మనోహర్‌కే ‘స్పాట్’
ఐసీసీ చైర్మన్ పదవినుంచి తప్పించేందుకు బీసీసీఐ విఫల ప్రయత్నం కలిసి రాని ఇతర బోర్డులు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిననాటినుంచి శశాంక్ మనోహర్‌కు, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మధ్య ఏదో ఒక వివాదం తరచుగా వస్తూనే ఉంది. బోర్డుకు రెండు సార్లు అధ్యక్షుడిగా పని చేసినా, తమకు ఏ దశలోనూ అండగా నిలవడం లేదని బీసీసీఐ గుర్రుగా ఉండగా... తాను తటస్థ అధ్యక్షుడినని, అన్ని బోర్డులూ సమానమేనని మనోహర్ చెప్పుకున్నారు.
తాజాగా లోధా సిఫారసుల అమలు విషయంలో తమకు అనుకూలంగా లేఖ రాయమంటూ బీసీసీఐ కోరడం, ఐసీసీ దానిని పట్టించుకోకపోవడం జరిగారుు. ఈ నేపథ్యంలో పాత సాహచర్యాన్ని పక్కన పడేసి ఏకంగా మనోహర్‌ను ఐసీసీ చైర్మన్ పదవినుంచే తప్పించేందుకు భారత బోర్డు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇటీవల దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన ఐసీసీ సమావేశం సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ వ్యూహం పన్నినా చివరకు అది విఫలమైంది.
శ్రీనివాసన్ సూచనలతో...
ఐసీసీ సమావేశంలో పాల్గొనేందుకు కేప్‌టౌన్ వెళ్లిన ఠాకూర్ అక్కడినుంచి బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కేతో పాటు మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌తో కూడా మాట్లాడారు. శశాంక్ మనోహర్‌ను తప్పించే విషయంలో వారి మధ్య చర్చ జరిగినట్లు బోర్డు సీనియర్ అధికారి ఒకరు నిర్ధారించారు. ఐసీసీలో సాధ్యమైనన్ని ఎక్కువ పదవులు పొందడం ద్వారా క్రికెట్‌ను నడిపించాలనేది బీసీసీఐ ఆలోచన. అరుుతే శశాంక్ ఉండగా ఇది సాధ్యం కాకపోవచ్చు కాబట్టి ఆయననే అక్కడినుంచి తొలగించాలని ప్రయత్నం జరిగినట్లు ఆయన వెల్లడించారు. శశాంక్‌కు ప్రత్యామ్నాయంగా తనకు మంచి మిత్రుడైన ఇంగ్లండ్ బోర్డు చైర్మన్ గైల్స్ క్లార్క్ పేరును శ్రీనివాసన్ సూచించారు కూడా.
అరుుతే ఐసీసీలో ఓటింగ్‌కు వెళ్లక ముందే బీసీసీఐకి భంగపాటు ఎదురైంది. నిబంధనల ప్రకారం ఠాకూర్ ప్రతిపాదనకు కనీసం మరో టెస్టు దేశం మద్దతు పలకాల్సి ఉంది. అరుుతే తాము శశాంక్ పనితీరుతో సంతృప్తిగా ఉన్నామని చెప్పి వారంతా ఆయనకు మద్దతు పలికారు. తన ప్రతిపాదనకు పూర్తిగా వ్యతిరేకత ఎదురవడంతో ఠాకూర్ నివ్వెరపోయారు. ఒక వేళ మరో దేశం మద్దతిచ్చి ఓటింగ్‌కు వెళ్లినా పది టెస్టుల్లో కనీసం ఎనిమిది దేశాలు అనుకూలంగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా సాధ్యం కాకపోయేదేమో! ఇప్పటికే సొంత ఇంట్లో అనేక సమస్యలతో సతమతమవుతున్న బీసీసీఐ, ఐసీసీ వ్యవహారాల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేసి విఫలం కావడం బోర్డుకు మరో పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.