
శశాంక్ మనోహర్ యూ టర్న్
దుబాయ్: గతవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్ తాజాగా యూ టర్న్ తీసుకున్నాడు. మరికొంత కాలం ఆ పదవిలో కొనసాగేందుకు అంగీకారం తెలిపాడు. ఇక ఐసీసీలో కొనసాగే ప్రసక్తే లేదంటూ రాజీనామా లేఖను సీఈవో రిచర్డ్సన్ కు ఉన్నపళంగా సమర్పించిన మనోహర్..వచ్చే నెల్లో పలు కీలకమైన సమావేశలున్న తరుణంలో చైర్మన్ హోదాలో తిరిగి కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. ప్రధానంగా మనోహర్ ఆకస్మిక రాజీనామాపై ఐసీసీలోని సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనిలో భాగంగానే ఏప్రిల్ ల్లో జరిగే సమావేశాలు వరకూ మనోహర్ చైర్మన్ గా కొనసాగాలని పట్టుబట్టారు. దాంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న మనోహర్ మరికొన్ని రోజులు ఆ పదవిలో కొనసాగేందుకు అంగీకారం తెలిపాడు.
ఐసీసీ నియమావళి ప్రకారం... చైర్మన్ లేని పక్షంలో ఎగ్జిక్యూటివ్ బోర్డు నేతృత్వంలో తాత్కాలిక చైర్మన్‌ను నియమిస్తుంది. తదుపరి బోర్డు మీటింగ్ జరిగే వరకు ఆయనకు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తుంది. ఈ క్రమంలోనే తనను చైర్మన్ గా కొనసాగాలంటూ సభ్యులు విన్నపాన్ని గౌరవంగా భావించిన మనోహర్ మరికొంత కాలం తాత్కాలిక హోదాలో కొనసాగేందుకు సమ్మతి తెలిపాడు. 'ఐసీసీ డైరెక్టర్ల సెంటిమెంట్ను నేను గౌరవించే ఆ పదవిలో కొనసాగేందుకు ఒప్పుకున్నా. నాపై నమ్మకంతో వారు మరికొంతకాలం కొనసాగమని అడిగారు. దాంతో మరికొంత కాలం ఆ పదవిలో ఉండేందుకు అంగీకరించా. తదుపరి బోర్డు మీటింగ్ వరకూ చైర్మన్ పదవిలో ఉంటా. నేను వ్యక్తిగత కారణాలతోనే ఆ పదవికి గుడ్ బై చెప్పా. నా ముందస్తు నిర్ణయంలో అయితే ఎటువంటి మార్పులేదు' అని ఓ ప్రకటనలో మనోహర్ తెలిపారు.