330 కోట్లు ఇదే పాకిస్తాన్ ఆశ
330 కోట్లు ఇదే పాకిస్తాన్ ఆశ
Published Fri, Dec 11 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM
అందుకే భారత్‌తో సిరీస్ కోసం తాపత్రయం
దాదాపు ఆరు నెలల నుంచి భారత్, పాకిస్తాన్ క్రికెట్ వర్గాల్లో అతి పెద్ద చర్చ... ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్. జరుగుతుందని ఒకరోజు... జరగదని ఒకరోజు... ఇలా ఏదో ఒక వార్త. అసలు భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ జరగకపోతే నష్టం ఏమిటి? బీసీసీఐకి ఏం నష్టం లేదు. కానీ పాకిస్తాన్ బోర్డుకు మాత్రం 330 కోట్ల రూపాయల ఆదాయం పోతుంది. ఇదే వాళ్ల తాపత్రయానికి అసలు కారణం. పాక్ ప్రభుత్వం సిరీస్‌కు వెంటనే ఒప్పుకున్నా... భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు. సమయం మించిపోతుండటం వల్ల ఇక ఈ సిరీస్ జరగకపోవచ్చు.
సాక్షి క్రీడావిభాగం
భారత్, పాకిస్తాన్ మధ్య సిరీస్ జరగాలని నిజంగానే అభిమానులు కోరుకుంటున్నారా? ప్రస్తుతం ఈ ప్రశ్న ఏ క్రికెట్ వీరాభిమానిని అడిగినా అంత ఉత్సాహంగా ఏమీ సమాధానం లభించదు. ఎందుకంటే దాయాది దేశాల ఆటగాళ్ల మధ్య మ్యాచ్ అంటే ఒకనాడు ఉన్న భావోద్వేగాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఆటగాళ్ల మధ్య కూడా భాయ్-భాయ్ సంబంధాలే ఉన్నాయి. గత కొంతకాలంగా భారత్ పటిష్టమైన జట్టుగా ఎదగడంతో పాటు పాక్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా ఉండటంతో హోరాహోరీ, పోటీలాంటి మాటలే వినిపించడం లేదు. చాలా వరకు వన్డే, టి20లు ఏకపక్ష మ్యాచ్‌లే. ఇక టెస్టుల్లో మన జట్టుతో పోలిస్తే పాక్ కనీస ప్రదర్శన కూడా ఇచ్చే స్థితిలో లేదు. అభిమాని తనకు అందుబాటులో ఉన్నవాటిలో మంచి వాటిని చూస్తాడు తప్ప లేని దాని గురించి పెద్దగా ఆలోచించడు. భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లతో ఆడుతున్నప్పుడు కూడా అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కాబట్టి వారికి సంబంధించినంత వరకు భారత్-పాక్ సిరీస్ అంటే అన్నింటిలో ఒకటి మాత్రమే.
గతంలోనూ ఇలాగే...
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాల్లో సుదీర్ఘ విరామం రావడం ఇదేమీ మొదటి సారి కాదు. 1989లో భారత జట్టు పాక్‌లో పర్యటించిన దాదాపు దశాబ్దం తర్వాత గానీ ఇరు జట్ల మధ్య సిరీస్ (1999) జరగలేదు. ఈ సమయంలో ఇరు దేశాల్లో క్రికెట్ ఏమీ ఆగిపోలేదు. రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడం ఎవరికీ సమస్య కాలేదు. రెండు జట్లూ తమ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాయి. సరిగ్గా చెప్పాలంటే కేవలం 2004-07 మధ్య కాలంలోనే ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండటంతో వరుసగా సిరీస్‌లు జరిగాయి. ఇరు జట్ల మధ్య పూర్తి స్థాయి ద్వైపాక్షిక సిరీస్ 2007లో భారత్‌లో జరిగింది. వన్డే, టెస్టు సిరీస్ కూడా టీమిండియానే గెలుచుకుంది. అయితే 2008 నవంబర్ 26న ముంబైపై జరిగిన ఉగ్రవాద దాడి మొత్తం సీన్‌ను మార్చేసింది. నాటినుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రధానంగా రాజకీయ కారణాల వల్లే సిరీస్ జరగడం లేదు. 2012 డిసెంబర్‌లో పాక్ మళ్లీ భారత్‌కు వచ్చి ఆడినా అది చాలా చిన్న పర్యటన.
