
చివరి వన్డేలోనూ దుమ్మురేపాడు
హామిల్టన్: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ తన చివరి వన్డేలోనూ దుమ్మురేపాడు. మెరుపు ఇన్నింగ్స్తో అభిమానులను అలరించాడు. ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో మెకల్లమ్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్ 45.3 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ మార్ష్ మూడు, హజ్లెవుడ్, హేస్టింగ్స్, బొలాండ్ తలా రెండు వికెట్లు తీశారు.
న్యూజిలాండ్ జట్టులో గుప్టిల్ (59), ఎలియట్ (50), మెకల్లమ్ మినహా ఇతర బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. దూకుడు మీదున్న మెకల్లమ్ హాఫ్ సెంచరీకి చేరువలో మార్ష్ బౌలింగ్లో అవుటయ్యాడు.
బ్రెండన్ మెకల్లమ్.. పేరు వింటేనే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు పులకించిపోతారు. గత దశాబ్ధకాలంలో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో తనదైన ముద్ర వేసిన కివీస్ క్రికెటర్ మెకల్లమే. భారీషాట్లకు, విధ్వసంక ఇన్నింగ్స్‌లకు మారుపేరుగా ఉన్న మెకల్లమ్.. న్యూజిలాండ్ జట్టు తరఫున అనేక వ్యక్తిగత రికార్డులు నెలకొల్పాడు.
ఐపీఎల్‌కు అద్భుత ఆరంభం ఇచ్చిన వీరుడు.. కివీస్ తరఫున టెస్టుట్లో ఏకైక ట్రిపుల్ సెంచరీ చేసిన ధీరుడు.. న్యూజిలాండ్ జట్టును ప్రపంచకప్ ఫైనల్‌కు చేర్చిన యోధుడు. ప్రస్తుత తరంలో ఏ న్యూజిలాండ్ ఆటగాడికి సాధ్యంకానీ రీతిలో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన బ్రెండన్ మెకల్లమ్ ఔటయిన తర్వాత ఆసిస్ ఆటగాళ్లు 'గార్డ్ ఆఫ్ హానర్' తెలిపారు.
కీపర్‌గా జట్టులోకి అరంగేట్రం చేసి అప్పటి స్టార్ల నీడలో కొద్దికొద్దిగా ఎదిగిన మెకల్లమ్.. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత జూనియర్లకు మార్గదర్శిగా నిలిచాడు. మెరుపు వేగంతో పరుగులు చేసి ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్‌లను తేలిగ్గా లాగేయడంలో తనదైన శైలిని ఏర్పర్చుకున్న మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమవడం అభిమానులకు లోటే అని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియాపై మెరుపు ఇన్నింగ్స్..
2002లోనే కీపర్ అరంగేట్రం చేశాడు మెకల్లమ్. అయితే మెక్‌మిలన్, నాథన్ అస్టల్, స్టీఫెన్ ఫ్లెమింగ్, క్రిస్ కెయిన్స్ వంటి స్టార్లు ఉండడంతో అతని ప్రతిభ బయట పడలేదు. ఓపెనింగ్‌లో వచ్చినా పెద్దగా రాణించకపోవడంతో అతణ్ని మిడిలార్డర్‌కు మార్చేశారు. అయినా మెకల్లమ్ మెరవలేదు. మరో కీపర్ లేకపోవడం.. మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలతో జట్టులో కొనసాగాడు. అసలు వన్డేల్లో తొలిసారి అర్ధసెంచరీ చేయడానికే ఏకంగా 29 ఇన్నింగ్స్‌లు పట్టింది. 2005లో ఆస్ట్రేలియాపై మెరుపు ఇన్నింగ్స్‌ను ఆడాడు. ఆ మ్యాచ్‌లో 331 పరుగులను ఛేదించే క్రమంలో కివీస్ 258 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన బ్రెండన్.. 25 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. పదోవికెట్‌కు వెటోరీతో కలసి 74 పరుగులు జోడించి ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు.
సెంచరీలతో కొలవలేం..
