చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ వేదికను ఖరారు చేసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ తెలిపాడు. లాహోర్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీ తుది మ్యాచ్ నిర్వహించనున్నట్లు వెల్లడించాడు. గఢాఫీ స్టేడియంలో ఈ మ్యాచ్ నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సోమవారం ప్రకటించాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్ హక్కులను పాకిస్తాన్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మెగా టోర్నీ కోసం టీమిండియా మాత్రం అక్కడికి వెళ్లే సూచనలు కనిపించడం లేదు. ఆసియా వన్డే కప్-2023 మాదిరిగానే హైబ్రిడ్ విధానంలో.. టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం.
ఫైనల్ వేదికపై పీసీబీ చీఫ్ ప్రకటన
ఇందుకు ఐసీసీ కూడా సానుకూలంగానే స్పందించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, పాకిస్తాన్ బోర్డు మాత్రం టీమిండియాను తమ దేశానికి రప్పించే బాధ్యత ఐసీసీదేనని.. హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్పష్టం చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాదు.. టీమిండియా మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో నిర్వహించేందుకు పాక్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసినట్లు పాక్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఆ మూడు మైదానాల్లో
అయితే, ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాత్రం ఫైనల్ వేదిక గురించి స్పష్టతనివ్వడం విశేషం. ఇక చాంపియన్స్ ట్రోఫీ-2025లో హాట్ ఫేవరెట్‌గా టీమిండియా బరిలోకి దిగనుంది. టైటిల్ రేసులో ముందున్న రోహిత్ సేనను దృష్టిలో పెట్టుకుని.. పాక్ బోర్డు ఈ మేరకు వేదికను ఫిక్స్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా ఈ మెగా టోర్నమెంట్ మ్యాచ్‌లకు లాహోర్, కరాచీ, రావల్పిండి ఆతిథ్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టీమిండియాను పాకిస్తాన్‌కు పంపించే విషయంపై ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం పేర్కొన్నాడు.
చదవండి: PAK Vs BAN Test Series: తొలి టెస్టుకు పాక్ తుదిజట్టు ప్రకటన.. యువ పేసర్ రీ ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment