జింఖానా, న్యూస్‌లైన్: బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్‌ఐ) ఐఎంజీ రిలయన్స్ కాలేజ్ లీగ్‌లో బిట్స్ పిలాని జట్టు విజయం సాధించింది. సికింద్రాబాద్‌లోని వైఎంసీఏలో జరుగుతున్న ఈ లీగ్‌లో పురుషుల విభాగంలో బిట్స్ పిలాని జట్టు 49-45తో అవంతి డిగ్రీ కాలేజి జట్టుపై గెలుపొందింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన బిట్స్ పిలాని ఒక సమయంలో 16-6తో ముందంజలో ఉండగా... అవంతి కాలేజి ఆటగాళ్లు రవీన్ (17), సమీర్ (13) ప్రతిఘటించేందుకు తీవ్రంగా శ్రమించారు.
అయితే మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి 25-20తో బిట్స్ పిలాని ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. బిట్స్ పిలాని క్రీడాకారులు స్వార్నిమ్ (20), ఇషాన్ (12) చివరి నిమిషంలో చాకచక్యంగా వ్యవహరించి జట్టుకు విజయాన్ని చేకూర్చారు. మరో వైపు మహిళల విభాగంలో బిట్స్ పిలాని జట్టుకు చుక్కెదురైంది.
సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజి 47-26తో బిట్స్ పిలాని జట్టుపై గెలుపొందింది. మ్యాచ్ ప్రథమార్ధం ముగిసే సమయానికి 21-9తో సెయింట్ ఫ్రాన్సిస్ జట్టు ముందంజలో ఉంది. అనంతరం బిట్స్ పిలాని జట్టు ఆటగాళ్లు అపూర్వ (13), శ్రీవాణి (9), మేహ (4) చెమటోడ్చినప్పటికీ ఫలితం దక్కలేదు. సెయింట్ ఫ్రాన్సిస్ క్రీడాకారులు సిమి (20), ఝాన్సీ (12), శ్రేయ (7) జట్టు విజయంలో కీలక పాత్ర వహించారు.
బిట్స్ పిలాని విజయం
Published Sun, Jan 19 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM
Advertisement
Advertisement