకునెట్టి, పాలకపక్ష పెద్దలు, బీసీసీఐ సారథుల స్వస్థలం లాంటి ఇతరేతర కారణాలతో అహ్మదాబాద్‌ను ఫైనల్స్‌కు వేదిక చేయడం మన కురచబుద్ధి రాజకీయాల తప్పు. ఇరుజట్లకూ సమాన విజయావకాశాలు కల్పించకుండా, టాస్‌ను కీలకం చేసి, మ్యాచ్‌ను లాటరీగా మార్చేసే పిచ్‌ను తుదిపోరుకు సిద్ధం చేయడం మరో తప్పు. ఇవన్నీ కొంప ముంచాయి.
ప్రపంచ టోర్నీల్లో విజేతగా నిలిచే విషయంలో భారత్ వెనుకబడే ఉంది. ఈసారీ ఆ లోటు తీర లేదు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీని సాధించిన తర్వాత దశాబ్ద కాలంగా మరో ప్రపంచ టైటిల్ ఏదీ మనం గెలవలేదు. పదేళ్ళ లెక్క తీస్తే, సెమీస్‌లో 3 సార్లు, ఫైనల్స్‌లో 5 సార్లు... మొత్తం 8 కీలక మ్యాచ్‌లలో మనం చతికిలపడ్డాం.
భారీ గేమ్స్ తాలూకు ఒత్తిడి, ఓటమి భయం, జట్టు ఆలోచనా దృక్పథం... ఇలా అనేకం అందుకు కారణాలు కావచ్చు. అంతర్జాతీయ వేదికపై జెండా ఎగరేసేందుకు మనలోని ఈ అంతర్గత ప్రత్యర్థులపై ముందు విజయం సాధించాలి. అందుకెలాంటి ప్రయత్నం, శ్రమ, శిక్షణ అవసరమన్న దానిపై క్రికెట్ యంత్రాంగం దృష్టి పెట్టాలి. కలబడి ఆడడమే కాదు... ఒత్తిడిలోనూ నిలబడి గెలవడమూ కీలకమేనని ఐపీఎల్ అలవాటైన నవతరానికి నూరిపోయాలి.
టాస్ మొదలు ఏదీ కలసిరాని చావో రేవో మ్యాచ్‌లో పదో ఓవర్ నుంచి యాభయ్యో ఓవర్ మధ్య 40 ఓవర్లలో 4 బౌండరీలే భారత బ్యాట్స్‌మన్లు కొట్టారన్న లెక్క ఆశ్చర్యపరుస్తుంది. బ్యాటింగ్‌లో అవతల వికెట్లు టపటపా పడుతుంటే ఒక్కో పరుగుతో, భాగస్వామ్యం, తద్వారా భారీ ఇన్నింగ్స్ నిర్మించే ఓర్పు కావాలి. బంతిని బలంగా బాదడం కన్నా ప్రత్యర్థి ఫీల్డర్ల మధ్య ఖాళీల్లో కొట్టే నేర్పు రావాలి. అన్నీ తెలిసిన భారత్ ఆఖరి రోజున ఆ పనిలో విఫలమైంది.
బలంగా కనిపించే జట్టులో తొలి అయిదుగురి తర్వాత బ్యాటింగ్ బలహీనతలూ బయటపడ్డాయి. కనీసం మరో 40 – 50 పరుగులు చేసివుంటే, బౌలింగ్‌లో, ఫీల్డింగ్‌లో మరింత రాణించివుంటే కథ మరోలా ఉండేదన్న మాటలు వినిపిస్తున్నది అందుకే! అలాగని, ఆసీస్ తాజా విజయాన్ని తక్కువ చేయలేం. ప్రతి కీలక సందర్భంలో సర్వశక్తులూ ఒడ్డే ఆ జట్టు పోరాటస్ఫూర్తిని అలవరచుకోవడమే ఎప్పటికైనా మనకు ముఖ్యం. ఆటలను పిచ్చిగా ప్రేమించే, కేవలం 2.5 కోట్ల జనాభా గల ఆ దేశం తరగని ప్రేరణ.
మన జట్టు గెలవాలనుకోవడం సబబే కానీ, అన్ని రోజులూ, అన్ని మ్యాచ్‌లూ మనమే గెలవాల నుకోవడం అత్యాశ. అంచనాలు, అనవసర ఒత్తిళ్ళు పెంచేయడం మన లోపమే. కొమ్ములు తిరిగిన ఆటగాళ్ళకైనా కలసిరాని రోజులూ కొన్ని ఉంటాయి. భారత క్రికెట్‌లో మొన్న ఆదివారం అలాంటిదే. ప్రత్యర్థి ఆటగాడు సెంచరీ కొట్టినా, ఆ జట్టు కెప్టెన్ కప్ అందుకున్నా అభినందించలేనంత సంకుచిత ధోరణి క్రీడాస్ఫూర్తి కానేరదు.
అహ్మదాబాద్ సాక్షిగా అందరం ముందు అది తెలుసుకోవాలి. అత్యు త్తమ బౌలింగ్ దాడి, కోహ్లీ అపూర్వ ఫామ్, రోహిత్ ఘనసారథ్యం లాంటి గొప్పలెన్నో ఈ టోర్నీ మిగిల్చిందని గుర్తుంచుకోవాలి. ఇప్పుడిక ప్రతిభకు పదును పెట్టుకుంటూనే, మనదైన మరో రోజు కోసం ఆగుదాం. వచ్చే వరల్డ్‌కప్‌ను ముద్దాడేందుకు నాలుగేళ్ళు నిరీక్షిద్దాం. శారీరకంగా, మానసికంగా మన జట్టు అందుకు సన్నద్ధమయ్యేందుకు సహకరిద్దాం. నెక్స్›్ట టైమ్ బెటర్ లక్... టీమిండియా!
శతకోటి జనుల స్వప్నభంగం
Published Tue, Nov 21 2023 12:19 AM | Last Updated on Tue, Nov 21 2023 8:40 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment