ఆసీస్ దీటైన జవాబు
స్మిత్, బర్న్స్ సెంచరీలు
న్యూజిలాండ్‌తో రెండో టెస్టు
క్రైస్ట్‌చర్చ్: ఓపెనర్ జో బర్న్స్ (321 బంతుల్లో 170; 20 ఫోర్లు), కెప్టెన్ స్టీవ్ స్మిత్ (241 బంతుల్లో 138; 17 ఫోర్లు) సెంచరీలతో చెలరేగడంతో... న్యూజిలాం డ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా దీటైన జవాబు ఇచ్చింది. ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 110 ఓవర్లలో 4 వికెట్లకు 363 పరుగులు చేసింది. వోజెస్ (2 బ్యాటిం గ్), లయోన్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ ఇంకా 7 పరుగులు వెనుకబడి ఉంది. ఓవర్‌నైట్ స్కోరు 57/1తో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ ఆరంభంలోనే ఉస్మాన్ ఖాజా (24) వికెట్‌ను కోల్పోయింది. అయితే స్మిత్, బర్న్స్ నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిం చారు. పచ్చిక వికెట్‌పై కివీస్ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో చెలరేగినా... రెండు సెషన్ల పాటు వికెట్‌ను కాపాడుకున్నారు.
సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ క్రీజులో కుదురుకున్నారు. ఈ క్రమంలో స్మిత్ కెరీర్‌లో 14వ సెంచరీ పూర్తి చేయగా... బర్న్స్ కెరీర్ బెస్ట్ స్కోరును నమోదు చేశాడు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు 289 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కివీస్‌పై మూడో వికెట్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అయితే ఆట చివర్లో కొత్త బంతితో వాగ్నేర్ మ్యాజిక్ చేశాడు. 5 బంతుల తేడాలో స్మిత్, బర్న్స్ వికెట్లను తీసి ఆసీస్ దూకుడుకు అడ్డుకట్ట వేశాడు. తర్వాత వోజెస్, లయోన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. బౌల్ట్, వాగ్నేర్ చెరో 2 వికెట్లు తీశారు. కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 370 పరుగులకు ఆలౌటైంది. స్మిత్‌కు బౌన్సర్ దెబ్బ: టీ విరామానికి ముందు ఓవర్‌లో వాగ్నేర్ వేసిన షార్ట్ పిచ్ బంతి అన్యూహంగా ఎగిసి వచ్చి స్మిత్ తలను బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా కెప్టెన్ కుప్పకూలిపోయాడు. అయితే ఫీల్డర్లు వెంటనే సపర్యలు చేయడంతో పాటు కాస్త తేరుకున్న స్మిత్.. తర్వాత వైద్య చికిత్స తీసుకుని ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.