![Jay Shah Might Take BIG Step As ICC Chairman: Can probably Introduce This](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/7/jayshah.jpg.webp?itok=k_H2-nVS)
టెస్టు క్రికెట్ మనుగడ కోసం సిరీస్‌లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్త తరహా మార్పుల గురించి యోచిస్తోంది. సంప్రదాయ ఫార్మాట్‌పై మరింత ఆసక్తి పెంచేందుకు, ఎక్కువ సంఖ్యలో హోరాహోరీ సమరాలు చూసేందుకు టెస్టులను.. రెండు శ్రేణుల్లో( 2- Tier Test cricket) నిర్వహించాలని భావిస్తోంది.
టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడే మూడు ప్రధాన జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో ఒక శ్రేణి... ఇతర జట్లు కలిపి మరో శ్రేణిలో ఉండే విధంగా ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. దీని అమలు, విధివిధానాలపై ఇంకా స్పష్టత లేకున్నా... ఐసీసీ చైర్మన్‌గా జై షా(Jay Shah) ఎంపికయ్యాక పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
సీఏ, ఈసీబీ చైర్మన్‌లతో చర్చలు
ఈ అంశంపై చర్చించేందుకు ఈ నెలలోనే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చైర్మన్ మైక్ బెయిర్డ్, ఈసీబీ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్‌లతో జై షా చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రకటించిన భవిష్యత్తు పర్యటనల కార్యక్రమం (ఎఫ్‌టీపీ) 2027తో ముగుస్తుంది. ఆ తర్వాతి నుంచి కొత్త విధానాన్ని తీసుకురావాలని ఐసీసీ అనుకుంటోంది.
తీవ్రంగా వ్యతిరేకించిన చిన్న జట్లు
నిజానికి ఇలాంటి ప్రతిపాదన 2016లో వచ్చింది. అయితే ఇలా చేస్తే తమ ఆదాయం కోల్పోవడంతో పాటు పెద్ద జట్లతో తలపడే అవకాశం కూడా చేజారుతుందని జింబాబ్వే, బంగ్లాదేశ్ సహా పలు జట్లు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి.
ఈ నేపథ్యంలో ఐసీసీ అప్పట్లో ఈ ఆలోచనను పక్కన పెట్టింది. అయితే ఇప్పుడు దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ ఇది ముందుకు వచ్చింది.
టాప్–3 జట్ల మధ్యే ఎక్కువ మ్యాచ్‌లు చూడాలని అభిమానులు కోరుకుంటారని, ఆ మ్యాచ్‌లే అత్యంత ఆసక్తికరంగా సాగి టెస్టు క్రికెట్ బతికిస్తాయంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి(Ravi Shastri) తదితరులు ఈ తరహా రెండు శ్రేణుల టెస్టు సిరీస్‌లకు గతంలోనే మద్దతు పలికారు. పెద్ద జట్టు, చిన్న జట్టు మధ్య టెస్టులు జరిగితే ఎవరూ పట్టించుకోరని అతను ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు.
అఫ్గానిస్తాన్ టెస్టుల్లో తొలిసారి ఇలా...
బులవాయో: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అఫ్గానిస్తాన్ జట్టు రెండు టెస్టులతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌ను తొలిసారి దక్కించుకుంది. అంతేకాకుండా ఆసియా అవతల తొలి టెస్టు సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. జింబాబ్వేతో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా సోమవారం ముగిసిన రెండో టెస్టులో అఫ్గానిస్తాన్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 205/8తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన జింబాబ్వే అదే స్కోరు వద్ద ఆలౌటైంది.
కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ (103 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఆఖరి రోజు ఆటలో 15 బంతులు ఎదుర్కొన్న జింబాబ్వే ఒక్క పరుగు కూడా జత చేయకుండా రెండు వికెట్లను కోల్పోయింది. ఇరు జట్ల మధ్య భారీ స్కోర్లు నమోదైన తొలి టెస్టు చివరకు ‘డ్రా’ కావడంతో... ఈ విజయంతో అఫ్గానిస్తాన్ 1–0తో టెస్టు సిరీస్ చేజిక్కించుకుంది. కెరీర్ బెస్ట్ (7/66) ప్రదర్శన కనబర్చిన స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 48 పరుగులు చేసిన రషీద్, 11 వికెట్లు పడగొట్టాడు. రహమత్ షాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఈ పర్యటనలో భాగంగా టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకున్న అఫ్గానిస్తాన్ జట్టు వన్డే సిరీస్‌ను 2–0తో చేజక్కించుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్ కూడా నెగ్గి... పర్యటనను విజయవంతంగా ముగించింది.
ఐసీసీ టెస్టు హోదా సాధించిన అనంతరం 11 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అఫ్గానిస్తాన్... అందులో నాలుగు మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఓవరాల్‌గా అఫ్గానిస్తాన్‌కు ఇది మూడో టెస్టు సిరీస్ విజయం. తటస్థ వేదికగా 2018–19లో ఐర్లాండ్‌తో భారత్‌లో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో గెలిచిన అఫ్గానిస్తాన్ తొలి సిరీస్ కైవసం చేసుకోగా... 2019లో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులోనూ నెగ్గి అఫ్గానిస్తాన్ సిరీస్ పట్టేసింది. ఈ రెండు ఆసియాలో జరగ్గా... ఇప్పుడు తొలిసారి జింబాబ్వే గడ్డపై అఫ్గాన్ టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. 2020–21లో అఫ్గానిస్తాన్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 1–1తో ‘డ్రా’ గా ముగిసింది.
చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ
Comments
Please login to add a commentAdd a comment