‘బ్రాండ్' బజాయించింది | best rank of sania in her career | Sakshi
Sakshi News home page

‘బ్రాండ్' బజాయించింది

Published Mon, Oct 27 2014 1:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:25 PM

‘బ్రాండ్' బజాయించింది

‘బ్రాండ్' బజాయించింది

సాక్షి క్రీడా విభాగం ఏడేళ్ల క్రితం సానియా మీర్జా సింగిల్స్‌లో తన కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ (27)ను అందుకుంది. అంతే... ఆ తర్వాత ఆమె ఆటతీరు గతి తప్పింది.

సాక్షి క్రీడా విభాగం
 ఏడేళ్ల క్రితం సానియా మీర్జా సింగిల్స్‌లో తన కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ (27)ను అందుకుంది. అంతే... ఆ తర్వాత ఆమె ఆటతీరు గతి తప్పింది. దీనికి గాయాలు కూడా జత కావడంతో కెరీర్ అంతా తిరోగమనమే తప్ప చెప్పుకోదగ్గ ప్రదర్శన ఒక్కటీ నమోదు కాలేదు. సరిగ్గా చెప్పాలంటే తొలి రౌండ్‌లోనే పరాజయం, మహా అయితే రెండో రౌండ్‌లో వెనుదిరిగిన సానియా... ఇవే పతాక శీర్షికలుగా నిలిచాయి. ఈ దశలో ఆమె తీసుకున్న ఒక నిర్ణయం సానియా స్థాయిని పెంచేసింది. మరో దశాబ్ద కాలం పాటు టెన్నిస్ ప్రపంచంలో నిలబడేలా చేసింది. అదే డబుల్స్‌ను ఎంచుకోవడం. ముఖ్యంగా గత రెండేళ్లుగా సానియా సాధిస్తున్న విజయాలు ఒక్కసారిగా వరల్డ్ టెన్నిస్ సర్క్యూట్ దృష్టిని ఆకర్షించేలా చేశాయి.

 వేర్వేరు భాగస్వాములతో...
 డబుల్స్‌లో చెలరేగి ఆడుతున్న సానియా ఆ విభాగంలో ప్రత్యేకంగా శిక్షణ పొందలేదు. డబుల్స్‌కు కీలకమైన సర్వ్ అండ్ వ్యాలీ రెండింటిలోనూ ఆమె బలహీనమే. అయితే తన బలమైన ఫోర్‌హ్యాండ్‌తో పాటు పోరాటపటిమతోనే ఆమె తన లోపాలను అధిగమించగలిగింది. తన భాగస్వామిని ఎంచుకోవడంలో కూడా సానియా విజయాలకు బాట వేసింది. అయితే ఒకే భాగస్వామికి పరిమితం కాకుండా వేర్వేరు ప్లేయర్లతో కలిసి విజయాలు సాధించడం సానియా ప్రత్యేకతను చూపిస్తోంది. 12 మంది వేర్వేరు భాగస్వాములతో కలిసి సానియా తన కెరీర్‌లో 22 డబ్ల్యూటీఏ టైటిల్స్ సొంతం చేసుకోవడం విశేషం.

అంటే...సహచరి ఎవరైనా తనదైన ముద్ర వేయడం, ఆధిక్యం కనబర్చడం సానియా ప్రతిభకు నిదర్శనం. ఇది సింగపూర్ టోర్నీ సెమీస్‌లో బాగా కనిపించింది. ఎలెనా వెస్నినా (రష్యా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన ఆమె, ఆ తర్వాత బెథానీ మాతెక్‌తో మూడు టైటిల్స్ గెలిచింది. కారా బ్లాక్‌తో సానియా భాగస్వామ్యం మాత్రం అద్భుత విజయాలు అందించింది. వీరిద్దరు కలిసి ఐదు టోర్నీలలో టైటిల్స్ గెలుచుకోగా, మరో నాలుగింటిలో రన్నరప్‌గా నిలిచారు. వచ్చే ఏడాది నుంచి సానియా సు వీ సెయి (చైనీస్ తైపీ)తో కలిసి బరిలోకి దిగనుంది.

 అగ్రస్థానంలో...
 టెన్నిస్ డబుల్స్‌లో ఇప్పుడు భారత బెస్ట్ ప్లేయర్ ఎవరు అంటే తడుముకోకుండా సానియా మీర్జా అని సమాధానం చెప్పేయవచ్చు. పురుషుల డబుల్స్‌లో భారత్ తరఫున అత్యుత్తమ విజయాలు సాధించిన లియాండర్ పేస్ 30వ ర్యాంక్‌కు దిగజారగా, రోహన్ బొపన్న 28వ ర్యాంక్‌లో పోరాడుతున్నాడు. మహిళల డబుల్స్‌లో ఈ ఏడాది జూలైలో 5వ ర్యాంక్‌కు చేరిన ఆమె, ప్రస్తుతం ఎనిమిదో ర్యాంక్‌లో ఉంది.

ర్యాంకింగ్ పాయింట్ల కోసం పురుషుల విభాగంలో భారత ఆటగాళ్లు ఆసియా క్రీడలకు దూరమైతే... సానియా అటు ఏషియాడ్‌లోనూ దేశం తరఫున ఆడి స్వర్ణం గెలవడం, ఇటు పాయింట్లు కాపాడుకొని డబ్ల్యూటీఏ ఫైనల్స్‌కు అర్హత సాధించగలడం ఆమె పట్టుదలకు నిదర్శనం.

 అదీ సాధిస్తే...
 సానియా మీర్జా అంటే వివాదాలే అని విమర్శించేవారికి ఆమె తాజా విజయాలే సమాధానం. సింగిల్స్‌తో పోలిస్తే డబుల్స్‌కు అంత విలువ ఉండదని కూడా చాలా మంది భావిస్తారు. కానీ 150కు పైగా దేశాల క్రీడాకారిణులు పోటీ పడే డబ్ల్యూటీఏ సర్క్యూట్‌లో ఆమె సాధించిన ఘన విజయాలను తక్కువ చేయలేం. సర్క్యూట్‌లో 2004 నుంచి చురుగ్గా కొనసాగుతున్న మీర్జా, ఈ పదేళ్లలో రెండుసార్లు (2005, 2008) మినహా ప్రతీ ఏడాది ఏదో ఒక టైటిల్ నెగ్గడం విశేషం.

మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన సానియా మీర్జాకు మహిళల డబుల్స్‌లో మాత్రం ఆ లోటు మిగిలిపోయింది. 2011లో ఎలెనా వెస్నినాతో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరడమే ఆమె అత్యుత్తమ ప్రదర్శన. ఇక 2012 ఒలింపిక్స్‌లో పలు వివాదాల అనంతరం మిక్స్‌డ్‌లో క్వార్టర్స్ చేరిన సానియా 2016లో ఆ పతకాన్ని కూడా అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 28 ఏళ్ల మీర్జా రాబోయే రోజుల్లో ఇదే జోరును కొనసాగిస్తే డబుల్స్ ప్రపంచంలో అత్యుత్తమ క్రీడాకారిణిలలో ఒకరిగా నిలవడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement