చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా విషయంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ మెగా టోర్నీ ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ జట్టును దాయాది దేశానికి పంపేందుకు సిద్ధంగా లేమని భారత క్రికెట్ నియంత్రణ మండలి సంకేతాలు ఇచ్చింది.
హైబ్రిడ్ విధానంలో ఈవెంట్‌ను నిర్వహించాలని..
ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తే లేదని.. హైబ్రిడ్ విధానంలో ఈవెంట్‌ను నిర్వహించాలని ఐసీసీని కోరినట్లు సమాచారం. అయితే, పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. తమ దేశంలో జరిగే ఈ మెగా టోర్నీలో టీమిండియా తప్పక పాల్గొనాలని.. భారత జట్టు మ్యాచ్‌ల కోసం లాహోర్ స్టేడియాన్ని సిద్ధం చేశామని చెబుతోంది.
సరేనన్న ఐసీసీ?
ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ సైతం అప్పట్లో ఈ విషయం గురించి మాట్లాడుతూ చాంపియన్స్ ట్రోఫీ వేదిక మార్చే అవకాశం లేదని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ మాత్రం భారత ప్రభుత్వం అనుమతిస్తే తప్ప రోహిత్ సేనను పాక్‌కు పంపమని పేర్కొంది. అందుకు స్పందనగా ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లకు తటస్థ వేదికను ఏర్పాటు చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.
మా వైఖరి వేరుగా ఉంటుంది
ఈ పరిణామాల నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘మేము ఇటీవలి కాలంలో ప్రతి విషయంలో సానుకూలంగా స్పందించాం. అయితే, ప్రతిసారి మేము అలాగే చేస్తామని భావించవద్దు’’ అని పేర్కొన్నాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
సరైన కారణం చూపించాలి
‘‘ఒకవేళ ఏదైనా జట్టు ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలంటే సరైన కారణం చూపించాలి. టీమిండియా ఇక్కడికి రాకపోవడానికి భద్రతను కారణంగా చూపడం అనేది అసలు విషయమే కాదు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా పాకిస్తాన్‌కు వస్తున్నాయి. ఆ జట్లు పాక్‌లో టోర్నీ ఆడాలనే తలంపుతో ఉన్నాయి.
అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరు
నిజానికి ఐసీసీ మనుగడకు కారణమే పాకిస్తాన్, ఇండియా. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా భారత్‌లాగే మేము ఆడమని చెప్తే పరిస్థితి వేరుగా ఉంటుంది. అదే జరిగితే.. అసలు ఈ టోర్నీని ఎవరూ చూడరు. ఈసారి గనుక టీమిండియా ఇక్కడికి రాకపోతే.. పాకిస్తాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంటుంది. ఈ టోర్నీని బహిష్కరిస్తుంది’’ అని రషీద్ లతీఫ్ ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశాడు.
భద్రత కంటే ఏదీ ఎక్కువ కాదు
ఇక అతడి వ్యాఖ్యలకు టీమిండియా అభిమానులు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు. భారత ఆటగాళ్ల భద్రత విషయంలో బీసీసీఐ రాజీపడబోదని పేర్కొంటున్నారు. పాక్ ఆటగాళ్లు భారత్‌కు వచ్చి సురక్షితంగా వెళ్లగలిగారని.. కానీ టీమిండియా ఆటగాళ్లను పాక్‌కు పంపే పరిస్థితులు మీ దేశంలో లేవంటూ లతీఫ్‌ను ట్రోల్ చేస్తున్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఆడేందుకు పాక్ జట్టు గతేడాది భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
చదవండి: BGT: వరుసగా 4 సెంచరీలు.. ఆస్ట్రేలియాలో ఫెయిల్.. అయినా టీమిండియా ఓపెనర్‌గా అతడే!
Comments
Please login to add a commentAdd a comment