టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్‌ బోర్డు వార్నింగ్‌! | ECB Massive Warning To ICC And PCB: If You Play The Champions Trophy Without India The Broadcast Rights Aren't There' | Sakshi
Sakshi News home page

టీమిండియా రాకపోతే..: పీసీబీ, ఐసీసీకి ఇంగ్లండ్‌ బోర్డు వార్నింగ్‌!

Published Thu, Oct 17 2024 3:33 PM | Last Updated on Thu, Oct 17 2024 4:14 PM

ECB Massive Warning To ICC And PCB: If You Play Champions Trophy Without India

చాంపియన్స్‌ ట్రోఫీ-2025లో టీమిండియా పాల్గొనకపోతే భారీ నష్టం తప్పదని ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ రిచర్డ్‌ థాంప్సన్‌ అన్నాడు. పాకిస్తాన్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో  రోహిత్‌ సేన పాల్గొంటేనే ఈవెంట్‌ విజయవంతమవుతుందని అభిప్రాయపడ్డాడు. లేనిపక్షంలో ప్రసార హక్కులు కొనేందుకు ఎవరూ ముందుకు రారని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు, అంతర్జాతీయ క్రికెట్‌ మండలిని పరోక్షంగా హెచ్చరించాడు.

వన్డే ఫార్మాట్‌లో జరిగే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌ నిర్వహణ హక్కులను పాకిస్తాన్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో బరిలోకి దిగనుండగా.. టీమిండియా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ అర్హత సాధించాయి.

హైబ్రిడ్‌ విధానంలో?
అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ విముఖంగా ఉంది. ఇరు దేశాల మథ్య పరిస్థితుల నేపథ్యంలో 2008 తర్వాత ఇంత వరకు భారత క్రికెట్‌ జట్టు పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అందుకే.. ఆసియా వన్డే కప్‌-2023 టోర్నీ పాకిస్తాన్‌లో జరిగినప్పటికీ బీసీసీఐ తటస్థ వేదికలపై తమ జట్టు మ్యాచ్‌లు జరగాలని కోరడంతో పాటు మాట నెగ్గించుకుంది.

చాంపియన్స్‌ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్‌ విధానం పాటించాలని ఐసీసీని ఒప్పించే పనిలో ఉన్నట్లు సమాచారం. అయితే, పాక్‌ బోర్డు మాత్రం టీమిండియా తమ దేశానికి రావాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ బోర్డు చీఫ్‌ రిచర్డ్‌ థాంప్సన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా రాకపోతే జరిగేది ఇదే!
‘‘బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా.. ఇప్పుడు ఐసీసీ చైర్మన్‌ అయ్యారు. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అన్న అంశాన్ని తేల్చడంలో ఆయనదే కీలక పాత్ర. ఇరువర్గాలు చర్చించి.. టోర్నీ సజావుగా సాగే మార్గం కనుగొంటారనే ఆశిస్తున్నాం.

టీమిండియా లేకుండా ఈ టోర్నీ జరుగుతుందని అనుకోవడం లేదు. ఎందుకంటే.. భారత జట్టు లేకుండా ఈ ఈవెంట్‌ జరిగితే ప్రసార హక్కులు ఎవరూ కొనరు. ఏదేమైనా పాకిస్తాన్‌ మాత్రం టీమిండియా తమ దేశానికి రావాలని కోరుకుంటోంది’’ అని ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో పేర్కొన్నాడు.

చదవండి: IPL 2025: రిష‌బ్ పంత్‌కు బిగ్ షాక్‌.. ఢిల్లీ కెప్టెన్‌గా స్టార్ ప్లేయ‌ర్‌?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement