శశాంక్ అస్త్రసన్యాసం
►8 నెలలకే ఐసీసీ చైర్మన్ పదవికి గుడ్‌బై
►వ్యక్తిగత కారణాలతోనే నిష్క్రమిస్తున్నట్లు లేఖ
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ పదవికి శశాంక్ మనోహర్ రాజీనామా చేశారు. రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సిన ఆయన ఆశ్చర్యకరంగా 8 నెలలకే నిష్క్రమించారు. ఐసీసీ సీఈఓ డేవ్ రిచర్డ్‌సన్‌కు బుధవారం తన రాజీనామా లేఖను ఈ–మెయిల్ చేశారు. వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. ఏప్రిల్‌లో ఐసీసీ కీలక సమావేశాలుండగా ఈ దశలో ఆయన ఆకస్మిక నిర్ణయం ఐసీసీ వర్గాలను కుదిపేసింది. శశాంక్ నిర్ణయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆయన భారత బోర్డుకు ఎనలేని సేవలందించారని కొనియాడింది.
లేఖ సారాంశమిది...
‘తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన నేను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాను. ఏ బోర్డుకూ కొమ్ముకాయకుండా ఐసీసీ సభ్య దేశాలన్నింటిని సమదృష్టితోనే చూశాను. ఐసీసీ డైరెక్టర్ల మద్దతుతో నిక్కచ్చిగా వ్యవహరించాను. అయితే వ్యక్తిగత కారణాల వల్ల ఈ పదవిలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నా. నా పదవి కాలంలో అండగా నిలిచిన డైరెక్టర్లకు, సభ్యదేశాల మేనేజ్‌మెంట్లకు, ఐసీసీ సిబ్బందికి ధన్యవాదాలు. ఐసీసీ తన నిర్ణయాలతో క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తుందనే ఆశిస్తున్నా’నని శశాంక్ తన లేఖలో పేర్కొన్నారు.
ఐసీసీ ఇప్పుడేం చేస్తుంది?
శశాంక్ రాజీనామా చేసినట్లు ఐసీసీ ధ్రువీకరించింది. ప్రస్తుత పరిస్థితుల్ని సమీక్షించిన తర్వాతే తదుపరి నిర్ణయాల్ని వెల్లడిస్తామని... శశాంక్ వారసుడెవరనే అంశాన్ని డైరెక్టర్ల మీటింగ్‌లో తేలుస్తామని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీ నియమావళి ప్రకారం... చైర్మన్ లేని పక్షంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు నేతృత్వంలో తాత్కాలిక చైర్మన్‌ను నియమిస్తుంది. తదుపరి బోర్డు మీటింగ్ జరిగే వరకు ఆయనకు బాధ్యతలు అప్పగిస్తుంది. తదనంతరం ఆ తాత్కాలిక చైర్మన్నే కొనసాగించాలా లేక కొత్త వ్యక్తికి పదవి కట్టబెట్టాలా అనే అంశాన్ని బోర్డు ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో నిర్ణయిస్తారు.
‘బిగ్–3’కి వ్యతిరేకం...
భారత్‌కు చెందిన ఎన్.శ్రీనివాసన్ ఐసీసీ తొలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఐసీసీ ఆదాయంలో సింహభాగం ఏయే దేశాల (భారత్, ఆసీస్, ఇంగ్లండ్) నుంచి అయితే వస్తాయో వాటికే ఎక్కువ వాటా దక్కేలా ‘బిగ్–3’ ఫార్ములాను అమలు చేశారు. అయితే గతేడాది తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఎన్నికైన శశాంక్ మనోహార్ వస్తూనే అందరూ సమానమంటూ ‘బిగ్–3’ని రద్దు చేసే పనిలో పడ్డారు. బీసీసీఐకి ఎంతో ఆర్థిక ప్రయోజనకారిగా ఉన్న ఈ చర్య సహజంగానే భారత బోర్డుకు రుచించలేదు. దీంతో పాటు బీసీసీఐ ఆధిపత్య పోకడలకు, ఫిర్యాదులకు ఆయన ఏనాడు వత్తాసు పలకలేదు. ఇదెంత మాత్రం జీర్ణించుకోని బీసీసీఐ, ఒకానొక దశలో (అనురాగ్ ఠాకూర్ హయాంలో) శశాంక్‌ను చైర్మన్ పదవి నుంచి తప్పించడానికి ప్రయత్నించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇలాంటి చర్యలు, బెదిరింపులకు వెరవని ఆయన స్వతంత్ర పదవికి న్యాయం చేయాలనే లక్ష్యంతో నిక్కచ్చిగా వ్యవహరించారు. అయితే 2018, మే నెల వరకు పదవిలో ఉండాల్సిన శశాంక్ ఇప్పుడు అర్ధంతరంగా తప్పుకొని ఆశ్చర్యపరిచారు.
అదే కారణమా?
‘బిగ్–3’కి చెక్ పెట్టే కొత్త సంస్కరణలకు ఏప్రిల్‌లో జరిగే ఐసీసీ సమావేశంలో 2/3 వంతు సభ్యుల ఆమోదం తప్పనిసరి. కానీ బీసీసీఐ తమకు అనుకూలంగా ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేలను మేనేజ్ చేస్తుంది. దీంతో వచ్చే సమావేశంలో ‘బిగ్–3’ ఫార్ములా బిల్ పాస్ కాలేకపోవచ్చనే మీమాంసలో ఉన్న శశాంక్... తను ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదింప చేసుకోలేకపోయాడనే అపప్రథకు దూరంగా ఉండాలనే రాజీనామా చేసినట్లు విశ్వసనీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఐసీసీ–బీసీసీఐ విభేదాలు కారణం కాదు!
ఐసీసీలో ప్రస్తుత పరిణామాలు, రాబోయే రోజుల్లో చర్చకు రానున్న అంశాలు నా రాజీనామాకు కారణం కాదు. వ్యక్తిగత కారణాలు అంటే పూర్తిగా వ్యక్తిగతం అనే అర్థం. నేను అబద్ధం ఆడను. మంగళవారం బీసీసీఐ సీఓఏ సభ్యులతో జరిగిన భేటీ ఫలప్రదంగా సాగింది. వారితో సమావేశం ప్రారంభం కావడానికి ముందే నేను ఐసీసీ నుంచి తప్పుకుంటున్నానని, ఈ విషయాన్ని నా భార్యతో చర్చించినట్లు కూడా వారికి చెప్పాను. నేను సీరియస్‌గా ఆ మాటలు అంటున్నానని ఊహించని సీఓఏ సభ్యులు నా రాజీనామా పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నిధుల పంపకాల విషయంలో ఐసీసీ అనుసరించబోయే కొత్త తరహా విధానాన్ని నేను వారితో చర్చించాను.
దానికి నేను మద్దతిస్తున్న విషయాన్ని కూడా స్పష్టంగా వివరించాను. దానికంటే మెరుగైన విధానం లేదని నేను ఇప్పటికీ నమ్ముతాను. ఐసీసీలో పలువురు డైరెక్టర్లకు నేను తప్పుకోవడం ఇష్టం లేదు. అందుకే వారికి ముందుగా చెప్పలేదు. ఎనిమిది నెలల కాలంలో నేను చేసిన పని పట్ల సంతృప్తిగా ఉన్నాను. కీలక సమయంలో పదవి నుంచి తప్పుకొని ఐసీసీ బోర్డును నిరాశపరిచానా లేదా అనే విషయంపై మాత్రం నేనేమీ చెప్పలేను. – శశాంక్ మనోహర్