మెకల్లమ్ కెరీర్‌ను అతడు చేసిన పరుగులు.. బాదిన శతకాలతో వర్ణించలేం. భారీగా పరుగులు చేయకపోయినా.. సగటు ఎక్కువగా లేకపోయినా.. ఒక్కో మ్యాచ్‌లో అతడు మెరుపు వేగంతో చేసిన పరుగులే మ్యాచ్‌లో తన జట్టు గెలిచేందుకు పునాదులు వేశాయి. నిజానికి మెకల్లమ్ తన 144వ ఇన్నింగ్స్‌లో తొలిసెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 166 పరుగులు సాధించాడు. సీనియర్లు రిటైరయ్యాక ఓపెనింగ్‌కు మారిన మెక్.. పవర్‌ప్లే ఎలా ఆడాలో చూపించాడు. ఈ 14 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టును ముందుండి నడిపించాడు. గత కొంతకాలంగా కీపింగ్‌కు దూరంగా ఉంటున్న మెకల్లమ్ ఫీల్డింగ్‌లో అదరగొడుతున్నాడు.
టీ20ల రాకతో మరోస్థాయికి..
వన్డే, టెస్టుల్లో మెకల్లమ్ ఆట ఒక ఎత్తు.. టీ20ల్లో మరోఎత్తు. టీ20ల రాకతో మెకల్లమ్ ఒక్కసారిగా సూపర్‌స్టార్‌గా మారిపోయాడు. ఓపెనింగ్‌లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. ముఖ్యంగా ఐపీఎల్ తొలిమ్యాచ్‌లో మెకల్లమ్ విధ్వంసం మర్చిపోలేం. కోల్‌కతా తరఫున బెంగళూరుపై 73 బంతుల్లోనే 158 పరుగులు చేశాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో దుమ్మురేపాడు. టీ20ల్లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు బ్రెండనే. ఈ ఫార్మాట్‌లో రెండు సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు కూడా అతడే.
ముందుండి నడిపించాడు..
2009లో జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన మెక్.. నాయకుడిగా ముందుండి నడిపించాడు. టెస్టుల్లో నిలకడైన ఆటతో మార్గనిర్ధేశం చేశాడు. ఇక 2015 ప్రపంచకప్ సందర్భంగా జట్టును తొలిసారిగా ఫైనల్‌కు చేర్చాడు. దాంతో ఆ దేశంలో క్రికెట్‌కు మరోసారి క్రేజ్‌ను తెచ్చాడు. టోర్నీలో ప్రతిమ్యాచ్‌లో మెరుపు ఆరంభాలిచ్చి జట్టును చివరిమెట్టుకు చేర్చాడు.
బాదడానికే ఆడినట్లు..
మెకల్లమ్ ఆడే శైలే విభిన్నంగా ఉంటుంది. క్రీజ్‌లో చురుగ్గా కదలడం అతని ఆటలో ప్రత్యేకం. బౌలర్ బంతి వేయకముందే క్రీజ్‌లో నుంచి ముందుకి వచ్చి ఫీల్డర్ల తలపై నుంచి బౌండరీలు బాదడంలో దిట్ట. ఇక పేసర్ల బౌలింగ్‌లో పుల్‌షాట్లు, స్ట్రైట్‌షాట్లు ఆడడం చూసి తీరాల్సిందే. వికెట్లకు అడ్డంగా వచ్చి ఫైన్‌లెగ్‌వైపు సిక్స్‌లు కొట్టడంలో ఆరితేరాడు. ఫీల్డింగ్‌లో మెరుపు విన్యాసాలు ప్రదర్శిస్తుంటాడు. డైవ్ దూకడంలోనూ.. క్లిష్టమైన క్యాచ్‌లు పట్టడంలోనూ వీరుడే.
* క్రికెట్‌కు బ్రెండన్ చేసిన సేవలకు గుర్తింపుగా 2015లో ఆ దేశ నాలుగో అత్యున్నత పౌరపురస్కారం 'ఆఫీసర్ ఆఫ్ ద న్యూజిలాండ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్' అందుకున్నాడు.
* అయితే 34 ఏళ్ల మెకల్లమ్ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన లీగ్‌ల రూపంలో తన విన్యాసాలు కొనసాగించడం అభిమానులకు ఊరటే.
* ఇప్పటివరకు 99 టెస్టులు ఆడిన మెక్.. ఆసీస్‌తో వన్డే సిరీస్ తర్వాత రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడి అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నాడు. టెస్టుల్లో 100 సిక్స్‌లు బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కిన ఈ స్టార్.. అరంగేట్రం నుంచి వరుసగా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.