
'నేనేమీ జ్యోతిష్కుడిని కాదు..'
న్యూఢిల్లీ: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య క్రికెట్ సిరీస్ కచ్చితంగా జరుగుతుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు శశాంక్ చాలా ఆశ్చర్యకరమైన సమాధానమిచ్చారు. 'సిరీస్ జరుగుతుందా.. లేదా చెప్పడానికి నేనేమీ జ్యోతిష్కుడిని కాదు' అంటూ జవాబిచ్చారు. భారత్-పాక్ క్రికెట్ సిరీస్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి క్లియరెన్స్ రాలేదని బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తెలిపారు. సిరీస్ ఆడటానికి వేదిక, మ్యాచ్ ప్రసార హక్కులు, టిక్కెట్ల విక్రయం లాంటి అంశాలపై పాక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. పాక్ పర్యటనకు వెళ్లిన విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్ అక్కడ పాక్ ప్రతినిధి సర్తాజ్ అజీజ్తో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై వస్తున్న విమర్శలపై ఆయన వివరణ ఇచ్చారు. సౌరవ్ విరుద్ద ప్రయోజనాలు పొందడం లేదని, అలా తాను భావించడం లేదని స్పష్టం చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ అట్లెటికో డీ కోల్కతా జట్టుకు గంగూలీ సహ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకైతే రెండు ప్రయోజనాలు పొందడం అంశంపై చాలా మందికి అవగాహన లేదని, ఒకవేళ ఐపీఎల్ ఫ్రాంచైజీలలో ఏదైనా జట్టుతో గంగూలీకి సంబంధాలుంటే ఈ అంశంపై ఆలోచించాల్సి ఉంటుందని శశాంక్ మనోహర్ వివరించారు.