
‘నిజాయతీగా చెప్పాలంటే టెస్టు క్రికెట్ చచ్చిపోతోంది. నేటి కాలంలో ఐదు రోజుల పాటు మ్యాచ్‌లు చూసేంత ఆసక్తి ప్రజలకు ఉండటం లేదు’ ఈ మాటలన్నది ఏ సాధారణ వ్యక్తో కాదు...! సాక్షాత్తు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్...! ఆయన ఉద్దేశం ఎలా ఉన్నా, రెండు రోజుల్లోనే ఆయన వ్యాఖ్యలు సరికాదని నిరూపించేలా దక్షిణాఫ్రికా–శ్రీలంక టెస్టులో అద్భుత ఫలితం వెలువడింది.
టెలివిజన్ రేటింగ్‌లు, మైదానాలకు ప్రేక్షకుల రాక, ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని మనోహర్... టెస్టుల పట్ల నిర్వేదంతో ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవంగా చూస్తే, గత ఏడాది కాలంలో ఈ ఫార్మాట్లో ఒకటికి ఐదు మేటి అనదగ్గ ఫలితాలు వచ్చాయి. సంప్రదాయ క్రికెట్‌కు ఇంకా నూకలు చెల్లలేదని చాటాయి. తాజా పరిణామాలు టెస్టుల పునరుత్తేజానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ‘ఈ మార్పు మంచికే’ అనిపించేలా చేస్తున్నాయి.
సాక్షి క్రీడా విభాగం
శ్రీలంకను దాని సొంతగడ్డపై క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లండ్, యూఏఈలో పాకిస్తాన్‌పై న్యూజిలాండ్ సిరీస్ గెలుపు, ఆస్ట్రేలియాలో తొలిసారి సిరీస్ నెగ్గిన భారత్, వెస్టిండీస్ చేతిలో ఇంగ్లండ్‌కు పరాభవం, తాజాగా దక్షిణాఫ్రికాపై లంక అద్భుత ఛేదన... గత ఆరు నెలల కాలంలో టెస్టు క్రికెట్లో వెలువడిన గొప్ప ఫలితాలివి. వీటిని చూస్తే టెస్టు క్రికెట్ ‘కాల’ పరీక్షను క్రమంగా నెగ్గుకొస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామంలో కోహ్లి, బుమ్రా, పుజారా, కమిన్స్, కుశాల్ పెరీరా, రూట్, విలియమ్సన్ వంటి వారు తమదైన స్థాయి ఆటతో సంప్రదాయ ఫార్మాట్‌కు ఊపిరిలూదుతున్నారు. మైదానాలు నిండాయా? లేదా? ఆదాయం వచ్చిందా? రాలేదా? అనే లెక్కలతో సంబంధం లేకుండా క్రికెట్ ఆత్మను నిలబెడుతున్నారు.
పెరిగింది... పోరాట పటిమ
జట్టు ఎంత బలంగా ఉండనీ, ఎంత గొప్ప ఆటగాళ్లు ఉండనీ, కొంతకాలం క్రితం వరకు ‘విదేశీ గడ్డపై టెస్టు విజయాలు’ అనేవి ఎండమావుల్లానే ఉండేవి. కానీ, ఇప్పుడా లెక్కమారింది. పర్యాటక జట్లు ఏకంగా ‘సిరీస్ విజయాలు’ సాధిస్తున్నాయి. పాకిస్తాన్‌కు దాదాపు సొంతగడ్డలాంటి యూఏఈలో జరిగిన మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో వెనుకబడి మరీ న్యూజిలాండ్ గెలిచిన తీరే దీనికి నిదర్శనం. ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో చుట్టేసే లంకను 0–3తో ఇంగ్లండ్ మట్టి కరిపించిన ఘనత కూడా ఈ కోవలోదే. ఇక టీమిండియా... ఆస్ట్రేలియాలో సృష్టించిన చరిత్ర ఎప్పటికీ చెరగనిదే. ఈ విజయాలన్నీ పరిస్థితులతో సంబంధం లేకుండా పర్యాటక జట్లలో పెరిగిన పోరాట పటిమను చూపుతున్నాయి.
ఒకప్పటి ‘విన్’డీస్‌లా...
వెస్టిండీస్‌తో మ్యాచ్ అంటే ఒకప్పుడు మైదానంలోకి దిగకముందే ప్రత్యర్థి బేజారైపోయేది. కారణాలు ఏవైనా అలాంటి జట్టు రెండు దశాబ్దాలుగా సొంతగడ్డ పైనా పేలవంగా ఆడుతోంది. కరీబియన్ల టెస్టు ప్రమాణాలు పూర్తిగా పడిపోయాయని అనుకుంటున్న వేళ... ఇంగ్లండ్ వంటి మేటి జట్టును ఇటీవల అలవోకగా ఓడించి ఔరా అనిపించింది. మునుపటి వెస్టిండీస్ ఆధిపత్యం మన కళ్లముందు కనిపించింది. వరుస ఓటములు, ఆటగాళ్ల సస్పెన్షన్లు, కెప్టెన్ల తొలగింపులతో ఇక ‘దేవుడే కాపాడాలి’ అన్న స్థితిలో ఉన్న శ్రీలంక... కుశాల్ పెరీరా అమోఘమైన ఇన్నింగ్స్‌తో శనివారం దక్షిణాఫ్రికాపై సాధించిన విజయాన్నీ ఇదే దృష్టితో చూడాల్సి ఉంటుంది.