చర్చోపర్చలు
ద్వైపాక్షిక సిరీస్ కోసం ఇరు దేశాల ప్రతినిధుల మధ్య చాలా రోజులుగా సుదీర్ఘ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఫలితం మాత్రం రావడం లేదు. ఇక ఖాయం అనిపించినప్పుడల్లా సరిహద్దు దాడులు సమస్యను క్లిష్టంగా మార్చేశాయి. 2022లోగా ఇరు జట్ల మధ్య కనీసం ఆరు సిరీస్‌లు జరగాలని శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్ హోదాలో ఉండగా ఎంఓయూ కుదిరింది. పాక్ బోర్డు పదే పదే దీనిని గుర్తు చేస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఒక రోజు చర్చలు జరిపినట్లే చేస్తున్నారు... మరో రోజు జ్యోతిష్యం చెప్పలేనంటూ చేతులెత్తేస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ కూడా అయిన బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తాను సిరీస్ కోరుకుంటున్నట్లు ప్రయత్నం చేస్తున్నట్లే కనిపించారు. కానీ ఒక్కసారిగా మాట మార్చి ‘కాల్పులు జరుపుతుంటే క్రికెట్ ఎలా’ అంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తేలేనని స్పష్టం చేశారు. ఇక సుష్మా స్వరాజ్ పాకిస్తాన్‌లో పర్యటించినా... సర్తాజ్‌తో చర్చల్లో క్రికెట్ అనే అంశమే రాలేదు.
జరగకపోతే పాక్‌కు నష్టం
‘ఆటను రాజకీయాలతో కలపరాదు. ఈ సిరీస్ జరుగుతుందనే ఆశిస్తున్నాం’...ఏడాది కాలంగా ఇదో రొడ్డకొట్టుడు డైలాగ్‌గా మారిపోయింది. అయితే ఇదంతా పాక్ మాజీ క్రికెటర్ల నోటినుంచి వచ్చిన మాటలే తప్ప భారత్‌నుంచి గానీ తటస్థ వ్యక్తులు గానీ ఎవరూ ఈ మాట చెప్పలేకపోతున్నారు. ఇదే చివరాఖరి సారి అంటూ ... పీసీబీ అధికారులు తమ హెచ్చరికలను వాయిదాలు వేస్తూ ఒక వైపు, సిరీస్ జరిగితే చాలు దేనికైనా సిద్ధమే అన్నట్లుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీలంకలో, ఇంగ్లండ్‌లో ఎక్కడైనా ఆడతామంటూ చెబుతున్నారు. భారత్‌తో సిరీస్ ఆడితే పాక్ బోర్డు ఖాతాలో దాదాపు రూ. 330 కోట్లు చేరతాయి. ఇంత పెద్ద మొత్తాన్ని కోల్పోవడానికి ఇష్టం లేని పీసీబీ చివరి దాకా ఆశగా ఎదురు చూస్తోంది. ‘ఇందులో డబ్బు కోణం తప్ప మరేమీ లేదు. తమ బోర్డుకు ఆదాయం కోసమే ఈ ప్రయత్నమంతా. సిరీస్ జరగకపోతే ఎవరికీ నష్టం లేదు. ప్రపంచ క్రికెట్ ఏమీ ఆగిపోదు’ అని మాజీ క్రికెటర్ మొహమ్మద్ యూసుఫ్ కుండబద్దలు కొట్టాడు.
ఇప్పుడేం జరగవచ్చు?
ఐసీసీ భవిష్యత్తు పర్యటన కార్యక్రమా (ఎఫ్‌టీసీ)న్ని బీసీసీఐ గౌరవించడం లేదంటూ పాకిస్తాన్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇక సిరీస్ కోసం అనుకున్న డిసెంబర్ నెలలో 20 రోజులు కూడా మిగిలి లేవు. ఇలా అయితే భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో కూడా ఆడబోమని, చట్టపరంగా కూడా ముందుకు వెళతామని చెబుతోంది. ఇది సాధ్యమా అనే సంగతి పక్కన పెడితే... ఐసీసీలో తీవ్ర రచ్చకు మాత్రం కారణమవుతుంది. ఐసీసీ మళ్లీ పాక్‌ను బతిమాలడమో, మధ్యే మార్గ పరిష్కారాలు చూపించాల్సి రావడమో జరగొచ్చు. చైర్మన్ హోదాలో పరిష్కార బాధ్యత శశాంక్ మనోహర్‌పై పడితే పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లే!
Advertisement