చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ఆడే మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రకటించింది. అదే విధంగా.. ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా పాకిస్తాన్ అక్కడ పర్యటించబోదని తెలిపింది. కాగా వచ్చే ఏడాది జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును పాక్‌కు పంపే ప్రసక్తి లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐసీసీకి తేల్చి చెప్పింది. తాము టోర్నీలో పాల్గొనాలంటే తటస్థ వేదికల(హైబ్రిడ్ విధానం)పై టీమిండియా మ్యాచ్‌లను నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తొలుత ఇందుకు అంగీకరించలేదు.
షరతులు విధించిన పీసీబీ
అనేక చర్చలు, ఐసీసీ గట్టిగా హెచ్చరించిన అనంతరం పీసీబీ ఎట్టకేలకు పంతం వీడింది. అయితే, ఇకపై భారత్‌లో జరిగే ఐసీసీ ఈవెంట్లకు కూడా హాజరుకాబోమని.. తమకు కూడా తటస్థ వేదికలు ఏర్పాటు చేయాలని షరతు విధించినట్లు వార్తలు వచ్చాయి. ఐసీసీ తాజా ప్రకటనను బట్టి ఆ ఊహాగానాలు నిజమని తేలాయి.
ఆ టోర్నీలన్నింటికి ఇదే నిబంధన
ఇకపై భారత్- పాకిస్తాన్‌లలో ఐసీసీ టోర్నమెంట్లు జరిగినపుడు హైబ్రిడ్ విధానాన్ని పాటిస్తామని గురువారం తెలిపింది. అంటే.. ఇరుజట్లు తమ దాయాది దేశాల్లో ఇకపై ఆడబోవని స్పష్టం చేసింది. చాంపియన్స్ ట్రోఫీ-2025(పాకిస్తాన్)తో పాటు మహిళల క్రికెట్ వరల్డ్‌కప్ 2025(భారత్), పురుషుల టీ20 ప్రపంచకప్ 2026(భారత్- శ్రీలంక) టోర్నీలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.
ఆస్ట్రేలియాలో మహిళల టోర్నమెంట్లు
అంతేకాదు.. మహిళల టీ20 ప్రపంచకప్ 2028 ఆతిథ్య హక్కులను కూడా పాకిస్తాన్ దక్కించుకుందని ఐసీసీ ఈ సందర్భంగా తెలియజేసింది. దీనిని కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే నిర్వహిస్తామని పేర్కొంది. ఇక 2029- 2031 మధ్య మహిళల సీనియర్ జట్లకు సంబంధించిన అన్ని ఐసీసీ టోర్నీలకు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తుందని ఐసీసీ తెలిపింది.
కాగా హైబ్రిడ్ విధానంలో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీ-2025కి టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి. మరోవైపు.. పాకిస్తాన్ ఆతిథ్య జట్టు హోదాలో నేరుగా ఈ టోర్నీలో అడుగుపెట్టింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి ఈ అవకాశం దక్కించుకుంది. ఈసారి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఇక ఈ టోర్నీకి సంబంధించి త్వరలోనే షెడ్యూల్ విడుదల కానుంది.
చదవండి: నా కుమారుడికి అవమానం జరిగింది.. అశ్విన్ తండ్రి సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment