లాంఛనం ముగిసింది
► బీసీసీఐ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నిక
► సెప్టెంబర్ 2017 వరకు పదవిలో కార్యదర్శిగా అజయ్ షిర్కే
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 34వ అధ్యక్షుడిగా అనురాగ్ ఠాకూర్ ఎన్నికయ్యారు. ఆదివారం ఇక్కడ జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జీఎం)లో ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడి పేరును ప్రతిపాదించాల్సిన ఈస్ట్‌జోన్‌కు చెందిన ఆరు సంఘాలు కూడా ఠాకూర్‌కు మద్దతు పలకడం, మరో అభ్యర్థి బరిలో లేకపోవడంతో ఆయన ఎంపిక లాంఛనమే అయింది. ఎస్‌జీఎంకు అధ్యక్షత వహించిన సీనియర్ ఉపాధ్యక్షుడు సీకే ఖన్నా అధికారికంగా అనురాగ్ పేరును ప్రకటించారు. సెప్టెంబర్ 2017 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ఇప్పటి వరకు బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న 41 ఏళ్ల ఠాకూర్ బోర్డు అధ్యక్ష పదవిని అధిరోహించిన రెండో పిన్న వయస్కుడు కావడం విశేషం. గతంలో 1963-66 మధ్య ఫతేసింగ్ రావ్ గైక్వాడ్ 33 ఏళ్ల వయసులో అధ్యక్షుడిగా పని చేశారు. తాజా పరిణామాల్లో భాగంగా మహారాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజయ్ షిర్కే కార్యదర్శిగా ఎన్నికయ్యారు. గతంలో బోర్డు కోశాధికారిగా పని చేసిన షిర్కే... 2013 స్పాట్ ఫిక్సింగ్ వివాదం సమయంలో బీసీసీఐ స్పందన బాగా లేదంటూ తన పదవికి రాజీనామా చేశారు. జగ్మోహన్ దాల్మియా మృతితో శశాంక్ మనోహర్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకోగా, ఆయన తప్పుకోవడంతో అనురాగ్‌ను ఈ పదవి వరించింది. దాంతో ఒక పదవీ కాల వ్యవధిలో ముగ్గురు బోర్డు అధ్యక్షులుగా పని చేయాల్సి వచ్చింది.
► అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్‌ను అభినందిస్తున్న అజయ్ షిర్కే (ఎడమ)