ఆ రెండు ‘డ్రా’లూ...
టెస్టుల్లో గెలుపు అనేది గొప్ప ప్రామాణికం అయితే, తప్పదనేలా ఉన్న ఓటమిని తప్పించుకుని ‘డ్రా’గా ముగించడమూ అంతే ప్రాధాన్యం ఉన్నది. అభిమానులతో పాటు సాధారణ ప్రజలకూ ఇలాంటి ఫలితాలు కిక్ ఇస్తాయి. గతేడాది అక్టోబరులో యూఏఈలో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా, డిసెంబరులో న్యూజిలాండ్‌పై శ్రీలంక రోజంతా తీవ్రంగా పోరాడి ‘డ్రా’నందం పొందాయి.
కళకళలాడాలంటే...
పూర్తిస్థాయిలో కాకపోయినా... కళాత్మకత కనిపించకపోవడం, ఆదరా‘బాదరా’ ఆట కారణంగా టి20లంటే క్రికెట్ వీరాభిమానుల్లో క్రమేణా ఆసక్తి తగ్గిపోతోంది. ఇదే భావన సాధారణ ప్రేక్షకులకు చేరడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అలాంటి దశ వచ్చినప్పుడు అందరి దృష్టీ మళ్లీ టెస్టులపైనే పడుతుంది. అందుకని టెస్టులకు జవజీవాలు కల్పించే ప్రక్రియకు పునాది పడాలి. ఇరు జట్లకు సమానంగా అనుకూలించే పిచ్‌లు సహా ఇతర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలి. ఫలితాలను ప్రభావితం చేస్తోందని భావిస్తున్న ‘టాస్’పై ఉన్న ప్రయోగాత్మక ఆలోచనలను అమల్లోకి తేవాలి. తద్వారా రసవత్తర సమరాలు జరిగి అభిమానులు మళ్లీ మైదానాలకు పోటెత్తడం ఖాయం.
మరువలేం...
ఏడాది కాలంగా రసవత్తరంగా సాగిన టెస్టు సమరాలివి...
►2018 జనవరి చివర్లో జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్‌పై 241 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా రెండు సెషన్ల పాటు ఆధిపత్యం చూపింది. కానీ, చివరికి షమీ (5/28), ఇషాంత్ (2/57), బుమ్రా (2/31) దెబ్బకు ఫలితం టీమిండియా వైపు మొగ్గింది. ఈ మ్యాచ్‌లో భారత్... గెలిచిందనే కంటే, ‘విజయాన్ని గుంజుకున్నది’ అనడమే సరైనది.
►సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో టీమిండియా చక్కని పోరాటం చూపింది. యువ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (149), రిషభ్ పంత్ (114) దూకుడైన శతకాలతో ఓ దశలో గెలిచేస్తుందేమో అనిపించింది. వారిద్దరూ ఔటయ్యాక కానీ, ఇంగ్లండ్ విజయం ఖాయం కాలేదు.
►అక్టోబరులో యూఏఈలో పాకిస్తాన్‌తో టెస్టును ఆస్ట్రేలియా అద్భుతం అనదగ్గ రీతిలో ‘డ్రా’ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 280 పరుగుల ఆధిక్యం కోల్పోయి, రెండో ఇన్నింగ్స్‌లో 461 పరుగుల ఛేదనకు దిగిన ఆసీస్... ఉస్మాన్ ఖాజా (141), కెప్టెన్ పైన్ (61 నాటౌట్) దృఢ సంకల్పంతో ఓటమిని తప్పించుకుంది.
►డిసెంబరులో పాకిస్తాన్‌తో యూఏఈలో జరిగిన టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న కివీస్... రెండో ఇన్నింగ్స్‌లో విలియమ్సన్ (139), నికోల్స్ (126) అద్భుత శతకాలతో పుంజుకొని ప్రత్యర్థికి 279 పరుగుల లక్ష్యం విధించింది. పాక్‌ను 156 పరుగులకే ఆలౌట్ చేసి గెలుపొందింది. న్యూజిలాండ్... పాక్‌పై టెస్టు సిరీస్ నెగ్గడం 49 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
►డిసెంబరులో న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో శ్రీలంక బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండిస్ (116), ఏంజెలో మాథ్యూస్ (117) రోజంతా బ్యాటింగ్ చేసి జట్టును ఒడ్డున పడేశారు. ఐదో రోజు వర్షం పడటంతో లంకకు ఓటమి తప్పింది.