శ్రీనివాసన్ నిరంకుశుడు
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు ఇప్పుడు ఒక్కోటి బయటికి వస్తున్నాయి. ఇంత కాలం శ్రీనివాసన్ వ్యవహారాలపై మౌనంగా ఉన్న బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తాజాగా తీవ్ర వ్యాఖ్యలతో ముందుకు వచ్చారు. శ్రీనివాసన్‌ను ‘నిరంకుశుడు’గా మనోహర్ అభివర్ణించారు. ‘ఆయనకు అధ్యక్షుడిగా కొనసాగే హక్కు లేదు. ఏ మాత్రమైనా మనస్సాక్షి, ఆత్మ గౌరవం ఉంటే తన అల్లుడు అరెస్ట్ కాగానే రాజీనామా చేయాల్సింది.
కానీ ఆయన అలాంటిదేమీ చేయలేదు. ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయే స్థితికి బోర్డు ప్రతిష్ట పడిపోయింది’ అని మనోహర్ విమర్శించారు. 2008నుంచి 2011 వరకు మనోహర్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే శ్రీనివాసన్ కార్యదర్శిగా పని చేశారు. జగ్మోహన్ దాల్మియా సహా అనేక మంది తనను బోర్డు ఎన్నికల్లో పోటీ చేయమని కోరారని, అయితే తిరిగి వచ్చే ఆలోచన తనకు లేక వద్దన్నానని మనోహర్ వెల్లడించారు. అయితే అందరూ కోరుకుంటే తాను బాధ్యతలనుంచి తప్పించుకునే ప్రయత్నం చేయనని ఆయన అన్నారు.
బోర్డును సరిదిద్దాలనే ఆలోచన ఏ మాత్రం లేని శ్రీనివాసన్ కొన్ని నెలల్లోనే దానిని భ్రష్టు పట్టించారని మాజీ అధ్యక్షుడు పేర్కొన్నారు. ‘తన జట్టుతో సహా ప్రతీ ఒక్కరిని రక్షించేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారు. శ్రీని స్థానంలో నా కొడుకు ఉంటే వెంటనే రాజీనామా చేయమనేవాడిని. ఆయన అన్ని అధికారాలు తన వద్దే ఉండాలనుకుంటారు. తన అల్లుడిని తాను ఎంచుకోలేదని, తన కూతురు అతడిని ఎంచుకుందని కోర్టులో వాదించడం ఎంత హాస్యాస్పదం. కుటుంబానికి మద్దతుగా నిలవలేని వ్యక్తి బోర్డును ఎలా నడిపిస్తారు. గురునాథ్ టీమ్ ఓనర్ అనేందుకు చాలా సాక్ష్యాలున్నాయి. చట్టప్రకారం త్వరలో అన్నీ తేలుతాయి’ అని మనోహర్ విరుచుకు పడ్డారు.
బీసీసీఐ అసంతృప్తి...
శశాంక్ మనోహర్ తాజా వ్యాఖ్యలు బీసీసీఐని ఇబ్బందిలో పడేశాయి. అయితే బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ మాత్రం శ్రీనివాసన్‌ను వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ‘మాజీ అధ్యక్షుడు పత్రికలో చేసి వ్యాఖ్యల పట్ల బీసీసీఐ తొందర పడి స్పందించదు. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు అందరి మద్దతుతో నడిచే సంస్థ. ఇక్కడ అన్నీ సమష్టి నిర్ణయాలే ఉంటాయి. బోర్డు మాజీ అధికారులు ఏమైనా వ్యాఖ్యలు చేసేముందు దీనిని గుర్తుంచుకోవాలని మాత్రమే చెప్పగలను. బోర్డులో ఒకరిని దోషిగా చూపిస్తూ మరొకరు పక్కకు తప్పుకోలేరు’ అని సమాధానమిచ్చారు.