
అదనంగా 10 కోట్ల డాలర్లు ఇస్తాం
►బీసీసీఐకి ఐసీసీ చైర్మన్ మనోహర్ ప్రతిపాదన
►కొత్త ఆఫర్‌ను తిరస్కరించిన బోర్డు
►చాంపియన్స్ ట్రోఫీకి ఇంకా జట్టును ప్రకటించని బీసీసీఐ
న్యూఢిల్లీ: కొత్త ఆదాయ పంపిణీ విధానంపై ఇప్పటికే ఆగ్రహంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి అదనంగా 10 కోట్ల డాలర్లను ఇచ్చేం దుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్ శశాంక్ మనోహర్ ప్రతిపాదించారు. అయితే ఈ ఆఫర్‌ను బీసీసీఐ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ‘నూతన ఆదాయ పంపిణీ విధానంలో బీసీసీఐకి మరో 10 కోట్ల డాలర్లను అదనంగా ఇచ్చేందుకు చైర్మన్ మనోహర్ మాకు ఆఫర్ చేశారు. నిజానికి ఆయన ఈ విషయంలో మాకు తుది గడువు కూడా ఇచ్చారు.
కానీ మేమసలు ఆ ఆఫర్‌ను పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇది మనోహర్ నుంచి వచ్చింది. ఆయన చైర్మన్ కావచ్చు కానీ ఐసీసీ అనేది సభ్య దేశాలకు చెందినది. ఎవరికెంత ఆదాయం రావాలనే విషయాన్ని తేల్చేది చైర్మన్ కాదు. అది సభ్య దేశాలకు సంబంధించిన విషయం. ఇప్పటికే అన్ని దేశాలతో కలిసి మేం చర్చిస్తున్నాం. బీసీసీఐకి ఎంత వాటా ఇవ్వాలని మనోహర్ తేల్చలేరు’ అని బోర్డుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. అయితే తమ ఆదాయం కోల్పోకుండా ఇతర సభ్య దేశాలకు ఎక్కువ మొత్తం దక్కేలా ఓ విధానం రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఆదాయ పంపిణీ విధానంలో ‘బిగ్ త్రీ’ పేరిట భారత బోర్డుకు ఐసీసీ నుంచి 57 కోట్ల 90 లక్షల డాలర్లు అందుతోంది. అయితే ఈ సిస్టమ్‌ను ఆది నుంచీ వ్యతిరేకిస్తున్న శశాంక్ మనోహర్ కొత్త విధానాన్ని ప్రతిపాదనలోకి తేవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే బీసీసీఐ వాటా ఒక్కసారిగా 29 కోట్ల డాలర్లకు పడిపోతుంది. అందుకే బోర్డు కొత్త పాలక కమిటీ (సీఓఏ) కూడా దీనికి ఆమోదయోగ్యంగా లేదు.
చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటుందా?
ఇంగ్లండ్‌లో జరిగే ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు నిన్నటి (మంగళవారం)తో గడువు ముగిసింది. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం అన్ని జట్లూ తమ ఆటగాళ్ల జాబితాను ఇప్పటికే వెల్లడించాయి. అయితే ఇప్పటిదాకా బీసీసీఐ మాత్రం ఆ పని చేయలేదు. అయితే కొన్ని పరిస్థితులు, కారణాలకు లోబడి తుది గడువు అనంతరం కూడా జట్లను ప్రకటించవచ్చని ఐసీసీ నియమావళి చెబుతోంది. కానీ కనీసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించేందుకు బోర్డు పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పైగా గడువు ముగిశాక జట్టును ప్రకటిస్తే ఐసీసీ తమను నిషేధిస్తుందా? అని కూడా ప్రశ్నిస్తోంది. మరోవైపు తమకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఈ టోర్నీకి భారత జట్టు దూరమయ్యే అవకాశాలు కూడా లేకపోలేదని సమాచారం.