చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా? ఈ ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) సర్వసభ్య సమావేశంలో ఈ విషయంపై స్పష్టత వస్తుందని భావించినా.. అలా జరుగలేదు. రోహిత్ సేనను పాకిస్తాన్‌కు పంపేదేలేదని బీసీసీఐ పట్టుదలగా ఉన్న విషయం తెలిసిందే.
అయితే, నిబంధనల ప్రకారం మ్యాచ్‌లన్నీ తమ దేశంలోనే నిర్వహించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఐసీసీకి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. భారత జట్టును పాకిస్తాన్‌కు తీసుకువచ్చే బాధ్యత ఐసీసీకే అప్పగించినట్లు సమాచారం.
టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లోనే!
ఈ విషయం గురించి పీసీబీ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశంగా.. తమ కర్తవ్యాలకు అనుగుణంగా పీసీబీ డ్రాఫ్ట్ షెడ్యూల్‌తో పాటు టోర్నీ ఫార్మాట్‌కు సంబంధించిన వివరాలను ఐసీసీకి సమర్పించింది.
ఈ అంశాల గురించి మిగతా దేశాల బోర్డులతో చర్చించి.. షెడ్యూల్‌ను ఖరారు చేయాల్సిన బాధ్యత ఐసీసీ మీద ఉంది. డ్రాఫ్ట్ షెడ్యూల్‌లో భాగంగా టీమిండియా మ్యాచ్‌లు అన్నీ(ఒకవేళ అర్హత సాధిస్తే సెమీ ఫైనల్, ఫైనల్‌లతో సహా) లాహోర్‌లో నిర్వహిస్తామని తెలిపింది.
అంతేకాదు.. అక్కడి టాక్స్ విధానం, వేదికల ఎంపిక, టీమిండియా మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతుల గురించి కూడా రాతపూర్వకంగా వివరాలు అందించింది’’ అని తెలిపాయి.
ఐసీసీ నో చెప్పినట్లే!
చాంపియన్స్ ట్రోఫీ-2025లో తమ మ్యాచ్‌లకు వేదిక మార్చాలన్న బీసీసీఐ డిమాండ్‌కు ఐసీసీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సర్వసభ్య సమావేశంలో భాగంగా టోర్నమెంట్ నిర్వహణ కోసం అయ్యే ఖర్చుకు గతంలో కంటే అదనపు మొత్తాన్ని బడ్జెట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఇండియా మ్యాచ్‌లను హైబ్రిడ్ విధానంలో పాక్ వెలుపల నిర్వహిస్తే దాని పర్యవసనాలు, అందుకు అయ్యే ఖర్చు కోసం ఈ మొత్తాన్ని పక్కనపెట్టినట్లు సమాచారం. కాగా డ్రాఫ్ట్ షెడ్యూల్ ప్రకారం మార్చి 1న టీమిండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment