ఏకగ్రీవంగా ఎన్నిక
► ఐసీసీ స్వతంత్ర చైర్మన్‌గా శశాంక్ మనోహర్
► పదవీ కాలం రెండేళ్లు
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్‌గా బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ తెలిపింది. రెండేళ్ల పాటు మనోహర్ ఈ పదవిలో కొనసాగుతారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించే వ్యక్తికి ఏ బోర్డుతోనూ సంబంధాలు ఉండకూడదని ఏప్రిల్‌లో ఐసీసీ రాజ్యాంగానికి సవరణలు ప్రతిపాదించారు. ఇటీవల వీటికి ఐసీసీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయడంతో బోర్డు డెరైక్టర్లందరూ మనోహర్ ఎన్నికను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఎన్నిక ఇలా జరిగింది...
వాస్తవానికి ఐసీసీ డెరైక్టర్లు తమ తరఫున తలా ఒక వ్యక్తిని చైర్మన్ పదవికి నామినేట్ చేయొచ్చు. అయితే నామినేట్ అయిన వ్యక్తికి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది డెరైక్టర్ల మద్దతు ఉండాలి. ఈనెల 23 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగాలి. కానీ చైర్మన్ పదవికి మనోహర్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ ప్రక్రియను పర్యవేక్షించిన స్వతంత్ర అడిట్ కమిటీ చైర్మన్ అద్నాన్ జైదీ... మనోహర్‌ను చైర్మన్‌గా ప్రకటిస్తూ ఎన్నికలు ముగిశాయని తెలిపారు. భారత్‌లో ప్రముఖ న్యాయవాదిగా పేరుగాంచిన శశాంక్ 2008 నుంచి 2011 వరకు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత బోర్డుకు దూరమైనా... జగ్‌మోహన్ దాల్మియా ఆకస్మిక మరణంతో గతేడాది అక్టోబర్‌లో మరోసారి బీసీసీఐ సారథిగా పగ్గాలు చేపట్టారు. కానీ మంగళవారం బోర్డు పదవికి రాజీనామా సమర్పించారు.
తేడా ఏంటంటే..?
వాస్తవానికి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా శశాంక్ ఐసీసీ చైర్మన్‌గా పని చేశారు. కానీ అప్పటి చైర్మన్ పదవికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. 2014లో ఐసీసీలో చేపట్టిన సవరణల ప్రకారం అధ్యక్షుడి అధికారాలకు కత్తెర వేస్తూ కొత్తగా చైర్మన్ పదవిని సృష్టించి ఎక్కువ అధికారాలు కట్టబెట్టారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (బిగ్-3) బోర్డుల్లో ఒకర్ని చైర్మన్‌గా వ్యవహరించేలా ప్రతిపాదించారు. అందులో భాగంగా బీసీసీఐ మాజీ బాస్ ఎన్.శ్రీనివాసన్ ఆ పదవి చేపట్టినా.. అనూహ్య కారణాల వల్ల ఎంతోకాలం ఉండలేకపోయారు. శ్రీని తప్పుకున్న తర్వాత మనోహర్ ఆ పదవిలోకి వచ్చి విప్లవాత్మక మార్పులకు తెరలేపారు.
అందులో భాగంగా గత ఏప్రిల్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో మరోసారి రాజ్యాంగానికి సవరణలు చేసేలా పలు ప్రతిపాదనలు చేశారు. వాటిలో భాగంగా పరిపాలనలో బిగ్-3 అధికారాలను పూర్తిగా తగ్గించారు. దీని కోసం బోర్డులతో సంబంధం లేని వ్యక్తిని ఐసీసీ చైర్మన్‌గా చేయాలని ప్రతిపాదించారు. అలాగే గతంలో ఉన్న అధ్యక్ష పదవికి మంగళం పాడాలని నిశ్చయించారు. ఇది ఈ ఏడాది ఎడిన్‌బర్గ్‌లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశం నుంచి అమల్లోకి వస్తుంది. అయితే అప్పటి వరకు ఈ పదవి ఉన్నా పేరుకు మాత్రమే! ఎలాంటి అధికారాలు ఉండవు.
ఐసీసీ చైర్మన్‌గా
ఎన్నికవడం గౌరవంగా భావిస్తున్నా. డెరైక్టర్లు నా సామర్థ్యంపై నమ్మకం పెట్టినందుకు కృతజ్ఞతలు. అలాగే ఇటీవల బీసీసీఐలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా శక్తి మేరకు పని చేసేందుకు కృషి చేస్తా. - శశాంక్ మనోహర్ (ఐసీసీ చైర్మన్)
శశాంక్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం భారత్‌కు గర్వకారణం. పరిపాలనలో ఆయనకు ఉన్న అనుభవం ప్రపంచవ్యాప్తంగా ఐసీసీని బలోపేతం చేయడంలో బాగా తోడ్పడుతుంది. క్రికెట్ అభివృద్ధి కోసం ఐసీసీతో మరింత సాన్నిహిత్యంతో పని చేస్తాం. - అనురాగ్ ఠాకూర్(బీసీసీఐ కార్యదర్శి)